
ఐదు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్ కోసం భారత సీనియర్ క్రికెట్ జట్టు జూన్ 20 నుంచి ఇంగ్లండ్‌లో పర్యటించనుంది. ఈ సిరీస్‌కు ముందు భారత్-ఏ, ఇంగ్లండ్ లయన్స్ మధ్య రెండు అనధికారిక టెస్ట్ మ్యాచ్‌లు జరుగనున్నాయి. ఇందులో మొదటి టెస్ట్ మే 30న ప్రారంభం కానుంది. ఈ మ్యాచ్ కోసం 14 మంది సభ్యుల భారత-ఏ జట్టు ఎంపిక పూర్తైనట్లు తెలుస్తుంది.
ఐపీఎల్ రివైజ్డ్ షెడ్యూల్ కారణంగా ఇంగ్లండ్ లయన్స్‌తో రెండో టెస్ట్‌కు జట్టు ఎంపికను వాయిదా వేసినట్లు తెలుస్తుంది. ఐపీఎల్ ప్లే ఆఫ్స్ తేదీలతో తొలి అనధికారిక టెస్ట్ మ్యాచ్ తేదీలు క్లాష్ అవుతున్న కారణంగా ప్లే ఆఫ్స్ అవకాశాలు ఉన్న జట్ల ఆటగాళ్లను ఎంపిక చేయలేదు. రెండో అనధికారిక టెస్ట్ కోసం భారత-ఏ జట్టును త్వరలో ప్రకటించే అవకాశం ఉంది.
కాగా, తొలి అనధికారిక టెస్ట్ కోసం ఎంపిక చేసిన భారత-ఏ జట్టులో యువ ఆటగాళ్లు యశస్వి జైస్వాల్, ఇషాన్ కిషన్ చోటు దక్కించుకున్నారని సమాచారం. వీరితో పాటు దేశవాలీ క్రికెట్‌లో విశేషంగా రాణించిన కరుణ్ నాయర్‌కు కూడా బెర్త్ దక్కినట్లు తెలుస్తుంది.
ఈ ముగ్గురితో పాటు ఐపీఎల్ ప్లే ఆఫ్స్ అవకాశాలు లేని జట్లకు చెందిన నితీశ్ రెడ్డి, ధృవ్ జురెల్, అభిమన్యు ఈశ్వరన్, ఆకాశ్‌దీప్, తనుశ్ కోటియన్‌ను కూడా తొలి అనధికారిక టెస్ట్ కోసం ఎంపిక చేసినట్లు తెలుస్తుంది. వీరంతా ఇటీవల ముగిసిన ఆస్ట్రేలియా టూర్‌లో భాగమై ఉన్నారు. ధృవ్ జురెల్, ఇషాన్ కిషన్ ఎంపికతో సంజూ శాంసన్‌కు మొండిచెయ్యి ఎదురైనట్లు తెలుస్తుంది.
పైన పేర్కొన్న ఆటగాళ్లతో పాటు దేశవాలీ క్రికెట్‌లో సత్తా చాటిన శార్దూల్ ఠాకూర్, అన్షుల్ కంబోజ్, మానవ్ సుతార్‌ను కూడా తొలి అనధికారిక టెస్ట్ కోసం ఎంపిక చేసినట్లు సమాచారం. ఐపీఎల్-2025లో అంచనాలకు మించి రాణించిన సీఎస్‌కే పేసర్ ఖలీల్ అహ్మద్‌కు కూడా జట్టులో చోటు దక్కినట్లు తెలుస్తుంది.
ఐపీఎల్ టైటిల్ రేసులో ముందున్న గుజరాత్ టైటాన్స్ ఆటగాళ్లు సాయి సుదర్శన్, వాషింగ్టన్ సుందర్‌ను రెండో అనధికారిక టెస్ట్‌కు ఎంపిక చేస్తారని తెలుస్తుంది. వీరితో పాటు రజత్ పాటిదార్, అర్షదీప్ సింగ్, తిలక్ వర్మను కూడా రెండో టెస్ట్‌కు ఎంపిక చేసే అవకాశం ఉంది. ఈ టెస్ట్ జూన్ 6న ప్రారంభమవుతుంది. గత ఇంగ్లండ్ సిరీస్‌లో రాణించిన సర్ఫరాజ్ ఖాన్‌ను నేరుగా భారత సీనియర్ జట్టుకు ఎంపిక చేస్తారని ప్రచారం జరుగుతుంది.
ఇదిలా ఉంటే, రెండు అనధికారిక టెస్ట్ తర్వాత జూన్ 20న భారత సీనియర్ జట్టు ఇంగ్లండ్‌తో తొలి టెస్ట్ ఆడనుంది. ఈ సిరీస్ కోసం భారత జట్టును ప్రకటించాల్సి ఉంది. రోహిత్ శర్మ టెస్ట్‌లకు రిటైర్మెంట్ ప్రకటించడంతో అతని స్థానంలో శుభ్‌మన్ గిల్‌ను భారత కెప్టెన్‌గా నియమించవచ్చని తెలుస్తుంది. విరాట్ కోహ్లి కూడా టెస్ట్‌లకు గుడ్‌బై చెప్పడంతో అతని స్థానాన్ని కూడా భర్తీ చేయాల్సి ఉంటుంది.