
You’ll see me in the World Cup: ఆసియా వన్డే కప్-2023.. నెల తిరిగేలోపు వన్డే ప్రపంచకప్.. మెగా ఈవెంట్ల రూపంలో క్రికెట్ అభిమానులకు కావాల్సినంత వినోదం లభించనుంది. శ్రీలంక, పాకిస్తాన్‌లలో ఆసియా కప్ జరుగనుండగా.. భారత్ వేదికగా ఐసీసీ టోర్నీ నిర్వహణకు షెడ్యూల్ ఖరారైంది. అక్టోబరు 5- నవంబరు 19 వరకు ప్రపంచకప్ ఈవెంట్ జరుగనుంది.
కత్తిమీద సాము
ఈ నేపథ్యంలో అర్హత సాధించిన జట్లన్నీ జట్ల కూర్పుపై దృష్టి సారించాయి. ఇక.. దాదాపు పన్నెండేళ్ల తర్వాత సొంతగడ్డపై వరల్డ్‌కప్ ఆడనున్న టీమిండియాపై అంచనాలు భారీగా ఉంటాయని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. సీనియర్లతో పాటు యువ ఆటగాళ్లు కూడా సత్తా చాటడం ఓవైపు.. సానుకూల అంశంగా కనిపిస్తున్నా.. మరోవైపు ఇదే సెలక్టర్లకు కత్తిమీద సాములా తయారైంది.
రాహుల్ వస్తున్నాడు.. అయ్యర్ మాత్రం
ఇదిలా ఉంటే.. గాయాల బెడదతో చాన్నాళ్లుగా జట్టుకు దూరమైన ఆటగాళ్ల జాబితాలో ఉన్న వికెట్ కీపర్ కేఎల్ రాహుల్ ఆసియా కప్ నాటికి తిరిగి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక మిడిలార్డర్ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్ వరల్డ్‌కప్ సమయానికైనా అందుబాటులోకి వస్తాడని ఆశిస్తున్నట్లు కెప్టెన్ రోహిత్ శర్మ ఇటీవలే స్పష్టం చేశాడు.
వాళ్లిద్దరు లేకపోవడంతో
ప్రధాన పేసర్ జస్‌ప్రీత్ బుమ్రా ఐర్లాండ్‌తో టీ20 సిరీస్‌లో కెప్టెన్‌గా రీఎంట్రీ ఇస్తుండగా.. కీలక వికెట్ కీపర్ బ్యాటర్ రిషభ్ పంత్ జాతీయ క్రికెట్ అకాడమీలో పునరావాసం పొందుతున్నాడు. ఇక ప్రస్తుతం రాహుల్, రిషభ్ జట్టుకు దూరంగా ఉంటున్న కారణంగా కేఎస్ భరత్(టెస్టులు), ఇషాన్ కిషన్‌లు వికెట్ కీపింగ్ చేస్తున్నారు.
నన్ను తప్పకుండా చూస్తారు!
వీరితో పాటు సంజూ శాంసన్ కూడా అందుబాటులో ఉండనే ఉన్నాడు. ఈ నేపథ్యంలో వరల్డ్‌కప్‌లో టీమిండియా వికెట్ కీపర్‌గా ఎవరు ఉంటారన్న అంశంపై సోషల్ మీడియాలో ఆసక్తికర చర్చ నడుస్తోంది. కేఎల్ రాహుల్(పూర్తిగా కోలుకుని తిరిగి వస్తే), ఇషాన్ కిషన్, సంజూ శాంసన్‌లలో ఎవరిని తీసుకుంటే బెస్ట్ అని ఓ ట్విటర్ యూజర్.. నెటిజన్ల ఛాయిస్ అడిగాడు.
వద్దు బాబోయ్.. వస్తానన్నది కామెంటేటర్‌గా?
ఇందుకు బదులుగా.. ఓ అభిమాని వెటరన్ వికెట్ కీపర్ బ్యాటర్ దినేశ్ కార్తిక్ పేరును చెప్పాడు. ఇక డీకే సైతం స్పందిస్తూ.. ‘‘ఈసారి వరల్డ్‌కప్‌లో నన్ను తప్పకుండా చూడబోతున్నారు. ఇంతకంటే ఏం చెప్పగలను’’ అంటూ తనదైన శైలిలో రిప్లై ఇచ్చాడు. అయితే, నెటిజన్లు మాత్రం.. ‘‘2019 వన్డే వరల్డ్‌కప్, 2022 టీ20 ప్రపంచకప్ టోర్నీల్లో ఆడే అవకాశం ఇస్తే ఏం చేశావో గుర్తుంది. అమ్మో.. నువ్వు మళ్లీ రావొద్దు.. రాలేవులే!’’ అంటూ ట్రోల్ చేస్తున్నారు.
కాగా ఐపీఎల్-2022లో ఆర్సీబీ తరఫున అద్భుత ప్రదర్శన కనబరిచి ఫినిషర్‌గా ఆకట్టుకున్న దినేశ్ కార్తిక్‌ను ప్రపంచకప్-2022 జట్టుకు ఎంపిక చేశారు సెలక్టర్లు. కానీ ఈ వెటరన్ వికెట్ కీపర్ అంచనాలు అందుకోలేక చతికిలపడ్డాడు. ఐపీఎల్-2023లోనూ విఫలమై.. ప్రస్తుతం కామెంటేటర్‌గా కొనసాగుతున్నాడు. ఈ నేపథ్యంలో డీకే వరల్డ్‌కప్‌లో కనిపిస్తానన్నది కామెంటేటర్‌గా అంటూ అతడి అభిమానులు పేర్కొంటున్నారు.
చదవండి: సత్తా చాటిన శుభ్‌మన్.. దుమ్మురేపిన తిలక్ వర్మ
You'll see me in the World Cup for sure is what I can say 😉 https://t.co/nzzXzGbiki
— DK (@DineshKarthik) August 8, 2023