WTC Final: అతడు ఫాంలో ఉంటే భారత్‌దే గెలుపు!

WTC Final Winning Chances Increase To India If Bumrah On Form: Saba Karim - Sakshi

న్యూఢిల్లీ: ఫాస్ట్‌బౌలర్‌ జస్‌ప్రీత్‌ బుమ్రాపై టీమిండియా మాజీ క్రికెటర్‌ సబా కరీం ప్రశంసలు కురిపించాడు. అద్భుతమైన బౌలింగ్‌తో ఆకట్టుకునే బుమ్రా.. వరల్డ్‌ టెస్టు చాంపియన్‌షిప్‌ ఫైనల్‌లో భారత్‌కు కీలకం కానున్నాడని పేర్కొన్నాడు. ఒకవేళ అతడు గనుక ఫాం కొనసాగిస్తే న్యూజిలాండ్‌పై భారత్‌ గెలిచే అవకాశాలు మరింతగా మెరుగుపడతాయని ఆశాభావం వ్యక్తం చేశాడు. కాగా టీమిండియా పేస్‌ దళంలో బుమ్రా కీలక పాత్ర పోషిస్తున్న విషయం తెలిసిందే.

ఇక టెస్టు క్రికెట్‌లో అడుగుపెట్టిన అనతి కాలంలోనే 83 వికెట్లు తీసి సత్తా చాటాడు. అంతేకాదు.. ఇంగ్లండ్‌, సౌతాఫ్రికా, ఆస్ట్రేలియా, వెస్టిండీస్‌ వంటి జట్లపై టెస్టు ఫార్మాట్‌లో ఐదు వికెట్లు(ఒకే ఇన్నింగ్స్‌) తీసిన తొలి ఆసియా బౌలర్‌గా చరిత్ర సృష్టించాడు. ఈ నేపథ్యంలో సబా కరీం మాట్లాడుతూ... ‘‘ 3-4 ఐపీఎల్‌ మ్యాచ్‌లు చూశాను. బుమ్రా మంచి ఫాంలో ఉన్నాడు అనిపించింది. తనొక ప్రత్యేకమైన బౌలర్‌. మూడు ఫార్మాట్లలోనూ మెరుగ్గా రాణిస్తున్నాడు. టీమిండియాకు ప్రస్తుతం ఉన్న ప్రధాన పేసర్‌ తను.

షార్ట్‌ బంతులు సంధించి వికెట్లు పడగొట్టగలడు. తనదైన శైలిలో బౌలింగ్‌ చేస్తూ జట్టులో స్థానం సుస్థిరం చేసుకున్న బుమ్రా.. డబ్ల్యూటీసీలో కూడా ఇదే జోరు కొనసాగిస్తాడని నాకు నమ్మకం ఉంది. తను ఫాంలో ఉంటే మనకు గెలిచే అవకాశాలు పెరుగుతాయి.’’ అని మాజీ సెలక్టర్‌ సబా కరీం అభిప్రాయపడ్డాడు. కాగా జూన్‌లో న్యూజిలాండ్‌తో జరగనున్న వరల్డ్‌ టెస్టు చాంపియన్‌షిప్‌ ఫైనల్‌కు భారత జట్టును బీసీసీఐ ప్రకటించిన సంగతి తెలిసిందే.

భారత్‌ జట్టు: విరాట్‌ కోహ్లీ (కెప్టెన్‌), అజింక్య రహానే (వైఎస్‌ కెప్టెన్‌), రోహిత్‌ శర్మ, శుబ్‌మన్‌ గిల్‌, మయాంక్‌ అగర్వాల్‌, పుజారా, విహారి, రిషబ్‌ పంత్(వికెట్‌ కీపర్‌)‌, రవిచంద్రన్‌ అశ్విన్‌, జడేజా, అక్షర్‌ పటేల్‌, వాషింగ్టన్‌ సుందర్‌, బుమ్రా, ఇషాంత్‌ శర్మ, షమీ, సిరాజ్‌, శార్దూల్ ఠాకూర్‌‌, ఉమేష్‌ యాదవ్‌

చదవండి: నేను మరీ అంతపనికిరాని వాడినా: కుల్దీప్ యాద‌వ్‌

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top