ఇసుక తోడేళ్లు.. | - | Sakshi
Sakshi News home page

ఇసుక తోడేళ్లు..

Apr 30 2025 12:13 AM | Updated on Apr 30 2025 12:13 AM

ఇసుక

ఇసుక తోడేళ్లు..

రాత్రిళ్లు..
మంత్రి నారాయణ అండతో బరితెగింపు

రీచ్‌ వద్ద ఇసుక తవ్వకాలను అడ్డుకుంటున్న నుడా చైర్మన్‌ కోటంరెడ్డి శ్రీనివాసులురెడ్డి

నిత్యం 50 వాహనాల్లో అక్రమ రవాణా

చోద్యం చూస్తున్న అధికార గణం

షాడో మంత్రి తీరుపై నుడా చైర్మన్‌ గుర్రు

అర్ధరాత్రి వేళ పెన్నాలో హడావుడి

నెల్లూరు సిటీ: నగరంలోని 3వ డివిజన్‌ పరిధిలోని దీన్‌దయాళ్‌నగర్‌కు సమీపంలో పెన్నా నది ఇసుక రీచ్‌లో ఇసుకను అక్రమంగా తరలిస్తున్న టిప్పర్‌లను టీడీపీ నేత, నుడా చైర్మన్‌ కోటంరెడ్డి శ్రీనివాసులురెడ్డి సోమవారం అర్ధరాత్రి అడ్డుకున్నారు. ఇసుక తవ్వకాలు జరుపుతున్న వారిపై మండిపడ్డారు. దాదాపు నాలుగు గంటల పాటు హైడ్రామా సాగింది. రూరల్‌ తహసీల్దార్‌ లాజరస్‌, రూరల్‌ సబ్‌ఇన్‌స్పెక్టర్‌ వేణు ఆ ప్రాంతానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా శ్రీనివాసులురెడ్డి మాట్లాడుతూ టీడీపీకి చెడ్డపేరు తెచ్చే వారిని వదిలిపెట్టే ప్రసక్తే లేదని హెచ్చరించారు. దీని వెనుక ఇసుక స్మగ్లర్‌లు ఎవరున్నా ఉపేక్షించనన్నారు. మంత్రి నారాయణ డీఎస్పీ, ఎస్పీకి ఫోన్‌ చేసి దోషులను వదిలిపెట్టవద్దని చెప్పారన్నారు. అక్రమంగా ఇసుక తవ్వకాలు చేస్తున్న రెండు టిప్పర్‌లు, ఒక హిటాచీని రూరల్‌ పోలీసులు సీజ్‌ చేశారు. మూడు వాహనాల డ్రైవర్‌లపై కేసు నమోదు చేశారు.

మంత్రికి తెలియదా..?

నగరంలోని దీన్‌దయాళ్‌నగర్‌లో ఇసుక దోపిడీ మంత్రి నారాయణకు తెలియకుండానే జరుగుతుందా? అనే సందేహం స్థానిక ప్రజల్లో వ్యక్తమవుతోంది. ఒకవేళ తన సొంత నియోజకవర్గంలో జరిగే దోపిడీ గురించి తెలిస్తే మంత్రి ఎందుకు మౌనం వహించారనేది ప్రశ్నార్థకరం. జిల్లాలో ఎక్కడా ఇసుక దోపిడీ లేదని బుకాయించే మంత్రి తన అడ్డాలోనే అర్ధరాత్రి వేళ ఇసుక దోపిడీ జరుగుతుంటే ఎందుకు పట్టించుకోవడం లేదని ఆ పార్టీ క్యాడరే ప్రశ్నిస్తోంది.

టీడీపీకి చెడ్డపేరు తెచ్చేవారిని

ఉపేక్షించను

సాక్షి ప్రతినిధి, నెల్లూరు: పెన్నాలో ఇసుక దోపిడీ తీరుపై చాలాకాలంగా ప్రతిపక్షాలు గగ్గోలుపెడుతున్నా.. పత్రికల్లో కథనాలు వస్తున్నా తెలుగు తమ్ముళ్లు చెవికెక్కించుకోవడం లేదు. టీడీపీలో నెలకొన్న అంతర్గత విభేదాలతో ఆపార్టీ నేతలే సహజ వనరుల దోపిడీని సోమవారం రాత్రి వెలుగులోకి తేవడం జిల్లాలో చర్చనీయాంశమైంది. మంత్రి నారాయణ ఇలాకాలో జరుగుతున్న ఇసుక దోపిడీ తీరును నుడా చైర్మన్‌ అడ్డుకోవడం చూసి నగర ప్రజలు విస్తుపోతున్నారు.

భారీ యంత్రాలతో తోడేస్తూ..

నగర నియోజకవర్గ పరిధిలోని దీన్‌దయాళ్‌నగర్‌ వద్ద మంత్రి నారాయణ అండతో టీడీపీ నేతలు అనధికారికంగా రీచ్‌ను ప్రారంభించారు. నేరుగా రీచ్‌ వద్దకే కార్పొరేషన్‌ నిధులతో రహదారిని ఏర్పాటు చేశారు. ఉచిత ఇసుక విధానం ముసుగేసి పగటి సమయాల్లో ట్రాక్టర్ల ద్వారా ఇసుక తరలిస్తున్నారు. రాత్రయితే చాలు టీడీపీ నేతలు వారి అనుచరవర్గం హిటాచి లాంటి యంత్రాలు పెట్టి పెన్నా నదిని కుళ్లబొడుస్తున్నారు. దీనదయాళ్‌నగర్‌ ప్రాంతంలో భారీ వాహనాల రణగొణ ధ్వనులతో ఆప్రాంత ప్రజలకు కునుకు లేకుండా పోతోంది. రోజువారీ 50 భారీ వాహనాలతో ఇసుక అక్రమ రవాణా సాగుతోంది. లోడింగ్‌ ఛార్జీల పేరుతో తమ్ముళ్లు లారీకి రూ.8 వేలు వంతున వసూలు చేస్తున్నారు. అంటే లోడింగ్‌ ద్వారానే దాదాపు రోజువారీగా దాదాపు రూ.4 లక్షల వరకు వసూలు చేస్తున్నారు. ఒక్కో వాహనానికి 30 టన్నుల లోడింగ్‌ జరుగుతుంది. అలా లెక్కించిన రోజుకు 1500 టన్నుల ఇసుక అనధికారికంగా రవాణా అవుతోంది. నెలవారీగా 45 వేల టన్నుల ఇసుక రవాణా సాగిస్తున్నారు. గత ఎనిమిది నెలలుగా ఈ తంతు జరుగుతోంది.

మామూళ్ల మత్తులో అధికారులు

రాత్రి వేళ పెన్నాలో తెలుగు తమ్ముళ్లు ఇసుక దోపిడీ చేస్తుంటే అధికార యంత్రాంగం పట్టించుకోకపోవడంపై సర్వత్రా విమర్శలు వస్తున్నాయి. నగర పరిధిలోనే తమ్ముళ్లు బరితెగించి ఇసుక అక్రమ రవాణా చేస్తున్నా అధికారులు కళ్లకు గంతలు కట్టుకోవడం వెనుక మామూళ్ల వ్యవహారమే కారణమని తెలుస్తోంది. మైనింగ్‌, రెవెన్యూ, పోలీస్‌, విజిలెన్స్‌ అధికారులు పట్టించుకోకపోవడంపై విమర్శలు వస్తున్నాయి.

ఇసుక తోడేళ్లు.. 1
1/2

ఇసుక తోడేళ్లు..

ఇసుక తోడేళ్లు.. 2
2/2

ఇసుక తోడేళ్లు..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement