
డీకేటీ పట్టాలను పంపిణీ చేస్తున్న కాకాణి గోవర్ధన్‌రెడ్డి
వెంకటాచలం: రాష్ట్రంలోని రైతుల సమస్యలను పరిష్కరిస్తూ.. వారి పక్షపాతిగా సీఎం జగన్‌మోహన్‌రెడ్డి నిలిచారని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి కొనియాడారు. వెంకటాచలం మండలం గుడ్లూరువారిపాళెం, పుంజులూరుపాడు, ఎగువమిట్ట గ్రామాల్లో కామినేని చెరువు భూములను సాగుచేసుకుంటున్న 329 మంది రైతులకు 326 ఎకరాల డీకేటీ పట్టాలను మొలకలపూడిలో మంత్రి శనివారం పంపిణీ చేశారు. చుక్కల భూమి సమస్య నుంచి విముక్తి పొందిన పలువురు రైతులకు పట్టాలను అందజేసిన అనంతరం నిర్వహించిన సభలో మంత్రి మాట్లాడారు. గతంలో సీజేఎఫ్‌ఎస్‌గా ఉన్న కామినేని చెరువు భూములను గత టీడీపీ ప్రభుత్వం రద్దు చేసి ప్రభుత్వ భూములుగా మార్చి వదిలేసిందని ఆరోపించారు. పలుమార్లు సోమిరెడ్డి చుట్టూ రైతులు తిరిగినా పట్టించుకోలేదని విమర్శించారు. అప్పట్లో రైతులు తమ దృష్టికి తీసుకురాగా, తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇచ్చిన అంశాన్ని గుర్తుచేశారు. ఈ క్రమంలో పట్టాలను పంపిణీ చేశామని వెల్లడించారు.
రైతు ద్రోహి సోమిరెడ్డి
టీడీపీ హయాంలో వ్యవసాయ శాఖ మంత్రిగా సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి బాధ్యతలు నిర్వర్తించినా, రైతులను అడ్డంపెట్టుకొని దోచుకొని రైతు ద్రోహిగా మిగిలా రని ధ్వజమెత్తారు. కామినేని చెరువు రైతులకు పట్టాలను పంపిణీ చేస్తుంటే సంతోషించకుండా, వీటిని ఎలా అందజేస్తారంటూ అధికారులను బెదిరించడం ఆయన నీచ బుద్ధికి నిదర్శనమని చెప్పారు. ప్రజల అండదండలు, భగవంతుడి ఆశీస్సులు ఉన్నంత కాలం సర్వేపల్లిలో అభివృద్ధి పనులను అడ్డుకోవడం ఆయన తరంకాదని స్పష్టం చేశారు. వైస్ ఎంపీపీ కనుపూరు కోదండరామిరెడ్డి, పార్టీ జిల్లా అధికార ప్రతినిధి మందల వెంకటశేషయ్య, మండలాధ్యక్షుడు కొణిదెన మోహన్‌నాయుడు, యువజన విభాగ మండలాధ్యక్షుడు ఈపూరు రజనీకాంత్‌రెడ్డి, నేతలు ఈపూరు మురళీధర్‌రెడ్డి, ఎంపీటీసీలు వేమారెడ్డి రఘునందన్‌రెడ్డి, సుమలత, సర్పంచ్ ప్రభావతి, విజయభాస్కర్‌నాయుడు, దువ్వూరు చంద్రారెడ్డి, రాజా తదితరులు పాల్గొన్నారు.
మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి
కామినేని చెరువు రైతులు
329 మందికి పట్టాల పంపిణీ