Mirabai Chanu: మీరా భారత్‌ మహాన్‌

 Weightlifter Mirabai Chanu wins silver medal in womens 49kg category - Sakshi

టోక్యో ఒలింపిక్స్‌లో తొలి రోజే భారత్‌ పతకాల బోణీ

మహిళల వెయిట్‌లిఫ్టింగ్‌ 49 కేజీల విభాగంలో మీరాబాయి చానుకు రజతం

మల్లేశ్వరి తర్వాత పతకం నెగ్గిన భారత లిఫ్టర్‌గా ఘనత

విశ్వ క్రీడల్లో రజతం సాధించిన రెండో భారతీయ క్రీడాకారిణిగా గుర్తింపు

ఒలింపిక్స్‌ క్రీడలు మొదలైనప్పటి నుంచి ఏనాడూ పోటీల తొలి రోజు భారత్‌కు పతకం రాలేదు. కానీ ఈసారి విశ్వ క్రీడల మొదటి రోజే భారతీయులు శుభవార్త విన్నారు. మహిళల వెయిట్‌లిఫ్టింగ్‌లో మీరాబాయి చాను తన ఆటతో ఔరా అనిపించింది. యావత్‌ భారతావనిని మురిసేలా చేసింది. కచ్చితంగా పతకం సాధిస్తుందని తనపై పెట్టుకున్న అంచనాలను నిజం చేస్తూ టోక్యో ఒలింపిక్స్‌లో రజత పతకాన్ని కైవసం చేసుకుంది. పక్కా ప్రణాళికతో ఈ మెగా ఈవెంట్‌కు సిద్ధమైన ఈ మణిపూర్‌ లిఫ్టర్‌ అసలైన రోజున ఎలాంటి ఒత్తిడికి లోను కాలేదు. ఆరంభం నుంచే పూర్తి విశ్వాసంతో ప్రదర్శన చేసి తన జీవిత స్వప్నాన్ని సాకారం చేసుకుంది.   

టోక్యో: ఒలింపిక్స్‌ వెయిట్‌లిఫ్టింగ్‌ క్రీడాంశంలో రెండు దశాబ్దాల పతక నిరీక్షణకు భారత వెయిట్‌లిఫ్టర్‌ మీరాబాయి చాను తెరదించింది. 2000 సిడ్నీ ఒలింపిక్స్‌లో తెలుగు తేజం కరణం మల్లేశ్వరి 69 కేజీల విభాగంలో కాంస్య పతకం సాధించగా... 21 ఏళ్ల తర్వాత మీరాబాయి టోక్యో ఒలింపిక్స్‌లో ఏకంగా రజత పతకం హస్తగతం చేసుకొని మరో చరిత్రను లిఖించింది. ఒలింపిక్స్‌ వెయిట్‌లిఫ్టింగ్‌లో రజత పతకం నెగ్గిన తొలి భారతీయ క్రీడాకారిణిగా... స్టార్‌ షట్లర్‌ పీవీ సింధు తర్వాత విశ్వ క్రీడల్లో రజతం సాధించిన రెండో భారతీయ క్రీడాకారిణిగా 26 ఏళ్ల మీరాబాయి ఘనత వహించింది. ఒలింపిక్స్‌ చరిత్రలో ఓవరాల్‌గా భారత్‌ ఇప్పటివరకు 28 పతకాలు సాధించగా... ఏనాడూ పోటీల తొలిరోజే భారత్‌ ఖాతాలో పతకం చేరలేదు. కానీ మీరాబాయి అద్వితీయ ప్రదర్శన కారణంగా తొలిసారి విశ్వ క్రీడల ఈవెంట్స్‌ మొదలైన తొలి రోజే భారత్‌కు పతకాల పట్టికలో చోటు లభించింది.

