
ఇటీవలికాలంలో భారత అండర్-19 క్రికెట్ హీరోలు చెలరేగిపోతున్నారు. వైభవ్ సూర్యవంశీ, ఆయుశ్ మాత్రే లాంటి వారు ఇటీవల ఇంగ్లండ్ గడ్డపై ఆకాశమే హద్దుగా చెలరేగగా.. తాజాగా ఢిల్లీ ప్రీమియర్ లీగ్-2025లో భారత అండర్-19 జట్టు మాజీ సారధి యశ్ ధుల్ విధ్వంసకర శతకంతో విరుచుకుపడ్డాడు.
డీపీఎల్ 2025 రెండో మ్యాచ్‌లో ధుల్ సెంట్రల్ ఢిల్లీ కింగ్స్‌కు ఆడుతూ నార్త్రన్ ఢిల్లీ స్ట్రయికర్స్‌పై 56 బంతుల్లో 8 ఫోర్లు, 7 భారీ సిక్సర్ల సాయంతో అజేయమైన 101 పరుగులు చేశాడు. ఫలితంగా సెంట్రల్ ఢిల్లీ 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది.
ప్రస్తుత డీపీఎల్ సీజన్‌లో ధుల్ సెంచరీనే మొదటిది. గత సీజన్ మొత్తంలో 93 పరుగులే చేసిన ధుల్ ఈ సీజన్ తొలి మ్యాచ్‌లోనే సెంచరీతో మెరిశాడు. రెడ్ బాల్ బ్యాటర్‌గా ముద్రపడిన ధుల్ ఈ ఇన్నింగ్స్‌తో ఆ ముద్రను చెరిపేసి ఆల్ ఫార్మాట్ బ్యాటర్ అనిపించుకున్నాడు.
అండర్-19 క్రికెట్ ప్రదర్శనల ఆధారంగా 2023 ఐపీఎల్ సీజన్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ తరఫున అరంగేట్రం చేసిన ధుల్.. ఆ సీజన్‌లో దారుణంగా విఫలమయ్యాడు. 3 ఇన్నింగ్స్‌ల్లో కేవలం 16 పరుగులే చేశాడు. ఆ సీజన్‌లో పేలవ ప్రదర్శన తర్వాత ధుల్‌ను ఏ ఐపీఎల్ ఫ్రాంచైజీ పట్టించుకోలేదు. తాజాగా ప్రదర్శనతో ఢిల్లీ క్యాపిటల్స్ ధుల్‌ను మరోసారి దక్కించుకనే ప్రయత్నం చేయవచ్చు.
మ్యాచ్ విషయానికొస్తే.. తొలుత బ్యాటింగ్ చేసిన ఉత్తర ఢిల్లీ.. సర్తక్ రంజన్ (82), అర్నవ్ బుగ్గా (67) అర్ద సెంచరీలతో రాణించడంతో నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 174 పరుగులు చేసింది. సెంట్రల్ ఢిల్లీ బౌలర్లలో గవిన్ష్ ఖురానా, మనీ గ్రేవాల్ తలో 2 వికెట్లు తీయగా.. సిమర్‌జీత్ సింగ్, తేజస్ బరోకా తలో వికెట్ పడగొట్టారు.
అనంతరం ఓ మోస్తరు లక్ష్య ఛేదనకు దిగిన సెంట్రల్ ఢిల్లీ.. ఓపెనర్ యశ్ ధుల్ విధ్వంసకర శతకంతో విరుచుకుపడటంతో 17.3 ఓవర్లలోనే విజయతీరాలకు చేరింది (2 వికెట్లు కోల్పోయి). సెంట్రల్ ఢిల్లీని విజయతీరాలకు చేర్చడంలో ధుల్‌కు యుగల్ సైనీ (36), జాంటి సిద్దూ (23 నాటౌట్) సహకరించారు. ఉత్తర ఢిల్లీ బౌలర్లలో కుల్దీప్ యాదవ్ 2 వికెట్లు తీశాడు.