
బెంగళూరు ఫుట్‌బాల్ క్లబ్ నిర్ణయం
ఐఎస్‌ఎల్‌పై నెలకొన్న అనిశ్చితే కారణం
బెంగళూరు: ఇండియన్ సూపర్ లీగ్ (ఐఎస్‌ఎల్) ఫుట్‌బాల్ టోర్నీలో భాగమైన ఫ్రాంచైజీ బెంగళూరు ఫుట్‌బాల్ క్లబ్ (ఎఫ్‌సీ) తమ ఆటగాళ్లు, సహాయ సిబ్బందికి వేతనాలు నిలిపివేసింది. ఈ సీజన్ ఐఎస్‌ఎల్‌పై అనిశ్చితి నెలకొనడంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు బెంగళూరు యాజమాన్యం వెల్లడించింది. ‘భారత్‌లో ఒక ఫుట్‌బాల్ క్లబ్‌ను నడపడం, కొనసాగించడం కత్తిమీద సాములాంటింది. అయినా సరే మేము ఎన్నో కష్టనష్టాలను దాటి ప్రతీ సీజన్‌లో పాల్గొన్నాం.
అయితే ప్రస్తుత సీజన్ విషయమైన తొలగని అనిశ్చితి, లీగ్ భవిష్యత్తుపై స్పష్టత లేకపోవడం వల్లే వేతనాలను నిలిపివేస్తున్నాం. ప్రస్తుతం ఇది తప్ప మాకు వేరే మార్గం లేదు. మా ఆటగాళ్ళు, సిబ్బంది... వారి కుటుంబాల శ్రేయస్సు మాకు చాలా ముఖ్యమైనది. కానీ ఏం చేస్తాం... ఏదైనా పరిష్కారం వచ్చాకే మా టీమ్ కార్యకలాపాలు యథావిధిగా ఎప్పట్లాగే మొదలుపెడతాం’ అని 2018–19 ఐఎస్‌ఎల్ సీజన్ విజేత బెంగళూరు క్లబ్ పేర్కొంది. అయితే తమ క్లబ్ చేపట్టిన క్రీడాభివృద్ధి కార్యకలాపాలకు ఎలాంటి ఢోకా ఉండదని ప్రకటించింది. యూత్, పురుషులు, మహిళల జట్ల శిబిరాలు ఎప్పట్లాగే కొనసాగుతాయని పేర్కొంది.
ఏం జరిగిందంటే...
ఐఎస్‌ఎల్ నిర్వాహక సంస్థ ఫుట్‌బాల్ స్పోర్ట్స్ డెవలప్‌మెంట్ లిమిటెడ్ (ఎఫ్‌ఎస్‌డీఎల్) 2010లో అఖిల భారత ఫుట్‌బాల్ సమాఖ్య (ఏఐఎఫ్‌ఎఫ్)తో 15 ఏళ్ల ఒప్పందం కుదుర్చుకుంది. ఈ గడువు గతేడాది డిసెంబర్ 18వ తేదీతోనే ముగిసింది. దీనిపై తదుపరి ఒప్పందంగానీ, గడువు పొడిగింపుపై గానీ ఎలాంటి పురోగతి లేకపోవడంతో జూలైలోనే ఎఫ్‌ఎస్‌డీఎల్ 2025–26 సీజన్ నిర్వహణను నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. దీంతో ఈ సీజన్ ఐఎస్‌ఎల్‌పై అనిశ్చితి నెలకొంది.
ఈ నేపథ్యంలో బెంగళూరు, జంషెడ్‌పూర్, గోవా, హైదరాబాద్, కేరళ బ్లాస్టర్స్, నార్త్‌ఈస్ట్ యునైటెడ్, ఒడిశా, పంజాబ్ ఫుట్‌బాల్ క్లబ్ (ఎఫ్‌సీ)లు ఏఐఎఫ్‌ఎఫ్ తక్షణ జోక్యం కోరుతూ లేఖ రాశాయి. ముంబై, చెన్నైయిన్ సహా బెంగాల్‌కు చెందిన మోహన్ బగన్ సూపర్ జెయింట్, ఈస్ట్ బెంగాల్, మొహమ్మదన్ స్పోర్టింగ్ క్లబ్‌లు లేఖలో సంతకం చేయలేదు. ఇటీవల ఏఐఎఫ్‌ఎఫ్ చీఫ్ కళ్యాణ్ చౌబే మాట్లాడుతూ ఈ సీజన్ ఐఎస్‌ఎల్ జరిపేందుకు భరోసా ఇచ్చారు.
రేపు క్లబ్ సీఈఓలతో సమావేశం
ఐఎస్‌ఎల్ ఫ్రాంచైజీలతో ఏఐఎఫ్‌ఎఫ్ భేటీ కావాలని నిర్ణయించింది. 8 ఫ్రాంచైజీలకు చెందిన సీఈఓలతో భారత ఫుట్‌బాల్ సమాఖ్య ఉన్నతాధికారులు రేపు ఢిల్లీలో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సీజన్ ఐఎస్‌ఎల్ నిలిపివేత తదితర పరిణామాలపై ఏఐఎఫ్‌ఎఫ్ చర్చించనున్నట్లు తెలిసింది. గతంలో సుప్రీమ్ కోర్టు మాస్టర్ రైట్స్ అగ్రిమెంట్ (ఎమ్‌ఆర్‌ఏ)పై తుది తీర్పు వచ్చే వరకు కొత్త షరతులపై సంప్రదింపులు జరపరాదని ఆదేశించింది.