నిషేధిత పాపం చంద్రబాబుదే
నెల్లూరు రూరల్: రెవెన్యూ సమస్యలను తామే పరిష్కరిస్తున్నామనే రీతిలో టీడీపీ ప్రభుత్వం డబ్బా కొట్టుకుంటోందని మాజీ మంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు కాకాణి గోవర్ధన్‌రెడ్డి విమర్శించారు. నగరంలోని పార్టీ జిల్లా కార్యాలయంలో విలేకరులతో శనివారం ఆయన మాట్లాడారు. 22ఏ జాబితాలో భూములను పెట్టిందే చంద్రబాబు అని, ఈ విషయంలో వక్రీకరణతో కూడిన ప్రచారం చేస్తోందని ధ్వజమెత్తారు. , 2014 – 19 మధ్య వెబ్‌ల్యాండ్ పేరు చెప్పి, తహసీల్దార్ కార్యాలయాల్లో టీడీపీ కార్యకర్తలు, వారికి సంబంధించిన మనుషులను పెట్టి గిట్టని వారి భూములన్నింటినీ 22ఏలో పెట్టారని, ఫలితంగా యజమానులు నానా అవస్థలు పడుతున్నారని చెప్పారు. తమ ప్రభుత్వం వచ్చాకే బాధితులకు ఊరట లభించిందనే అంశాన్ని గుర్తుచేశారు.
2024 తర్వాత కష్టాలు ప్రారంభం
2024లో చంద్రబాబు మరోసారి సీఎం అయ్యాక అసైన్డ్, ఇతర కేటగిరీల భూములకు సంబంధించిన ఫ్రీ హోల్డ్ విషయంలో నానా ఆరోపణలు చేసి, ఇప్పటికీ యజమానులను నానా కష్టాలకు గురిచేస్తున్నారని ఆరోపించారు. అక్రమాలు జరిగాయని ఎన్ని ఆరోపణలు చేసినా, ఎలాంటి ఆధారాల్లేవని అధికారులే చెప్పారన్నారు. రాజధాని పేరిట అమరావతిలో ఎస్సీ, ఎస్టీ, బీసీ రైతులను మభ్యపెట్టి 1100 ఎకరాలను కొట్టేశారని ఆరోపించారు. అసైనన్డ్‌దారుల చేతుల్లో భూములుంటే పరిహారం రాదని.. ప్లాట్లు రావంటూ పథకం ప్రకారం ప్రచారం చేసి లాగేసుకున్నారని విమర్శించారు. ఆ తర్వాత జీఓ ఇచ్చి, వాటిని పప్పుబెల్లాలకు కొనుగోలు చేసి, చేతులు మారాక పూలింగ్‌లోకి తీసుకొని, ప్లాట్లు కేటాయించి వాటిని తిరిగి విక్రయించి రూ.కోట్లు కొల్లగొట్టారని ధ్వజమెత్తారు.
సమస్యకు తమ హయాంలోనే పరిష్కారం
పేదలకు న్యాయం చేయాలనే ఉద్దేశంతో సీఎంగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం అసైన్డ్ చట్టానికి జగన్‌మోహన్‌రెడ్డి సవరణలు చేశారని చెప్పారు. ఒరిజినల్ అసైనీలు మాత్రమే న్యాయబద్ధంగా, తమ ఇష్టపూర్వకంగా అవసరానికి విక్రయించుకునే హక్కును కల్పించారని గుర్తుచేశారు. ఈ చట్టం పేదలకు పూర్తిగా అండగా నిలిచిందని, ఇలాంటి సందర్భాల్లో కుంభకోణాలకు ఆస్కారం ఎక్కడ ఉంటుందని ప్రశ్నించారు.
ఎన్నో జాగ్రత్తలు తీసుకున్నారు..
ఈ చట్టాన్ని తెస్తున్న సమయంలో చాలా మంది ఒత్తిళ్లు తెచ్చారని, అయితే అప్పటి సీఎం జగన్‌మోహన్‌రెడ్డి ససేమిరా అన్నారన్నారు. ప్రతి విషయంలోనూ ప్రభుత్వం ఎన్నో జాగ్రత్తలు తీసుకుందని తెలిపారు. ఈ రకంగా దాదాపు తొమ్మిది లక్షల ఎకరాలను 22ఏ నుంచి తొలగించారని, అలాంటిది టీడీపీ ప్రభుత్వం వచ్చాక రిజిస్ట్రేషన్లు నిలిపేయమని, ఫ్రీ హోల్డ్ చేయొద్దని ఆదేశాలిచ్చి భూ యజమానులను ఇబ్బంది పెడుతోందని ఆరోపించారు. 27.4 లక్షల ఎకరాలకు సంబంధించి 15.2 లక్షల మంది రైతులకు మేలు చేసింది తామే.. 22ఏ నుంచి మినహాయించామంటూ రెవెన్యూ మంత్రి ప్రచారం చేసుకుంటున్నారని విమర్శించారు. తమ హయాంలో సమగ్ర సర్వే జరిగితే రైతుల భూములు పోతాయంటూ దుష్ప్రచారం చేశారని, ల్యాండ్ టైట్లింగ్‌ను భూతంగా చూపారని ఆరోపించారు. ఇప్పుడు సమగ్ర సర్వే అంటూ తమ పద్ధతులనే అనుసరిస్తున్నారని తెలిపారు.
22ఏలో భూములు చేర్చిన వైనం
నాటి సీఎం జగన్ హయాంలో
వీటికి మోక్షం
తిరిగి అదే జాబితాలోకి మార్చిన సర్కార్
మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి


