నవతరం అత్యుత్తమ టెస్టు క్రికెటర్లలో కేన్ విలియమ్సన్ ఒకడు. టీమిండియా దిగ్గజం విరాట్ కోహ్లి.. ఇంగ్లండ్ లెజెండ్ జో రూట్, ఆస్ట్రేలియా స్టార్ స్టీవ్ స్మిత్‌తో కలిసి ‘ఫ్యాబ్ ఫోర్’లో ఈ న్యూజిలాండ్ స్టార్‌కు స్థానం ఉంది.
ఇప్పటికే కోహ్లి టెస్టులకు వీడ్కోలు పలకగా.. రూట్, స్మిత్ మాత్రం ఇంకా తమ ప్రయాణం కొనసాగిస్తున్నారు. ముఖ్యంగా సచిన్ టెండుల్కర్ (15,921) అత్యధిక పరుగుల రికార్డుకు చేరువైన జో రూట్ (13,943 రన్స్).. సచిన్ ఘనతను సమం చేయడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నాడు.
ఇలాంటి తరుణంలో కేన్ విలియమ్సన్ రిటైర్మెంట్‌పై సంకేతాలు ఇచ్చాడు. దీంతో ‘ఫ్యాబ్ ఫోర్’లో మరో వికెట్ పడుతుందా? అంటూ అభిమానులు నిరాశ వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల ఐర్లాండ్‌తో టెస్టులు ఆడిన విలియమ్సన్.. తదుపరి ఇంగ్లండ్ గడ్డపై సత్తా చాటేందుకు సిద్ధమమ్యాడు.
ఈ టూర్‌లో భాగంగా న్యూజిలాండ్ ఆతిథ్య ఇంగ్లండ్‌తో మూడు టెస్టులు ఆడనుంది. లండన్‌లోని ప్రఖ్యాత లార్డ్స్ మైదానంలో ఈ సిరీస్‌కు తెరలేవనుంది. ఇరుజట్ల మధ్య గురువారం (జూన్ 4) నుంచి తొలి టెస్టు మొదలుకానుంది.
ఈ నేపథ్యంలో మీడియాతో మాట్లాడిన న్యూజిలాండ్ స్టార్ కేన్ విలియమ్సన్‌కు లార్డ్స్‌లో మీరు ఆడే చివరి మ్యాచ్ ఇదేనా అనే ప్రశ్న ఎదురైంది. ఇందుకు.. ‘‘అవును.. బహుశా ఇదే ఆఖరి మ్యాచ్ కావొచ్చు’’ అంటూ జీరబోయిన గొంతుతో విలియమ్సన్ బదులిచ్చాడు. బాధను అణిచిపెట్టుకుంటూ.. ‘‘మీ వల్ల నా భోజనానికి (లంచ్) ఆలస్యమవుతోంది. మీరిలా చేయడం అస్సలు మంచిది కాదు’’ అంటూ నవ్వులు పూయించాడు.
కాగా 35 ఏళ్ల విలియమ్సన్ ఇప్పటి వరకు తన కెరీర్‌లో న్యూజిలాండ్ తరఫున 109 టెస్టులు ఆడాడు. 33 సెంచరీలు, 38 అర్ధ శతకాల సాయంతో 9497 పరుగులు సాధించాడు. ఇందులో ఆరు ద్విశతకాలు కూడా ఉన్నాయి. ఇదిలా ఉంటే.. ఇంగ్లండ్ పర్యటనలో భాగంగా న్యూజిలాండ్ మూడు టెస్టులు ఆడనుంది. లార్డ్స్, కెన్నింగ్‌టన్ ఓవల్, ట్రెంట్ బ్రిడ్జ్ ఇందుకు వేదికలు.
చదవండి: కమిన్స్ సంచలన నిర్ణయం!


