
22న వీఎస్‌యూకు గవర్నర్ అబ్దుల్ నజీర్ రాక
నెల్లూరు(దర్గామిట్ట): రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్ ఈ నెల 22న జిల్లా పర్యటనకు విచ్చేయనున్నట్లు కలెక్టర్ ఎం హరినారాయణన్ శనివారం తెలిపారు. వెంకటాచలం మండలం కాకుటూరులోని విక్రమ సింహపురి యూనివర్సిటీ స్నాతకోత్సవ వేడుకలో ఆయన పాల్గొంటారు. 22వ తేదీ ఉదయం 9.45 గంటలకు గన్నవరం ఎయిర్‌పోర్టు నుంచి హెలికాఫ్టర్‌లో బయలుదేరి ఉదయం 10.40 గంటలకు నెల్లూరు పోలీస్ పరేడ్ మైదానానికి చేరుకుంటారు. 11.30 గంటల నుంచి విక్రమ సింహపురి యూనివర్సిటీలో నిర్వహించే స్నాతకోత్సవంలో పాల్గొంటారు. సాయంత్రం 5.35 గంటలకు పోలీస్ పరేడ్ మైదానం నుంచి హెలికాఫ్టర్‌లో బయలుదేరి గన్నవరం ఎయిర్‌పోర్టుకు చేరుకుంటారు.
గ్రంథాలయంలో
వేసవి శిబిరం
నెల్లూరు(మినీబైపాస్): వేసవి విజ్ఞాన శిబిరం సందర్భంగా స్థానిక రంగనాయకుల పేటలోని శాఖా గ్రంథాలయంలో శనివారం విద్యార్థినీ విద్యార్థులకు పుస్తక పఠనాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మురిపూడి ట్రస్ట్ అధ్యక్షులు సతీష్ కుమార్ విచ్చేసి విద్యార్థులకు పేపర్ క్రాఫ్ట్‌లో భాగంగా టోపీలను చేయించారు. తదుపరి పిల్లలకు చాక్లెట్స్‌ను అందజేశారు. ఈ కార్యక్రమంలో పలువురు విద్యార్థులు పాల్గొన్నారు. కార్యక్రమాన్ని జూన్ 7వ తేదీ వరకు నిర్వహించనున్నట్లు గ్రంథాలయ అధికారి వి.అరుణ పేర్కొన్నారు.
నీట మునిగిన యువకుడిని
కాపాడిన మైరెన్ పోలీసులు
తోటపల్లిగూడూరు: కోడూరు బీచ్‌లో ప్రమాదంలో చిక్కుకున్న ఓ యువకుడిని మైరెన్ పోలీసులు కాపాడి ప్రాణాలు నిలబెట్టారు. వివరాల్లోకెళితే.. నెల్లూరు డైకాస్ రోడ్డుకు చెందిన జాని తన స్నేహితులతో కలిసి శనివారం ఉదయం కోడూరు బీచ్ సందర్శనకు వచ్చారు. మిత్రులందరూ బీచ్‌లో జలకాలాడుతుండగా జాని ప్రమాదవశాత్తు నీటిలో మునిగిపోయాడు. విషయం తెలుసుకొన్న మైరెన్ పోలీసులు శేషగిరి, సంజయ్‌లు వెంటనే వచ్చి నీటిలో మునిగిపోతున్న అతనిని కాపాడి ఒడ్డుకు చేర్చారు. నీళ్లు తాగి ప్రాణాపాయ స్థితికి చేరిన జానిని నీళ్లు కక్కించి ప్రాథమిక చికిత్స అందించారు. అనంతరం మెరుగైన చికిత్స కోసం నెల్లూరుకు తరలించారు.

22న వీఎస్‌యూకు గవర్నర్ అబ్దుల్ నజీర్ రాక

22న వీఎస్‌యూకు గవర్నర్ అబ్దుల్ నజీర్ రాక