
అభిమానాన్ని అడ్డుకోలేని ఆంక్షలు
● జిల్లా సెంట్రల్ జైలు నుంచి
మాజీ మంత్రి కాకాణి విడుదల
● బయటకు వచ్చాక అడుగడుగునా
అభిమానుల కోలాహలం
వెంకటాచలం: కూటమి ప్రభుత్వం మోపిన అక్రమ కేసులతో జైలుకు వెళ్లిన మాజీ మంత్రి, వైఎస్సార్‌సీపీ నెల్లూరు జిల్లా అధ్యక్షుడు కాకాణి గోవర్ధన్‌రెడ్డి 86 రోజుల తర్వాత బుధవారం నెల్లూరు సెంట్రల్ జైలు నుంచి విడుదలయ్యారు. హైకోర్టు సోమవారమే బెయిల్ మంజూరు చేసినప్పటికీ గూడూరు కోర్టు నుంచి బెయిల్ మంజూరు పత్రాలు ఇవ్వడంలో ఆలస్యం కావడంతో మంగళవారం జైలు నుంచి విడుదల కాలేకపోయారు. మంగళవారం కాకాణి జైలు నుంచి విడుదలవుతారని తెలియడంతో జిల్లాలోని వైఎస్సార్‌సీపీ ముఖ్య నేతలు, సర్వేపల్లి నియోజకవర్గ వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలు వస్తారని పోలీసులు అడుగడుగున ఆంక్షలు విధించారు. ఆయనకు స్వాగతం పలుకుతూ అభిమానులు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను తొలగించారు. అయినప్పటికీ ముఖ్యనేతలతోపాటు అభిమానులు జైలు పరిసర ప్రాంతాలకు చేరుకుని సాయంత్రం 6.30 గంటల వరకు ఎదురు చూశారు. అయితే సాంకేతిక కారణాలతో విడుదల జాప్యం జరగడంతో కాకాణి బుధవారం విడుదలవుతారని తెలియయడంతో నిరాశగా వెనుతిరిగారు. అయితే బుధవారం ఉదయం 8 గంటల అభిమానులు, కార్యకర్తలు, నాయకులు, జెడ్పీ చైర్‌పర్సన్ ఆనం అరుణమ్మ, ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి, వైఎస్సార్‌సీపీ నెల్లూరు రూరల్ నియోజకవర్గ ఇన్‌చార్జి ఆనం విజయకుమార్‌రెడ్డి, మహిళా విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్ కాకాణి పూజిత తదితరులు వేలాది మంది జిల్లా సెంట్రల్ వద్దకు చేరుకున్నారు. జైలుకు వెళ్లే రోడ్డు మార్గాల్లో వేలాది మంది వైఎస్సార్‌సీపీ నాయకులు, అభిమానులు చేరుకోవడాన్ని చూసి పోలీసులు ముఖ్య నేతలను మినహా, మిగతా అందరిని జైలు పరిసర ప్రాంతాల్లో లేకుండా తరిమేశారు.
కాకాణి బయటకు రావడంతో..
కాకాణి గోవర్ధన్ రెడ్డి ఉదయం 10.20 గంటలకు జైల్లో నుంచి బయటకు రావడంతో అంత వరకు ఓపిగ్గా ఎదురుచూసిన అభిమానులు పోలీసుల ఆంక్షలను దాటుకుని జయహో గోవర్ధనన్న, జై జగన్, జై కాకాణి అంటూ నినాదాలు హోరెత్తించారు. కాకాణిని నాయకుల భుజాలపైకి ఎత్తుకుని తమ అభిమానాన్ని చాటుకున్నారు. కాకాణి గోవర్ధన్ రెడ్డి జైల్లో ఉన్నంత సేపు అనేక ఆంక్షలు విధించిన పోలీసులు, ఒక్కసారిగా వచ్చిన అభిమానాలను చూసి అడ్డుకోలేకపోయారు. కాకాణి గోవర్ధన్‌రెడ్డి తన కుమార్తె పూజిత, మనుమడు, ఇతర కుటుంబ సభ్యులతోపాటుగా, వైఎస్సార్‌సీపీ నాయకులను ఆప్యాయంగా పలకరించారు. జైలు వద్ద నుంచి కారులో బయలుదేరిన కాకాణి గోవర్ధన్ రెడ్డికి దారిపొడవునా వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానాలు ఆత్మీయ స్వాగతం చేశారు. కొందరు శాలువాలతో సన్మానించారు. జైలు వద్ద నుంచి నక్కలకాలనీ, మీదుగా, జాతీయ రహదారిపై కారులో వెళుతూ ప్రతి ఒక్క నాయకుడిని పేరు పేరునా పలకరిస్తూ వెళ్లారు.