రేపట్నుంచి ఎఫ్‌ఏ – 3 పరీక్షలు
నెల్లూరు (టౌన్): జిల్లాలోని ఆన్ని యాజమాన్య పాఠశాలల్లో ఒకటి నుంచి పదో తరగతి విద్యార్థులకు ఎఫ్‌ఏ – 3 పరీక్షలను సోమవారం నుంచి గురువారం వరకు నిర్వహించాలని డీఈఓ బాలాజీరావు శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఎస్సీఈఆర్టీ ఇచ్చిన ప్రశ్నపత్రాలతోనే నిర్వహించాలని చెప్పారు. అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో గవర్నమెంట్ పంపిణీ చేసిన అసెస్మెంట్ బుక్స్‌లోనే రాయించాలని చెప్పారు. అనంతరం ఉపాధ్యాయులు మూల్యాంకనం చేసి మార్కులను అప్‌లోడ్ చేయాలని సూచించారు.
పులి సంచారంపై
వీడని కలకలం
దుత్తలూరు: మండలంలోని నందిపాడు ఎస్సీ కాలనీ సమీపంలో పులి సంచరించిందనే ప్రచారం శనివారం జరిగింది. మండలంలోని నందిపాడు బీట్ పరిధిలో గల రేగుమానుకుంటలో గేదె కళేబరాన్ని స్థానికులు గుర్తించారు. నందిపాడు ఎస్సీ కాలనీకి చెందిన ప్రభాకర్‌కు చెందిన గేదె అటవీ ప్రాంతంలో మృతి చెందిందనే అంశాన్ని కనుగొన్నారు. పులి చంపి ఉంటుందనే ప్రచారం జరిగింది. ఈ వార్త దావనంలా వ్యాపించడంతో స్థానికులు ఆందోళనకు గురయ్యారు. దీంతో ఘటన స్థలానికి అధికారులు చేరుకొని.. గేదె కళేబరం, పెంటికలు, పాదముద్రలను గుర్తించి ఉన్నతాధికారులకు పంపగా, పులి కాదని నిర్ధారించారు. గ్రామస్తులు మాత్రం పులి లేదా చిరుతపులి అని భావిస్తున్నారు. గేదెకు పోస్ట్‌మార్టాన్ని నిర్వహించాలని నిర్ణయించారు. ఏబీఓ బచ్చల వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.
విద్యతో ఉజ్వల భవిష్యత్తు
ఆత్మకూరు: ప్రభుత్వం అందించే సౌకర్యాలను సద్వినియోగం చేసుకొని విద్యలో రాణించి ఉజ్వల భవిష్యత్తును నిర్మించుకోవాలని ఎస్సీ సంక్షేమ సాధికారత జిల్లా అధికారి శోభారాణి పేర్కొన్నారు. పట్టణంలోని ఎస్సీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలోని బాలబాలికల హాస్టళ్లను ఆర్డీఓ పావనీతో కలిసి శనివారం సందర్శించారు. అక్కడి విద్యార్థులకు పరీక్ష ప్యాడ్లు, విద్యాసామగ్రిని అందజేశారు. అనంతరం ఆర్డీఓ మాట్లాడారు. చదువుల్లో విద్యార్థులు చక్కగా రాణించి మంచి పేరు తీసుకురావాలని కాంక్షించారు. ఏఎస్‌డబ్ల్యూఓ (బీసీ) బ్రహ్మానందచారి, వార్డెన్లు పద్మనాభరెడ్డి, స్పందన తదితరులు పాల్గొన్నారు.
శ్రీవారి దర్శనానికి
12 గంటలు
తిరుమల: తిరుమలలో భక్తుల రద్దీ శనివారం ఎక్కువగా ఉంది. క్యూ కాంప్లెక్స్‌లోని 31 కంపార్ట్‌మెంట్లు నిండిపోయాయి. క్యూ శిలాతోరణం వద్దకు చేరుకుంది. స్వామివారిని 83,032 మంది శుక్రవారం అర్ధరాత్రి వరకు దర్శించుకున్నారు. తలనీలాల ను 27,272 మంది అర్పించారు. కానుకల రూ పంలో హుండీలో రూ.3.81 కోట్లను సమర్పించారు. టైమ్‌స్లాట్ టికెట్లు కలిగిన భక్తులకు సకాలంలో దర్శనం లభిస్తోంది. ఇవి లేని వారికి 12 గంటల సమయం పడుతోంది. ప్రత్యేక టికెట్లు కలిగిన వారు మూడు గంటల్లోనే దర్శించుకోగలుగుతున్నారు.
మూడు కిలోల బంగారు ఆభరణాల స్వాధీనం
నెల్లూరు(క్రైమ్): కారులో ఎలాంటి బిల్లుల్లేకుండా అక్రమంగా తరలిస్తున్న బంగారు ఆభరణాలను జీఎస్టీ, విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారుల బృందం స్వాధీనం చేసుకుంది. వివరాలు.. నగరానికి చెందిన ఓ వ్యాపారి ఎలాంటి బిల్లుల్లేకుండా పెద్ద ఎత్తున బంగారు ఆభరణాలను విక్రయించేందుకు కారులో చైన్నె తరలిస్తున్నారనే సమాచారం జీఎస్టీ, విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులకు శుక్రవారం అందింది. దీంతో వారి బృందం వెంకటాచలం టోల్‌ప్లాజా వద్ద కారును ఆపి తనిఖీలు చేశారు. అక్రమంగా తరలిస్తున్న సుమారు రూ.3.7 కోట్ల విలువజేసే 3.1 కిలోల బంగారు ఆభరణాలను గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. అనంతరం ట్రెజరీలో భద్రపర్చారు. సదరు వ్యక్తికి సంబంధించిన వ్యాపార లావాదేవీలపై జీఎస్టీ అధికారులు ఆరాతీస్తున్నారు.
రేపట్నుంచి ఎఫ్‌ఏ – 3 పరీక్షలు
రేపట్నుంచి ఎఫ్‌ఏ – 3 పరీక్షలు


