పోలీసా..?.. టీడీపీ బానిసా..?
సాక్షి ప్రతినిధి, నెల్లూరు: తాను పోలీసుననే అంశాన్ని మరిచి.. వెంకటాచలం సీఐ సుబ్బారావు టీడీపీకి బానిసలా పనిచేస్తున్నారని మాజీ మంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు కాకాణి గోవర్ధన్‌రెడ్డి మండిపడ్డారు. వెంకటాచలం మండలంలోని ఇడిమేపల్లికి చెందిన పార్టీ కార్యకర్త బెల్లంకొండ గురవయ్యను స్థానిక పోలీస్‌స్టేషన్లో నిర్బంధించి సీఐ బూతులు తిట్టి.. కొట్టడంతో పాటు చిత్రహింసలకు గురిచేయడంతో వేధింపులు తట్టుకోలేక ఆత్మహత్యకు పాల్పడి నగరంలోని పెన్నా హాస్పిటల్లో ప్రాణాపాయ స్థితిలో ఉన్న బాధితుడ్ని కాకాణి శుక్రవారం పరామర్శించారు. అనంతరం విలేకరులతో మాట్లాడారు. గురవయ్యకు ప్రాణహాని జరిగితే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు. టీడీపీ పాలనలో పోలీసులు బరితెగించి, అధికార పార్టీ నేతలకు సలామ్ కొడుతూ వారి వద్ద గులాంగిరీ చేస్తున్నారని దుయ్యబట్టారు. ప్రతిపక్షానికి చెందిన వారిని హింసించడమే పనిగా పెట్టుకొని పోలీసులు వ్యవహరిస్తున్న తీరు దారుణమన్నారు. సీఐ సుబ్బారావు మరింత బరితెగించి అధికార పార్టీ నేతలకు కొమ్ము కాస్తూ, వారి అడుగులకు మడుగులొత్తుతూ అవినీతి, అక్రమాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. తమ పార్టీ శ్రేణులను నిరంతరం వేధింపులకు గురిచేస్తున్నారని ధ్వజమెత్తారు. గురవయ్య ప్రాణాపాయ స్థితిలో కొట్టుమిట్టాడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. సీఐపై హత్యాయత్నం కేసును నమోదు చేసి, చర్యలు చేపట్టాలని ఎస్పీని కోరారు.
ప్రజలు తిరగబడితే.. తట్టుకోలేరు
అధికార పార్టీ నేతలను సంతృప్తిపర్చేందుకు ప్రతిపక్ష పార్టీలకు చెందిన వారిపై ఖాకీలు దాడులు చేయడం, అవమానించడాన్ని ఆనవాయితీగా పెట్టుకున్నారని మండిపడ్డారు. మీడియా ముందు మాట్లాడినా.. ప్రభుత్వాన్ని, అధికార పార్టీని ప్రశ్నించినా వెంటనే రంగప్రవేశం చేసి దారుణంగా హింసించడం దుర్మార్గమన్నారు. సీఐ సుబ్బారావు అవినీతి, అక్రమాలపై గత ఎస్పీ కృష్ణకాంత్‌కు ఆధారాలతో సహా ఫిర్యాదు చేసినా, అధికార పార్టీకి తొత్తులా వ్యవహరించి ఎలాంటి చర్యలు చేపట్టలేదని ఆరోపించారు. ప్రస్తుత ఎస్పీ విచారణ జరిపి తక్షణమే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. పోలీసులు తమ తీరు మార్చుకొని శాంతిభద్రతలను అందించలేకపోతే.. ప్రజలు తిరగబడితే తట్టుకోలేరని హెచ్చరించారు.
గురవయ్యకు ప్రాణహాని జరిగితే తీవ్ర పరిణామాలు
వివాదాస్పదంగా సీఐ సుబ్బారావు తీరు
ఎస్పీకి గతంలోనే ఫిర్యాదు చేసినా చర్యలేవీ..?
మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి


