
దిగ్గజ బ్యాటర్ విరాట్ కోహ్లి (Virat Kohli) రిటైర్మెంట్‌తో భారత టెస్టు క్రికెట్ చరిత్రలో ఓ శకం ముగిసింది. మిడిలార్డర్‌లో కీలకమైన నాలుగో స్థానంలో ఆడుతూ ఇన్నాళ్లూ ఈ రన్‌మెషీన్ కీలక బాధ్యతను తన భుజాల మీద మోశాడు. అయితే, ఇప్పుడు అతడు టెస్టులకు వీడ్కోలు పలకడంతో ఆ స్థానం ఖాళీ అయింది. మరి కోహ్లి ప్లేస్‌ను భర్తీ చేసేదెవరు?!
ఈ విషయం గురించి టీమిండియా వెటరన్ బ్యాటర్, నయా వాల్ ఛతేశ్వర్ పుజారా (Cheteshwar Pujara) ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. కోహ్లి వారసుడి గురించి ఇప్పుడే ఓ అంచనాకు రాలేమని.. కనీసం రెండు సిరీస్‌ల తర్వాతే ఈ విషయంపై స్పష్టత వస్తుందన్నాడు. ఈ మేరకు ఈఎస్‌పీఎన్‌క్రిక్‌ఇన్ఫోతో మాట్లాడుతూ..
ఛతేశ్వర్ పుజారా కీలక వ్యాఖ్యలు
‘‘నాలుగో స్థానంలో అత్యుత్తమ బ్యాటర్ ఉండాలి. అప్పుడే జట్టు నిలబడుతుంది. ప్రస్తుతం చాలా మంది టెస్టు తుదిజట్టులో చోటు దక్కించుకునేందుకు పోటీపడుతున్నారు. అయితే, వీరిలో నాలుగో స్థానంలో ఎవరు పూర్తిస్థాయిలో ఆడతారనేది ఇంగ్లండ్ పర్యటన తర్వాత తేలనుంది.
ఎందుకంటే ఇంగ్లండ్ గడ్డ మీద నంబర్ ఫోర్‌లో రాణిస్తే అంతకంటే గొప్ప విషయం మరొకటి ఉండదు’’ అని పుజారా పేర్కొన్నాడు. కాగా సచిన్ టెండుల్కర్ నిష్క్రమణ తర్వాత కోహ్లి 99 సార్లు నాలుగో స్థానంలో బ్యాటింగ్ చేశాడు.
ఇక అజింక్య రహానే తొమ్మిది సార్లు, పుజారా ఏడు టెస్టుల్లో నాలుగో నంబర్ బ్యాటర్లుగా బరిలోకి దిగారు. ప్రస్తుతం ఉన్న ఆటగాళ్లలో కేఎల్ రాహుల్, సర్ఫరాజ్ ఖాన్, రజత్ పాటిదార్, శ్రేయస్ అయ్యర్, సాయి సుదర్శన్‌లకు కోహ్లి స్థానాన్ని భర్తీ చేయగల సత్తా ఉందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
ఈ క్రమంలో శుబ్‌మన్ గిల్ గురించి ప్రస్తావిస్తూ.. ‘‘కొత్త బంతుల్ని ఎదుర్కోవడంలో శుబ్‌మన్ దిట్ట. గతంలో అతడు ఓపెనర్‌గా వచ్చేవాడు. ఆ తర్వాత మూడో స్థానానికి మారిపోవాల్సి వచ్చింది.
అయితే, అతడు ఓల్డ్ బాల్‌ను ఎంత వరకు ఎదుర్కోగలడన్న విషయం కాలక్రమేణా తేలుతుంది. అప్పటిదాకా కోహ్లి స్థానాన్ని భర్తీ చేస్తూ.. దీర్ఘకాలంలో ఆ ప్లేస్‌లో కొనసాగే ఆటగాడు ఎవరో చెప్పడం కష్టతరమే అవుతుంది’’ అని పుజారా పేర్కొన్నాడు.
రోహిత్ బాటలోనే కోహ్లి
కాగా మే తొలివారంలో కెప్టెన్ రోహిత్ శర్మ టెస్టులకు గుడ్‌బై చెప్పగా.. సోమవారం విరాట్ కోహ్లి కూడా రిటైర్మెంట్ ప్రకటించాడు. వీరిద్దరు ఇప్పటికే అంతర్జాతీయ పొట్టి ఫార్మాట్ నుంచి వైదొలిగారు. ఇక ఇప్పుడు కేవలం వన్డేల్లో మాత్రమే కొనసాగనున్నారు.
ఇదిలా ఉంటే కోహ్లి సారథ్యంలో 2021లో, రోహిత్ కెప్టెన్సీలో 2023లో ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ ఫైనల్ చేరిన టీమిండియా.. ఈసారి మాత్రం నిరాశపరిచింది. ఆస్ట్రేలియాతో బోర్డర్- గావస్కర్ ట్రోఫీని 3-1తో చేజార్చుకున్న రోహిత్ సేన డబ్ల్యూటీసీ 2025 ఫైనల్‌కు దూరమైంది.
ఇక తదుపరి డబ్ల్యూటీసీ 2025-27 సీజన్‌లో మొదటగా టీమిండియా ఇంగ్లండ్‌తో తలపడనుంది. జూన్ 20 నుంచి ఇరుజట్ల మధ్య ఐదు టెస్టుల సిరీస్ జరుగనుంది. ఈ నేపథ్యంలో కోహ్లి, రోహిత్ లేకుండా తొలిసారి భారత జట్టు ఇంగ్లండ్ గడ్డ మీద అడుగుపెట్టబోతోంది. ఈ జట్టుకు శుబ్‌మన్ గిల్ కెప్టెన్‌గా వ్యవహరించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.
చదవండి: కోహ్లి, రోహిత్ వన్డే వరల్డ్‌కప్-2027 ఆడరు: టీమిండియా దిగ్గజం