సాంకేతికతతో త్వరితగతిన కేసుల ఛేదన
నెల్లూరు(క్రైమ్): సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించి కేసులను త్వరితగతిన ఛేదించాలని గుంటూరు రేంజ్ ఐజీ సర్వశ్రేష్ట త్రిపాఠి సూచించారు. పోలీస్ శాఖలో అందుబాటులో ఉన్న సాంకేతిక టూల్స్‌పై తన కార్యాలయం నుంచి నెల్లూరు జిల్లా పోలీస్ అధికారులకు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా శనివారం అవగాహన కల్పించిన అనంతరం ఆయన మాట్లాడారు. నేర నియంత్రణ, కేసుల దర్యాప్తు, ఆధారాల సేకరణలో ఆధునిక సాంకేతిక టూల్స్ కీలకపాత్రను పోషిస్తున్నాయని చెప్పారు. సీసీటీఎన్నెస్, డిజిటల్ అండ్ సైబర్ ఫొరెన్సిక్, మొబైల్ డేటా విశ్లేషణ, సాఫ్ట్‌వేర్ ఆధారిత పోలీసింగ్ టూల్స్, సీసీ కెమెరాల ఫుటేజీ విశ్లేషణ, డ్రోన్ టెక్నాలజీని సమర్థంగా వినియోగించుకోవాలని ఆదేశించారు. మారుతున్న కాలానికి అనుగుణంగా అధికారులు తమ నైపుణ్యాలను పెంపొందించుకోవాలని సూచించారు. డీపీఓలోని మినీ కాన్ఫరెన్స్ హాల్ నుంచి సదస్సుకు ఎస్పీ అజిత వేజెండ్ల తదితరులు హాజరయ్యారు.


