Visakhapatnam: ఆర్మీలో మురిసి.. కర్రసాములో మెరిసి.. సిలంబంలో రాణిస్తున్న మహేశ్వరరావు!

Visakhapatnam: Ex Army Man Maheswara Rao Won Medals In Stick Fight - Sakshi

సిలంబంలో రాణిస్తున్న ఏయూ విద్యార్థి 

జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో పతకాలు 

ఆరోగ్య, ఆత్మరక్షణకు కర్రసాము అవసరం

యువతకు వారాంతాల్లో శిక్షణ

సమాజం పట్ల అంకితభావం.. నిత్యం నేర్చుకోవాలనే తపన.. మహేశ్వరరావును విలక్షణమైన వ్యక్తిగా గుర్తింపు తీసుకొచ్చాయి. 19 ఏళ్లకే ఆర్మీలో కొలువు సాధించిన అతను అక్కడ నేర్చుకున్న క్రమశిక్షణతో నిబద్ధతకు నిలువుటద్దంలా కనిపిస్తాడు. పని పట్ల ఓర్పు.. సహచరులను సమన్వయ పరచడంలో నేర్పు అతడి సొంతం.

ఇలా అన్నింటా ప్రత్యేకంగా కనిపించే అతడి క్రీడాసక్తి విలక్షణమైనదే. నేటి సమాజంలో దాదాపు మరిచిపోతున్న కర్రసామే అతని అభిమాన క్రీడ. ఆత్మరక్షణ కోసం మన పూర్వీకులు నేర్పిన ఆ క్రీడలో నేడు అతను అద్భుతాలు సృష్టిస్తున్నాడు. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో విజయాలు సొంతం చేసుకుంటున్నాడు.
ఎంవీపీకాలనీ(విశాఖ తూర్పు) 

ఆర్మీలో కొలువు సాధించి.. ఆ తర్వాత
దూది మహేశ్వరరావుది నగరంలోని డాబాగార్డెన్స్‌. అప్పారావు, సత్యవతి దంపతుల రెండవ సంతానం. ఆర్మీలో చేరాలని చిన్నప్పుడే లక్ష్యంగా నిర్ధేశించుకున్నాడు. తల్లిదండ్రుల ప్రోత్సాహంతో 2002లో అంటే 19 ఏళ్ల వయసులోనే ఆర్మీలో కొలువు సాధించాడు. చెన్నైలోని 11 ఇంజినీరింగ్‌ రెజ్‌మెంట్‌లో సోల్జర్‌గా సేవలందించాడు. 17 ఏళ్ల సుదీర్ఘ సేవలనంతరం 2019లో స్వచ్ఛంద పదవీ విరమణ చేశాడు.

ఆర్మీ సోల్జర్‌గా సేవలందిస్తున్న సమయంలో స్పోర్ట్స్‌ ఈవెంట్స్‌లో మహేశ్వరరావు చురుగ్గా పాల్గొనేవాడు. తమిళనాట సిలంబం(కర్రసాము).. అత్యంత ప్రాముఖ్యం ఉన్న క్రీడ కావడంతో ఆకర్షితుడయ్యాడు. ఈ దశలో ఆర్మీలో తన గురువైన రఘు వద్ద అనేక మెళకువలు నేర్చుకుని కర్రసాములోని పలు కేటగిరీలో సత్తా చాటుతున్నాడు. 

అద్భుతమైన వేదికగా ఏయూ  
పదవీ విరమణ చేసిన మహేశ్వరరావుకు ఆంధ్ర విశ్వవిద్యాలయం ఓ అద్భుతమైన వేదికగా నిలిచింది. క్రీడలపై ఆసక్తితో 2019లో ఓ ప్రైవేట్‌ కళాశాలలో బ్యాచ్‌లర్‌ ఆఫ్‌ ఫిజికల్‌ ఎడ్యుకేషన్‌ పూర్తి చేశాడు. 2021లో ఏయూ క్రీడా విభాగంలో మాస్టర్‌ ఆఫ్‌ ఫిజికల్‌ ఎడ్యుకేషన్‌ (ఎంపీఈడీ)లో అతనికి ప్రవేశం లభించింది.

ఏయూ స్పోర్ట్స్‌ బోర్డు డైరెక్టర్‌ ఆచార్య ఎన్‌.విజయమోహన్, విభాగాధిపతి డాక్టర్‌ ఎ.పల్లవి ప్రోత్సాహంతో పలు క్రీడాంశాల్లో నైపుణ్యం పెంచుకున్నాడు. స్పోర్ట్స్‌ విభాగం నిర్వహించే ఈవెంట్స్‌తో చురుగ్గా పాల్గొంటూ ఆర్మీలో నేర్చుకున్న క్రమశిక్షణ, పనిలో అంకితభావం, ఓర్పుతో సహచరులకు ఆదర్శంగా నిలుస్తున్నాడు. తనకిష్టమైన కర్రసాముకు మరింత నైపుణ్యాన్ని జోడిస్తూ వరసగా పతకాలు సాధిస్తున్నాడు. 

