PC: WCL X
వరల్డ్ చాంపియన్షిప్ ఆఫ్ లెజెండ్స్-2026 టీ20 టోర్నీ లీగ్ దశలో సౌతాఫ్రికా చాంపియన్స్ అదరగొట్టింది. వరుసగా నాలుగు మ్యాచ్లలో గెలిచిన ప్రొటిస్ జట్టు.. బుధవారం ఆఖరిదైన ఐదో టీ20లోనూ జయభేరి మోగించింది.
210 పరుగులు
షార్జా క్రికెట్ స్టేడియంలో జరిగిన మ్యాచ్లో బంగ్లాదేశ్ చాంపియన్స్ను 88 పరుగుల తేడాతో చిత్తు చేసింది. బంగ్లాతో పోరులో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్కు దిగిన ప్రొటిస్ జట్టు.. నిర్ణీత 20 ఓవర్లలో మూడు వికెట్ల నష్టానికి 210 పరుగులు సాధించింది.
122 పరుగులకే ఆలౌట్
‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ జీన్ పాల్ డుమిని అజేయ అర్ధ శతకం (49 బంతుల్లో 89)తో రాణించగా.. మోర్నీ వాన్ విక్ (19 బంతుల్లో 30), కొలిన్ ఇంగ్రామ్ (25 బంతుల్లో 40*) ఆకట్టుకున్నారు. అనంతరం లక్ష్య ఛేదనకు దిగిన బంగ్లాదేశ్ 18.5 ఓవర్లలో కేవలం 122 పరుగులు చేసి ఆలౌట్ అయింది.
ఐదు వికెట్లతో చెలరేగి
సౌతాఫ్రికా బౌలర్ హార్డస్ విల్జోయిన్ ఐదు వికెట్లతో చెలరేగి బంగ్లా బ్యాటింగ్ ఆర్డర్ను కుదేలు చేశాడు. రోబీ ఫ్రైలింక్ రెండు వికెట్లు తీయగా.. వెయినె పార్నెల్, షాన్ వాన్ బెర్గ్ చెరో వికెట్ దక్కించుకున్నారు.
భారత్ అవుట్... సెమీ ఫైనల్లో ఆ నాలుగు జట్లు
ఇక ఈ గెలుపుతో సౌతాఫ్రికా లీగ్ దశలో అజేయంగా నిలిచి సెమీ ఫైనల్లో అడుగుపెట్టింది. మరోవైపు.. ఆస్ట్రేలియా చాంపియన్స్ ఐదింట మూడు, వెస్టిండీస్ చాంపియన్స్ ఐదింట మూడు.. ఇంగ్లండ్ చాంపియన్స్ ఐదింట రెండు మ్యాచ్లు గెలిచి సెమీస్ బెర్తు ఖరారు చేసుకున్నాయి.
అయితే, యువరాజ్ సింగ్ సారథ్యంలోని ఇండియా చాంపియన్స్ ఐదింట ఒకే ఒక్కటి గెలిచి.. టోర్నీ నుంచి నిష్క్రమించింది. బంగ్లాదేశ్ చాంపియన్స్ సైతం ఒకే ఒక్క మ్యాచ్లో విజయం సాధించి... భారత జట్టు బాటలోనే ఇంటిబాట పట్టింది.
చదవండి: IND vs WI: నీకసలు మానవత్వం, క్రీడాస్ఫూర్తి లేవా?: టీమిండియా దిగ్గజం ఫైర్
అందుకే ఓడిపోయాం.. అతడు అవుట్ కావడం వల్లే ఇలా: సంజూ


