
Ind Vs Wi ODI Series- IPL 2022 Mega Auction: వెస్టిండీస్ ఆల్‌రౌండర్ ఓడియన్ స్మిత్ త్వరలో జరగనున్న ఐపీఎల్ -2022 మెగా వేలంలో ఏదో ఒక ఫ్రాంఛైజీ తనను కొనుగోలు చేస్తుందని భావిస్తున్నాడు. బెంగళూరు వేదికగా ఫిబ్రవరి 12, 13 తేదీల్లో మెగా వేలాన్ని బీసీసీఐ నిర్వహించనుంది. కాగా వేలంలో రూ. 2కోట్లకు తన పేరును స్మిత్ రిజిస్టర్ చేసుకున్నాడు. అహ్మదాబాద్ వేదికగా భారత్తో జరిగిన రెండో వన్డే అనంతరం వర్చువల్ మీడియా ఇంటరాక్షన్‌లో స్మిత్ మాట్లాడుతూ... వేలంలో తొలిసారి పాల్గొనడం చాలా ఉత్సాహంగా ఉందన్నాడు.
"నన్ను ఏదో ఒక ఫ్రాంచైజీ కొనుగోలు చేస్తే బాగుంటుంది. నేను ఎక్కువగా వేలంపై ఆశలు పెట్టుకున్నా. నేను ఆండ్రీ రస్సెల్‌ని ఆదర్శంగా తీసుకున్నాను. అతడు బ్యాటింగ్, బౌలింగ్‌లోను ఒకే రకమైన దూకుడు చూపిస్తాడు. అతడి బ్యాటింగ్ చూసి నేను చాలా విషయాలు నేర్చుకున్నాను. ఇక అంతర్జాతీయ క్రికెట్‌లో ఆడడం అంత సులభం కాదు. టీ20ల్లో నాలుగు ఓవర్లు మాత్రమే బౌలింగ్ చేయాలి. కానీ వన్డేల్లో మాత్రం 10 ఓవర్ల ఓవర్లు బౌలింగ్ చేయాలి, కాబట్టి పూర్తి ఫిట్‌నెస్‌తో ఉండాలి" అని స్మిత్ పేర్కొన్నాడు. ఇక భారత్‌తో జరిగిన రెండో వన్డేలో 24 పరుగులు, 2 వికెట్లు పడగొట్టాడు. అదే విధంగా 2016లో అండర్-19 ప్రపంచ కప్ గెలిచిన వెస్టిండీస్ జట్టులో స్మిత్ భాగమై ఉన్నాడు.