చంటి బిడ్డలకు మత్తు మందు ఇచ్చి మహిళలతో యాచన
● ఇందిరమ్మ కాలనీకి చెందిన (పేరు మార్పు) నారాయణ, అంకమ్మ దంపతులు వృత్తి రీత్యా గ్యాస్ రిపేర్ చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. వీరికి ఐదుగురు పిల్లలు. వీరంతా బడీడు పిల్లలే. భార్యాభర్తలకు గొడవలు కావడంతో భర్త భార్యాబిడ్డలను వదిలేసి వెళ్లాడు. దీంతో బతుకుదెరువు పేరుతో పిల్లల అమ్మమ్మ వారిని తీసుకెళ్లి మార్కెట్ సెంటర్, వీఆర్‌సీ సెంటర్లో భిక్షాటన చేయిస్తోంది.
● ఇందిరమ్మ గిరిజన కాలనీకి చెందిన నాగవేణి, వెంకయ్య తమ ముగ్గురు పిల్లలతో భిక్షాటన చేయిస్తున్నారు. వచ్చిన డబ్బుతో మద్యం తాగి జల్సాలు చేస్తున్నారు.
● అయ్యప్పగుడి ప్రాంతానికి చెందిన నర్సింహులు, లక్ష్మీదేవి ముగ్గురు పిల్లలను తీసుకొచ్చి భిక్షాటన చేయిస్తున్నారు. నర్సింహులు దివ్యాంగుడు కావడంతో పిల్లలు తీసుకొచ్చే డబ్బుతో కుటుంబాన్ని పోషిస్తున్నారు. ఇలాంటి వారు నగరంలో చాలా మందే ఉన్నారు.
నెల్లూరు (పొగతోట): నెల్లూరు నగరంలో బెగ్గింగ్ మాఫియా రోజు రోజుకు విస్తరిస్తోంది. రద్దీ కూడళ్లు, బస్టాండ్ సెంటర్లలో పసి పిల్లలు, చంకలో చంటి బిడ్డలతో మహిళలతో భిక్షాటన చేయిస్తూ ఆ సొమ్ములో వారికి భిక్షం వేస్తున్నారు. పడారుపల్లి, ఇందిరమ్మ కాలనీలో కొన్ని ముఠాలు ఈ తరహా వ్యాపారం చేస్తున్నాయి. ఈ ముఠాలు చంటి బిడ్డలను కిడ్నాప్ చేసి తీసుకువచ్చిన వారితోపాటు సంచార గిరిజనులు, పూటగడవని పేదల పిల్లలను అద్దెకు తీసుకువచ్చి ఈ బెగ్గింగ్ మాఫియాను నడుపుతున్నట్లు సమాచారం. సంచార జాతులకు చెందిన కొందరు యువతుల నుంచి నడి వయస్సు మహిళలకు ఈ చంటి బిడ్డలను ఇచ్చి యాచన చేయిస్తున్నారు. ఆ బిడ్డలు వీరి ఒడిలో ఉన్నంత సేపు ఏడవకుండా వారికి మత్తు ఇస్తున్నట్లు తెలుస్తోంది. ఇది అత్యంత దారుణం. ఇదే విషయం ఇటీవల ఐసీపీఎస్ (ఇంటిగ్రేటెడ్ చైల్డ్ ప్రొటెక్షన్ స్కీం) అధికారుల విచారణలో బయటపడింది.
200 మందికిపైగా మహిళలతో..
నగరంలో సుమారు 200 మందికి పైగా మహిళలు చంటి బిడ్డలతో, వందల సంఖ్యలో బడీడు పిల్లలతో ఉదయం నుంచి సాయంత్రం వరకు యాచించడం చేయిస్తున్నారు. ఈ బెగ్గింగ్ మాఫియా ఎంతటి దారుణానికి తెగిస్తుందంటే.. చంటి బిడ్డలు మహిళల జోలిలో నిద్రపోయే విధంగా మత్తులో ఉండేటట్లు వారికి పాలల్లో మత్తు కలిపి ఇస్తున్నారు. దీంతో వీరు సాయంత్రం వరకు ఆకలి వేసినా ఉలకరు. పలకరు. మానవత్వం మరిచి చంటి బిడ్డలకు మత్తును ఇస్తున్నారని ఐసీపీఎస్ అధికారులకు తెలిసినా మొక్కుబడిగా కేసులు పెట్టి వదిలేస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. కాలనీ ప్రాంతాల నుంచి మహిళలు పసి పిల్లలను తీసుకువచ్చి భిక్షాటన చేస్తున్నారు. వీరి వెనుక మాఫియా వ్యక్తులు ఉన్నారు. వీరు యాచించిన మొత్తం తీసుకుని ఆ మహిళలకు కొంత ఇస్తున్నట్లు సమాచారం. మహిళలు తీసుకు వస్తున్న పసి పిల్లల్లో అధిక శాతం మంది బయట ప్రాంతాల నుంచి కిడ్నాప్ చేసి తీసుకొచ్చినట్ల్లు సమాచారం. కొంత మంది తమ సొంత పిల్లలను సైతం తీసుకువచ్చి బెగ్గింగ్‌కు పాల్పడుతున్నారు. నగరంలో అయ్యప్పగుడి దగ్గర నుంచి ఆత్మకూరు బస్టాండ్ వరకు యాచించే మహిళలు అధికంగా ఉన్నారు. ఇటీవల ఐసీపీఎస్ అధికారులు భిక్షాటన చేస్తున్న కొందరు పిల్లలను పట్టుకు ని వారితో భిక్షాటన చేయిస్తున్న వారిపై కేసులు నమోదు చేశారు. పిల్లలను హోమ్‌లో చేర్పించి వారికి విద్యా బుద్ధులు, మంచి దుస్తులు, ఆహారం అందిస్తున్నారు.
