జిల్లాలో స్వచ్ఛంద రక్తదాతలు పెరుగుతున్నారు. రెడ్‌క్రాస్ తదితర సంస్థల్లో 24 వేల మంది వరకు సభ్యులున్నారు. జిల్లాలో ఇండియన్ రెడ్‌క్రాస్ బ్లడ్‌బ్యాంకు, ప్రభుత్వ సర్వజన ఆస్పత్రి, నోవాబ్లడ్ బ్యాంకు, అపోలో ఆస్పత్రి, నారాయణ ఆస్పత్రి, న్యూలైఫ్, కావలి ఏరియా ఆస్పత్రి, కావలి కేకేఆర్ రెడ్‌క్రాస్ తదితర బ్లడ్‌బ్యాంకులు జిల్లాలో రక్తదాతల నుంచి రక్తాన్ని సేకరిస్తున్నాయి. జిల్లాలో గత సంవత్సరం అన్ని బ్లడ్‌బ్యాంకుల ద్వారా 422 క్యాంపులు నిర్వహించి 37,116 యూనిట్ల రక్తాన్ని సేకరించారు. ఇందులో రెడ్‌క్రాస్ ఒక్కటే 256 క్యాంపులు ద్వారా 16,280 యూనిట్ల రక్తాన్ని సేకరించడం విశేషం. ఒక్క యూనిట్ రక్తాన్ని మూడు కాంపోనెంట్లుగా విభజించి ముగ్గురు ప్రాణాలను కాపాడొచ్చు. జిల్లాలో రక్తదాతలు పెరగడం శుభపరిణామమని అధికారులు పేర్కొంటున్నారు. ప్రస్తుత జనాభాలో ఏడు శాతం వరకు రక్తదానం చేస్తే కొరత ఉండదనిని చెబుతున్నారు.