
నీ ఇంటికి వస్తా.. నీ అంతు చూస్తా..
కావలి (జలదంకి): పదేళ్లు ఎమ్మెల్యేగా ప్రజలకు సేవలందించిన రామిరెడ్డి ప్రతాప్‌కుమార్‌రెడ్డిని ప్రస్తుత ఎమ్మెల్యే దగుమాటి కృష్ణారెడ్డి పరుష పదజాలంతో దూషించారు. చట్టసభలో శాసన సభ్యుడిగా ఉండి.. మారో మాజీ శాసన సభ్యుడిని నోటికొచ్చినట్లు, ఒక వీధి రౌడీలా మాట్లాడిన తీరుపై ప్రజలు యావగించుకుంటున్నారు. తుమ్మలపెంటలో గుర్తుతెలియని వ్యక్తులు జల్‌జీవన్ మిషన్ పథకానికి సంబంధించి వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన శిలాఫలాకాన్ని ధ్వంసం చేసిన నేపథ్యంలో పరిశీలించేందుకు శనివారం వచ్చారు. ఈ సందర్భంగా కృష్ణారెడ్డి అదుపు తప్పి మాట్లాడుతూ ఘాటైన వ్యాఖ్యలు చేశారు. ‘ప్రతాప్‌రెడ్డి నీ అంతు చూస్తా, నీ ఇంటికి వస్తా. శవాల మీద పరిగలు ఏరుకునేవాడివి. నువ్వు నా వెంట్రుక, గోటికి కూడా పనికిరావు. నీ భార్యా పిల్లలతో కూర్చోని మాట్లాడుకో.. ఖబడ్దార్’ అంటూ ఆవేశంతో ఊగిపోయాడు. అనంతపురం, బెంగళూరు నుంచి రౌడీలను తెచ్చి కావలిలోని లాడ్జిల్లో పెట్టి నీచ రాజకీయాలు చేస్తున్నాడని, కరెంట్ ట్రాన్స్‌ఫార్మర్లు కాలిపోయేటట్లు చేయిస్తున్నాడని, కులాల మధ్య చిచ్చుపెట్లే రాజకీయాలు చేస్తున్నాంటూ ఘాటు వ్యాఖ్యలు చేశాడు. ఎమ్మెల్యే స్థాయిలో ఉండి కృష్ణారెడ్డి మాట్లాడిన భాష ఏమిటని కావలి నియోజకవర్గ ప్రజల్లో చర్చ మొదలైంది. పది సంవత్సరాలు ఎమ్మెల్యేగా పనిచేసిన వ్యక్తిపై ఇలా వీధి రౌడీలా మాట్లాడడం ఏమిటని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. టీడీపీ వాళ్లే శిలాఫలకాన్ని కూల్చి వైఎస్సార్‌సీపీకి చెందిన వ్యక్తి పొలంలో శిథిలాలు వేసి, తమపైనే అక్రమ కేసులు పెట్టేందుకు ప్రయత్నిస్తున్నారంటూ తుమ్మలపెంట వైఎస్సార్‌సీపీ నాయకులు ఆరోపిస్తున్నారు. ఈ విషయంపై కావలి రూరల్ పోలీసులను వివరణ కోరగా తమ్మలపెంట పంచాయతీ కార్యదర్శి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. అయితే ఇద్దరు వైఎస్సార్‌సీపీ వ్యక్తులను అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. వారితో శిలాఫలకం కూల్చింది తామే అని చెప్పించే ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది.
మాజీ ఎమ్మెల్యే ప్రతాప్‌కుమార్‌రెడ్డిపై ఎమ్మెల్యే కృష్ణారెడ్డి పరుష పదజాలం
ఆ భాషపై సర్వత్రా విమర్శలు

నీ ఇంటికి వస్తా.. నీ అంతు చూస్తా..