
చెలరేగుతున్న తమ్ముళ్లు
కందుకూరు: అధికారాన్ని అడ్డం పెట్టుకుని నియోజకవర్గంలో గ్రావెల్ మాఫియా చెలరేగిపోతుంది. సాగునీటి చెరువులను లక్ష్యంగా చేసుకుని భారీ దోపిడీకి పాల్పడుతోంది. కొండికందుకూరు చెరువు నుంచి పెద్ద ఎత్తున మట్టి, కోవూరు, కొండముడుసుపాళెం చెరువుల నుంచి భారీగా గ్రావెల్ తవ్వకాలు చేపడుతున్నారు. గుడ్లూరు మండలం ఏలూరుపాడు చెరువు నుంచి రైల్వేలైన్ అభివృద్ధి పనుల కోసం 6,500 క్యూబిక్ మీటర్ల మట్టి తవ్వుకునేందుకు అనుమతి తీసుకున్న కాంట్రాక్టర్‌లు దాదాపు 13 వేల క్యూబిక్ మీటర్ల వరకు మట్టి తవ్వకాలు చేశారు. కేవలం 90 సెం.మీ. లోతులోనే మట్టి తవ్వకాలు చేయాలని నిబంధన ఉన్నా మూడు మీటర్ల లోతు వరకు ఈ చెరువులో మట్టి తవ్వకాలు చేసినా ఇరిగేషన్‌శాఖ అధికారులు ఆ వైపు కన్నెత్తి చూసిన దాఖలాలు లేవు. పాజర్ల, తెట్టు, ఏలూరుపాడు చెరువుల్లో ఇష్టారాజ్యం గ్రావెల్ తవ్వకాలు చేశారు. లింగసముద్రం మండలంలోని రాళ్లపాడు ప్రాజెక్ట్‌ను సైతం గ్రావెల్ మాఫియా వదలడం లేదు. అయినా సరే ప్రాజెక్ట్ అధికారులు పట్టించుకున్న పాపాన పోవడం లేదు. లింగసముద్రం కొత్తచెరువు, యర్రారెడ్డిపాళెంలో ప్రభుత్వ భూములు, మాలకొండరాయునిపాళెం చెరువు, చినపవని, పెదపవని, మొగిలిచర్ల సాగునీటి చెరువుల్లో గ్రావెల్ తవ్వకాలు భారీగా సాగాయి. ఉలవపాడు మండలంలోని రాజుపాళెం, వీరేపల్లి, భీమవరం, బద్దిపూడి చెరువుల నుంచి గ్రావెల్, కరేడు చెరువు నుంచి మట్టిని యథేచ్ఛగా గ్రావెల్‌ను తరలించేశారు. వాస్తవానికి చెరువుల్లో గ్రావెల్ తవ్వకాలకు ఒక క్యూబిక్ మీటర్‌కు రూ.106 చెల్లించాల్సి ఉంది. కానీ గ్రావెల్ మాఫి యా ఎటువంటి అనుమతులు తీసుకోవడం లేదు. ఒక్క రూపాయి కూడా రాయల్టీ చెల్లించడం లేదు.