ఆద్యంతం ఆత్మవిశ్వాసంతో...
ఎనిమిది మంది వెయిట్‌లిఫ్టర్లు పాల్గొన్న 49 కేజీల విభాగంలో మీరాబాయి చాను మొత్తం 202 కేజీలు బరువెత్తి రెండో స్థానంలో నిలిచింది. మీరాబాయి స్నాచ్‌లో 87 కేజీలు.. క్లీన్‌ అండ్‌ జెర్క్‌లో 115 కేజీలు బరువెత్తింది. చైనాకు చెందిన జిహుయ్‌ హు 210 కేజీలు(స్నాచ్‌లో 94+క్లీన్‌ అండ్‌ జెర్క్‌లో 116) బరువెత్తి స్వర్ణ పతకాన్ని సొంతం చేసుకుంది. ఇండోనేసియా లిఫ్టర్‌ విండీ కాంటిక 194 కేజీలు బరువెత్తి (స్నాచ్‌లో 84+క్లీన్‌ అండ్‌ జెర్క్‌లో 110 కేజీలు) మూడో స్థానంలో నిలిచి కాంస్య పతకాన్ని దక్కించుకుంది. మీరాబాయి స్నాచ్‌ ఈవెంట్‌ తొలి ప్రయత్నంలో 84 కేజీలను... రెండో ప్రయత్నంలో 87 కేజీలను సులువుగా, పూర్తి ఆత్మవిశ్వాసంతో ఎత్తింది. 89 కేజీలతో చేసిన మూడో ప్రయత్నంలో మాత్రం ఆమె విఫలమైంది. దాంతో 87 కేజీల ప్రదర్శనను లెక్కలోకి తీసుకున్నారు. ఇక క్లీన్‌ అండ్‌ జెర్క్‌లో తొలి ప్రయత్నంలో 110 కేజీలు... రెండో ప్రయత్నంలో 115 కేజీలు ఎత్తింది. 117 కేజీలతో చేసిన మూడో ప్రయత్నంలో సక్సెస్‌ కాలేదు. దాంతో 115 కేజీల ప్రదర్శననను పరిగణనలోకి తీసుకున్నారు.

‘ఒలింపిక్‌ పతకం సాధించాలనే నా కల నిజమైంది. రియో ఒలింపిక్స్‌ కోసం కూడా ఎంతో కష్టపడ్డాను కానీ ఆ రోజు నాకు అనుకూలించలేదు. టోక్యోలో నన్ను నేను నిరూపించుకోవాలని అదే రోజు లక్ష్యంగా పెట్టుకున్నాను. రియో ఫలితం తర్వాత చాలా బాధపడ్డా. ఆ సమయంలో నాపై ఉన్న తీవ్ర ఒత్తిడిని అధిగమించలేకపోయాను. ఎన్నో రోజుల తర్వాత గానీ కోలుకోలేదు. అప్పటినుంచి నా శిక్షణ, టెక్నిక్‌ పద్ధతులు మార్చుకున్నాను. ఈ ఐదేళ్లలో మరింతగా శ్రమించాను. గత ఐదేళ్లలో మా ఇంట్లో నేను ఐదు రోజులు మాత్రమే ఉన్నాను. ఇప్పుడు సగర్వంగా ఈ పతకంతో ఇంటికి వెళ్లి అమ్మ చేతి వంట తింటాను. ఇప్పటికే వెయిట్‌లిఫ్టింగ్‌లో ఎంతో మంది అమ్మాయిలు రాణిస్తున్నారు.వారు మరిన్ని ఘనతలు సాధించేలా నా ఈ పతకం స్ఫూర్తినిస్తుందని ఆశిస్తున్నా.
–మీరాబాయి చాను

‘రియోలో పతకం సాధించకపోవడంతో నాపై చాలా ఒత్తిడి పెరిగింది. ఆ తర్వాత మీరా సాధనలో కొన్ని మార్పులు చేశాం. దాంతో వరుసగా సానుకూల ఫలితాలు వచ్చాయి. రోజురోజుకూ ఆమె ఆట మెరుగైంది. గత ఐదేళ్లలో తిండి, నిద్రకు తప్ప మిగతా సమయమంతా ప్రాక్టీస్‌కే వెచ్చించింది. కరోనా కారణంగా ఒలింపిక్‌కు అర్హత సాధించేందుకు మాకు రెండున్నరేళ్లు పట్టాయి. ఈ ప్రస్థానం ఇలా పతకాన్ని అందించడం సంతోషంగా ఉంది.
–విజయ్‌ శర్మ, హెడ్‌ కోచ్‌

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top