ప్రయాణం.. నరకప్రాయం
● రోడ్డు పనుల్లో నిర్లక్ష్యం
● దుమ్ముతో వాహనదారుల అవస్థలు
కోవూరు: రోడ్డు విస్తరణ పనులు ప్రయాణికుల ప్రాణాల మీదకు తెస్తున్నాయి. నిబంధనల ప్రకారం పనులు చేపట్టాల్సిన కాంట్రాక్టర్లు, పర్యవేక్షించాల్సిన అధికారులు మొద్దునిద్ర పోతుండటంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పడుగుపాడు సమీపంలో జరుగుతున్న రోడ్డు పనుల వద్ద కనీస జాగ్రత్తలు పాటించకపోవడంతో ఈ ప్రాంతం ప్రమాదాలకు నిలయంగా మారింది. ప్రస్తుతం జరుగుతున్న పనుల వల్ల రోడ్డుపై భారీగా దుమ్ము పేరుకుపోయింది. వాహనాలు వెళ్తున్న సమయంలో దుమ్ము పైకి లేస్తుండడంతో వెనుక వచ్చే వాహనదారులకు దారి కనిపించడం లేదు. దీనివల్ల ఎదురెదురుగా వచ్చే వాహనాలు ఢీకొనే ప్రమాదం ఉందని ప్రయాణికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా ద్విచక్ర వాహనదారుల కళ్లలో దుమ్ము పడుతుండడంతో అదుపుతప్పి కింద పడి గాయపడుతున్నారు. సాధారణంగా రోడ్డు పనులు జరిగే సమయంలో దుమ్ము లేవకుండా ఎప్పటికప్పుడు నీళ్లు చల్లాలి. అయితే ఇక్కడ కాంట్రాక్టర్లు అలాంటి చర్యలు తీసుకోవడం లేదు. ఇప్పటికై నా అధికారులు స్పందించి కనీసం నీళ్లు చల్లించేలా చర్యలు తీసుకోవాలని పలువురు వాహనచోదకులు కోరుతున్నారు.


