ఆశ వర్కర్ల ఆకలి కేకలు
● మూడు నెలలుగా జీతాలేవీ..?
● దయనీయంగా 134 మంది పరిస్థితి
ఆత్మకూరు: ఎంకి పెళ్లి.. సుబ్బి చావుకు వచ్చిందనే చందాన మారింది జిల్లాలోని 134 మంది ఆశ కార్యకర్తల పరిస్థితి. ఆంధ్రప్రగతి గ్రామీణ బ్యాంక్‌ను ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంక్‌గా ఇటీవల మార్చారు. ఈ క్రమంలో ఖాతాదారుల అకౌంట్ నంబర్లూ మారాయి. ఫలితంగా నూతన నంబర్లు ఇవ్వాల్సిందిగా పీహెచ్‌సీలకు డీఎంహెచ్‌ఓ కార్యాలయం నుంచి ఆదేశాలందాయి. ఇది జరిగి మూడు నెలల కావొస్తోంది. దీంతో బ్యాంకులకు ఆశ కార్యకర్తలెళ్లి కావాల్సిన మేరకు వివరాలను నమోదు చేసి.. పీహెచ్‌సీల ద్వారా జిల్లా కార్యాలయానికి అందజేశారు. ఒకసారి నూతన ఖాతా నంబర్ కావాలని.. మరోసారి బ్యాంక్‌లో ఎలాంటి బకాయిల్లేవని లేఖ తేవాలని.. ఐఎఫ్‌ఎస్సీ కోడ్ కావాలని చెప్పగా, ఆ మేరకూ పంపారు. అయినా పరిస్థితి ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్లుగా మారింది.
కుటుంబపోషణ భారం
సంక్రాంతి నాటికై నా జీతాలొస్తాయనే ఆశ వీరిలో కరువైంది. కుటుంబపోషణకు అప్పులు చేయాల్సిన పరిస్థితి దాపురించిందని ఆవేదన వ్యక్తం చేశారు. అప్పులు కట్టాలనే ఒత్తిడీ పెరుగుతోందని వాపోతున్నారు. కాగా ఈ విషయమై డీఎంహెచ్‌ఓ సుజాతను సంప్రదించగా, విషయం తన దృష్టికి రాలేదని, వివరాల కోసం డీసీఎం సునీతను సంప్రదించాలని సూచించారు. ఆమెను సంప్రదించగా, బ్యాంకుల విలీనంతో సమస్య ఏర్పడిందని, జీతాలు రాని విషయం వాస్తవమేనని అంగీకరించారు. గత నెల 26 నాటికి వారి జీతభత్యాలను పూర్తి చేసి థంబ్ వేసే క్రమంలో సమయం మించిపోవడంతో నిలిచిపోయిందని తెలిపారు. విజయవాడలోని సీఎమ్మెఎఫ్‌ఎస్ కార్యాలయాన్ని సంప్రదించామని, థంబ్ వేసేందుకు ఈ నెల ఆరున మరోసారి అవకాశం ఉంటుందని చెప్పారు. అయితే తొమ్మిది మంది వలంటీర్ల ఐడీలు నమోదు కాకపోవడంతో ప్రత్యేక ప్రక్రియ ద్వారా జీతాల కోసం పెట్టాల్సి ఉంటుందన్నారు. మిగిలిన వారికి సాధ్యమైనంత త్వరలో అందించేలా చర్యలు చేపడతామని హామీ ఇచ్చారు.


