పిన్నెల్లి సోదరులకు జైల్లోనూ వేధింపులు
● అక్రమ కేసులు మోపడం దుర్మార్గం
● యర్రగొండపాళెం ఎమ్మెల్యే
తాటిపర్తి చంద్రశేఖర్
వెంకటాచలం: మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, ఆయన సోదరుడు వెంకటరామిరెడ్డిపై తప్పుడు కేసులు బనాయించి జైల్లో పెట్టారని, అక్కడా వేధించడం దుర్మార్గమని యర్రగొండపాళెం ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్ మండిపడ్డారు. టీడీపీ ప్రభుత్వం మోపిన అక్రమ కేసులతో నెల్లూరు కేంద్ర కారాగారంలో ఉన్న పిన్నెల్లి సోదరులతో శుక్రవారం ములాఖత్ అయ్యారు. అనంతరం విలేకరులతో మాట్లాడారు. ప్రభుత్వ అరాచక పాలనకు పిన్నెల్లి సోదరుల ఉదంతమే ఉదాహరణగా నిలుస్తోందని చెప్పారు. ఏ సంబంధం లేని కేసులో వీరిని ఇరికించి జైలుకు పంపడం దుర్మార్గమన్నారు. చంద్రబాబు అధికారంలోకి వచ్చిన నాటి నుంచి మాచర్ల, వినుకొండ ప్రాంతాల్లో విధ్వంసకరపాలన కొనసాగుతోందని ఆరోపించారు. జూలకంటి బ్రహ్మానందరెడ్డి అనుచరులు టీడీపీకి చెందిన వారినే చంపేస్తే.. పిన్నెల్లి సోదరులకు ఏమి సంబంధమని ప్రశ్నించారు. టీడీపీ నేతలు అదే పార్టీకి చెందిన ఇద్దరు అన్నదమ్ములను ఇటీవల హతమార్చారని, పిన్నెల్లి సోదరులు జైలు బయట ఉంటే ఆ కేసులోనూ ఇరికించేవారని ధ్వజమెత్తారు. మాచర్ల నియోజకవర్గంలో పిన్నెల్లి సోదరులు ప్రజాదరణ ఉన్న వారు కావడంతో కుట్రలతో ఈ కేసులో ఇరికించారని ధ్వజమెత్తారు. అక్కడ కొబ్బరికాయలు నరికే కత్తులతో విచక్షణరహితంగా తలలు నరికేస్తున్నా పట్టించుకోకపోవడం దారుణమన్నారు. మాదకద్రవ్యాలు విక్రయించే వారు.. శాంతిభద్రతలపై పోలీసులు పట్టించుకోకుండా.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులపై అక్రమ కేసులు పెట్టడంపైనే దృష్టి సారిస్తున్నారని విమర్శించారు. పలుమార్లు ఎమ్మెల్యేగా గెలుపొందిన పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి ఏ కేటగిరీ సౌకర్యాలను కల్పించాలని న్యాయస్థానం ఆదేశించినా, పట్టించుకోకుండా జైల్లోనూ వేధించడం దుర్మార్గమన్నారు. భోజనం తిని 20 రోజులైందని చెప్తున్నారని, గుండె తరుక్కుపోతోందని తెలిపారు. రానున్న ఎన్నికల్లో మాచర్లలో పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఎన్నడూ లేనంత మెజార్టీతో గెలుపొందడం ఖాయమని స్పష్టం చేశారు.