ప్రాణాలు కోల్పోయిన పసి పిల్లలు
మహిళలు పసిపిల్లలను తీసుకు వచ్చి నగరంలో బెగ్గింగ్ చేయించే క్రమంలో ఇటీవల అనారోగ్య కారణాలతో ఇద్దరు పసి పిల్లలు మరణించినట్లు సమాచారం. ఆ పిల్లలు అనాథలు కావడంతో ఈ విషయం బయటకు రాలేదు.
కేసులు పెట్టినా మారని మహిళలు
మహిళలను యాచక వృత్తి నుంచి బయటకు తీసుకు వచ్చేందుకు పసి పిల్లలను పాఠశాలలకు పంపించేందుకు బాలల సంరక్షణ అధికారులు ప్రత్యేక చర్యలు చేపట్టారు. ఇందులో భాగంగా పసి పిల్లలకు మత్తు మందు ఇచ్చి బెగ్గింగ్ చేయిస్తున్న మహిళలపై కేసులు నమోదు చేశారు. కోర్టులో విచారణ జరుగుతోంది. కేసులు నమోదు చేసినా మహిళల్లో ఎటువంటి మార్పురావడం లేదు. యాచక వృత్తిలో ఈజీగా మనీ వస్తుండడంతో దానిని వదిలి మహిళలు బయటకు రాలేకపోతున్నారు.
రద్దీ ప్రదేశాల్లో యథేచ్ఛగా..
ఆర్టీసీ బస్‌స్టేషన్, ఆత్మకూరు బస్టాండ్ సెంటర్లు, స్టోన్‌హౌస్‌పేట, రైల్వేస్టేషన్, వేదాయపాళెం, అయ్యప్పగుడి, మినీబైపాస్, మాగుంట లేఅవుట్ తదితర ప్రాంతాల్లో మహిళలు పసి పిల్లలను తీసుకొచ్చి యాచిస్తున్నారు. ఆగి ఉన్న బస్సుల్లోకి మహిళలు ఎక్కి ప్రయాణికుల నుంచి నగదు అడుగుతున్నారు. ప్రధాన కూడళ్లు, హోటళ్లు, టీ షాపులు, ఇతర దుకాణాల వద్ద మహిళలు చిన్న పిల్లలు బెగ్గింగ్‌కు పాల్పడుతున్నారు.
నెల్లూరులోని బస్టాండ్ సెంటర్లు, రద్దీ ప్రదేశాల్లో కొందరు ఆడ, మగ పసిపిల్లలు ఒక చేయి చాచి మరో చేయిని కడుపుపై పెట్టుకుని దీనంగా యాచిస్తుంటారు. మరి కొన్ని చోట్ల యువతుల నుంచి నడివయస్సు మహిళల వరకు జోలి కట్టుకుని అందులో చంటి బిడ్డలను పెట్టుకుని భిక్షాటన చేస్తుంటారు. అయ్యో.. పసి పిల్లలు, చంటి బిడ్డలతో ఉన్న మహిళలు కదా అని ఎవరైనా జాలిపడి ఐదో.. పదో ఇస్తారు. ఇదంతా వారి కోసం వారు భిక్షాటన చేయడం లేదు. వీరితో ఈ విధంగా బెగ్గింగ్ మాఫియా చేయిస్తోంది. వీరిని పర్యవేక్షిస్తున్న బృందం ఎప్పటికప్పుడు వచ్చిన కలెక్షన్ మొత్తం తీసుకుంటుంటారు. సాయంత్రానికి వీరికి పదో పరకో ఇచ్చి పంపిస్తుంటారు.
పసి పిల్లలతోనూ ఇదే పని
చేయిస్తున్న వైనం
పడారుపల్లి, ఇందిరమ్మకాలనీల్లో పాగా వేసిన ముఠాలు
భిక్షాటన చేసే మహిళల పర్యవేక్షణకు ప్రత్యేక బృందం
కేసులు పెట్టినా మార్పు రావడం లేదు
నగరంలో పసిపిల్లలు, బడీడు పిల్లలతో బెగ్గింగ్ అధికంగా జరుగుతోంది. రెండు నెలల కాలంలో బెగ్గింగ్‌కు పాల్పడుతున్న మహిళలపై కేసులు నమోదు చేశాం. అయినా వారిలో మార్పు రావడం లేదు. బడీడు పిల్లలను పాఠశాలల్లో చేర్పించేలా ప్రత్యేక చర్యలు చేపడుతున్నాం. మహిళలకు ప్రత్యేక అవగాహనా కార్యక్రమాలు నిర్వహించి యాచక వృత్తిని మాన్పించేలా చర్యలు తీసుకుంటాం.
– సురేష్, జిల్లా బాలల సంరక్షణ అధికారి
చంటి బిడ్డలకు మత్తు మందు ఇచ్చి మహిళలతో యాచన
చంటి బిడ్డలకు మత్తు మందు ఇచ్చి మహిళలతో యాచన


