
ఏథన్స్ (గ్రీస్): ప్రపంచ అండర్–17 రెజ్లింగ్ చాంపియన్‌షిప్‌లో భారత యువ రెజ్లర్ లక్కీ పసిడి పతకానికి అడుగు దూరంలో నిలిచాడు. పురుషుల ఫ్రీస్టయిల్ 110 కేజీల విభాగంలో లక్కీ ఫైనల్‌కు దూసుకెళ్లాడు. జపాన్, ఇరాన్‌కు చెందిన రెజ్లర్లపై విజయాలతో లక్కీ ముందంజ వేశాడు.
జపాన్ రెజ్లర్ హంటో హయేషిపై టెక్నికల్ సూపీరియారిటీతో విజయం సాధించిన లక్కీ... తదుపరి రౌండ్‌లో 8–0తో ముర్తాజ్ బగ్దవద్జె (జార్జియా)పై గెలుపొందాడు. ఇక హోరాహోరీగా సాగిన సెమీఫైనల్లో లక్కీ 15–7 పాయింట్ల తేడాతో ఇరాన్‌కు చెందిన అమీర్ హుసేన్‌పై నెగ్గాడు. 65 కేజీల విభాగంలో గౌరవ్ పూనియా తొలి రెండు రౌండ్‌లలో టెక్నికల్ సుపీరియారిటీతో విజయం సాధించినా... క్వార్టర్స్‌లో ఓడి ఇంటిబాట పట్టాడు.