బైక్ ఢీకొని మహిళ మృతి
నెల్లూరు సిటీ: మోటార్‌బైక్‌పై ఢీకొనడంతో ఓ మహిళ మృతిచెందిన ఘటన నెల్లూరులో జరిగింది. రూరల్ పోలీసుల కథనం మేరకు.. మూడో మైలులోని యనమలవారి వీధి మామిడిచెట్ల సెంటర్‌లో మన్నెపల్లి శీనయ్య, కామాక్షమ్మ (51) దంపతులు నివాసముంటున్నారు. ఆత్మకూరు బస్టాండ్‌లోని పూలమార్కెట్‌లో కామాక్షమ్మ పనిచేస్తోంది. గురువారం రాత్రి పని ముగించుకుని ఇంటికి బయలుదేరింది. లిఫ్ట్ అడిగి బైక్‌పై వెనుక కూర్చొంది. ఇంటి వద్ద బైక్‌ను ఆపగా వెనుక నుంచి ఓ వ్యక్తి వేగంగా బైక్‌పై వచ్చి ఢీకొన్నాడు. దీంతో కామాక్షమ్మ తలకు తీవ్రగాయమై అపస్మారక స్థితికి చేరుకుంది. స్థానికులు 108 అంబులెన్స్‌లో హాస్పిటల్‌కు తరలించారు. అప్పటికే ఆమె మృతిచెందినట్లు వైద్యులు నిర్ధారించారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ప్రభుత్వాస్పత్రికి తరలించారు. మృతురాలి కుటుంబ సభ్యులు శుక్రవారం రూరల్ పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేశారు.


