ఎడాపెడా తాగేశారు..!
● నూతన సంవత్సర సందర్భంగా
ఏరులై పారిన మద్యం
● నాలుగు రోజుల్లో రూ.30.50 కోట్ల మేర విక్రయాలు
నెల్లూరు(క్రైమ్): నూతన సంవత్సర వేడుకల్లో జిల్లాలో మద్యం ఏరులై పారింది. 2025కు వీడ్కోలు పలుకుతూ.. 2026కు ఘనంగా స్వాగతం పలుకుతూ అక్షరాల రూ.30.5 కోట్ల లిక్కర్‌ను మద్యం ప్రియులు తాగేశారు. మందేస్తూ...చిందేస్తూ న్యూ ఇయర్‌ను స్వాగతించారు. జిల్లాలో 200 వైన్ షాపులు, 34 బార్లలో రోజూ సగటున రూ.4.5 కోట్ల మేర విక్రయాలు సాగుతుంటాయి. అయితే కొత్త సంవత్సరాది వేడుకల్లో మద్యం విక్రయాలతో ఆదాయాన్ని భారీగా సమకూర్చుకోవాలని భావించిన ప్రభుత్వం దానికి అనుగుణంగా డిసెంబర్ 31, జనవరి ఒకటిన అర్ధరాత్రి ఒంటి గంట వరకు సమయాన్ని పొడిగించింది.
భారీగా నిల్వలు
మందుబాబులను మత్తులో ముంచేలా నాలుగు రోజుల నుంచే దుకాణాల్లో భారీగా నిల్వ చేశారు. పర్మిట్ రూమూల్లో బార్లను తలపించేలా ఏర్పాట్లు చేశారు. నూతన సంవత్సర కళంతా వైన్‌షాపులు, బార్ల వద్దే కనిపించింది.
డిసెంబర్‌లో రూ.143 కోట్లు
గతేడాది డిసెంబర్‌లో జిల్లాలో రూ.139.58 కోట్ల విలువజేసే 1,92,966 కేసుల మద్యం, 41,242 కేసుల బీర్ల విక్రయాలు జరిగాయి. ఈ ఏడాది ఇది రూ.143.79 కోట్లుగా నమోదైంది. 2,05,557 కేసుల మద్యం, 57,966 కేసుల బీర్లు విక్రయమయ్యాయి. గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది రూ.4.21 కోట్ల అదనపు ఆదాయం ప్రభుత్వానికి సమకూరింది.


