బంగారం చోరీ కేసులో ముగ్గురి అరెస్ట్
● 40.44 గ్రాముల బంగారం స్వాధీనం
విడవలూరు: బంగారం చోరీ కేసులో ముగ్గురు వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేశారు. శుక్రవారం విడవలూరులోని పోలీస్‌స్టేషన్‌లో బుచ్చిరెడ్డిపాళెం సీఐ సురేంద్రబాబు, ఎస్సై నరేష్ వివరాలు వెల్లడించారు. వావిళ్ల గ్రామానికి చెందిన గుంజి నాగమ్మ అనే మహిళ గతేడాది సెప్టెంబర్‌లో రామేశ్వరం వెళ్లారు. ఇంటికి తిరిగొచ్చేసరికి గుర్తుతెలియని వ్యక్తులు దొంగతనం చేశారు. దీంతో ఆమె పోలీసులకు ఫిర్యాదు చేశారు. వారు సాంకేతికత ఆధారంగా నెల్లూరు హరనాథపురానికి చెందిన చల్లా మధు, విడవలూరు గ్రామానికి చెందిన అన్నదమ్ములు తంబి నరేష్, తంబి సతీష్ దొంగతనానికి పాల్పడినట్లు గుర్తించారు. వారిని అదుపులోకి తీసుకుని విచారించగా నేరం చేసినట్లు అంగీకరించారు. సతీష్ పరారీలో ఉన్నాడు. చోరీ చేసిన బంగారాన్ని నరేష్, సతీష్ తమ తల్లి తంబి వజ్రమ్మ వద్ద ఉంచారన్న సమాచారంతో ఆమెను కూడా అదుపులోకి తీసుకున్నారు. 40.44 గ్రాముల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు.


