కనుల పండువగా ఆరుద్రోత్సవం
నెల్లూరు(బృందావనం): మూలాపేటలోని భువనేశ్వరి సమేత మూలస్థానేశ్వరస్వామి దేవస్థానంలో శనివారం శివముక్కోటిని (ఆరుద్రోత్సవం) కనులపండువగా నిర్వహించారు. తొలుత శివ కామసుందరి సమేత నటరాజస్వామివారికి మహన్యాస పూర్వక ఏకాదశ రుద్రాభిషేకం జరిపారు. స్వామివారికి రుద్ర పారాయణ సహిత అన్నాభిషేకం ఉదయం 10 గంటలకు నిర్వహించారు. స్వామివారికి అత్యంత ప్రీతికరమైన నాట్యం, నాదం, గానం మండపంలో నేత్రపర్వంగా చేశారు. ఆరుద్రోత్సవంలో స్వామివారిని దర్శించుకునేందుకు తరలివచ్చి భక్తజనంతో దేవస్థానం కిటకిటలాడింది. తదుపరి రాత్రి స్వామివారి పేట ఉత్సవం ఘనంగా నిర్వహించారు. ఉభయదాతలుగా దేవిశెట్టి వెంకటసుబ్బయ్య కుమారులు వ్యవహరించారు. కార్యక్రమాలను దేవస్థానం ఈఓ అర్వభూమి వెంకట శ్రీనివాసులురెడ్డి పర్యవేక్షించారు.


