WPL 2023: ఉత్కంఠ సమరంలో యూపీ వారియర్జ్‌ విజయం, లీగ్‌ నుంచి ఆర్సీబీ ఔట్‌

WPL 2023: Mcgrath, Harris Shines As UP Warriorz Beat Gujarat Giants - Sakshi

డబ్ల్యూపీఎల్‌-2023లో మరో ఉత్కంఠ సమరం జరిగింది. గుజరాత్‌ జెయింట్స్‌తో ఇవాళ (మార్చి 20) మధ్యాహ్నం మొదలైన మ్యాచ్‌లో యూపీ వారియర్జ్‌ సూపర్‌ విక్టరీ సాధించి, ప్లే ఆఫ్స్‌ బెర్తు ఖరారు చేసుకుంది. తద్వారా లీగ్‌ నుంచి రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు నిష్క్రమించాల్సి వచ్చింది. పాయింట్ల పట్టికలో తొలి రెండు స్థానాల్లో ఉన్న ముంబై ఇండియన్స్‌, ఢిల్లీ క్యాపిటల్స్‌ ఇదివరకే ప్లే ఆఫ్స్‌కు చేరుకోగా, తాజా విజయంతో వారియర్జ్‌ ప్లే ఆఫ్స్‌ బెర్త్‌ కన్ఫర్మ్‌ చేసుకుంది. 

ఈ మ్యాచ్‌లో టాస్‌ గెలిచి తొలుత బ్యాటింగ్‌ చేసిన జెయింట్స్‌.. దయాలన్‌ హేమలత (33 బంతుల్లో 57; 6 ఫోర్లు, 3 సిక్సర్లు), ఆష్లే గార్డ్‌నర్‌ (39 బంతుల్లో 60; 6 ఫోర్లు, 3 సిక్సర్లు) మెరుపు అర్ధశతకాలతో విరుచుకుపడటంతో నిర్ణీత ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 178 పరుగుల భారీ స్కోర్‌ చేయగా.. తహీల మెక్‌గ్రాత్‌ (38 బంతుల్లో 57; 11 ఫోర్లు), గ్రేస్‌ హ్యారిస్‌ (41 బంతుల్లో 72; 7 ఫోర్లు, 4 సిక్సర్లు) విధ్వంసకర ఇన్నింగ్స్‌లతో మెరిసి తమ జట్టును ప్లే ఆఫ్స్‌కు చేర్చారు.

ఆఖర్లో సోఫీ ఎక్లెస్టోన్‌ (13 బంతుల్లో 19 నాటౌట్‌; 2 ఫోర్లు) బాధ్యతాయుతమైన ఇన్నింగ్స్‌ ఆడి మరో బంతి మిగిలుండగానే వారియర్జ్‌ను విజయతీరాలకు చేర్చింది. 19వ ఓవర్‌లో ఐదో బంతిని ఎక్లెస్టోన్‌ బౌండరీకి తరలించడంతో వారియర్జ్‌ 3 వికెట్ల తేడాతో విజయం సాధించింది. 39 పరుగులకే 3 వికెట్లు కోల్పోయిన వారియర్జ్‌ను తహీల మెక్‌గ్రాత్‌ బాధ్యతాయుతమైన ఇన్నింగ్స్‌తో, గ్రేస్‌ హ్యారిస్‌ విధ్వంసకర ఇన్నింగ్స్‌తో గెలిపించారు. ఈ సీజన్‌లో జెయింట్స్‌తో జరిగిన మొదటి మ్యాచ్‌లో అజేయమైన మెరుపు హాఫ్‌ సెంచరీతో (26 బంతుల్లో 59) మెరిసి వారియర్జ్‌ను ఇన్నే వికెట్ల తేడాతో గెలిపించిన హ్యారిస్‌కు ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌ అవార్డు దక్కింది.  

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top