ఆత్మరక్షణలో కీలకం 
కర్రసాము మన పూర్వీకులు ఆదరించిన గ్రామీణ క్రీడ. భావితరాలకు అందించే ప్రయత్నం చేశారు. ఉత్తరాంధ్రలోని అనేక గ్రామాల్లో ఈ క్రీడా ఆనవాళ్లు నేటికి ఉన్నాయి. తమిళనాడులో పుట్టిన ఈ క్రీడ నేడు జపాన్, చైనా వంటి దేశాల్లో ప్రాచుర్యం పొందుతోంది. ఈ క్రీడ ద్వారా అనేక బహుళ ప్రయోజనాలు ఉన్నట్లు ఆర్మీలో ఉన్నప్పుడు గ్రహించాను. దీంతో మధురైకి చెందిన కోచ్‌ రఘు మెళకువలు నేర్చుకున్నాను.

శరీర అవయవాల రక్తప్రసరణతో పాటు ఇది అత్యంత పటిష్టమైన స్వీయరక్షణ క్రీడ. మార్షల్‌ఆర్ట్స్‌కు దీటుగా శరీర దృఢత్వాన్ని పెంచుతుంది. చిన్న కర్రతో పది మందిని నిలువరించే సత్తా ఈ క్రీడకు ఉంది. కొన్ని ప్రక్రియల ద్వారా కర్ర లేకుండానూ స్వీయరక్షణ పొందే వీలుంది.

ఇందులో నైపుణ్యత సాధించేందుకు నెల నుంచి 3 నెలల సమయం పడుతుంది. క్రమశిక్షణతో నేర్చుకోవడంతో పాటు ఏయూ ఆచార్యులు, ఆర్మీ గురువులు ఇచ్చిన ప్రోత్సాహంతో అనేక వేదికలపై రాణిస్తున్నాను. ఆసక్తి ఉన్న యువతకు వారాంతాల్లో ఈ క్రీడలో తర్ఫీదు ఇస్తున్నాను. ఆసక్తి ఉన్న వారు 70875 31301ను సంప్రదించవచ్చు.  
– దూది మహేశ్వరరావు, ఏయూ విద్యార్థి  

దూది మహేశ్వరరావు సాధించిన పతకాలివీ.. 
►కర్రసాములోని పలు కేటగిరీల్లో మహేశ్వరరావు సత్తా చాటుతున్నాడు. స్టిక్‌ఫైట్‌ సింగిల్, స్టిక్‌ఫైట్‌ డబుల్స్‌తో పాటు వాల్‌ వీచు, రెజ్లింగ్‌లోనూ ప్రతిభ చూపుతున్నాడు. 
►2021లో అరుణాచల్‌ప్రదేశ్‌లో జరిగిన నేషనల్‌ స్పోర్ట్స్‌ చాంపియన్‌షిప్‌లో స్టిక్‌ఫైట్‌ సింగిల్స్, డబుల్స్‌లో బంగారు పతకాలు సాధించాడు. 
►2021లో జరిగిన సౌత్‌ ఇండియా యూనివర్సిటీ స్పోర్ట్స్‌ చాంపియన్‌షిప్‌లో సింగిల్స్, డబుల్స్‌లో బంగారు పతకాలు సాధించాడు. 
► 2021లో డబ్ల్యూఎస్‌ఎస్‌ స్పోర్ట్స్‌ ఫెడరేషన్‌ ఆధ్వర్యంలో బెంగళూరులో జరిగిన సిలంబం వరల్డ్‌కప్‌లో సింగిల్స్‌లో 3వ స్థానం, డబుల్స్‌ లో 4వ స్థానంలో నిలచాడు.
► 2021 వరల్డ్‌ యూనియన్‌ సిలంబం ఫెడరేషన్‌ ఆధ్వర్యంలో జరిగిన నేషనల్‌ చాంపియన్‌ షిప్‌లో వాల్‌వీచులో బంగారు పతకం సాధించాడు. 
► 2022 ఏడాది ఆరంభంలో గుంటూరులో జరిగిన సిలంబం స్టేట్‌ లెవల్‌ చాంపియన్‌షిప్‌లో స్టిక్‌ఫైట్‌ సింగిల్స్‌లో బంగారం, డబుల్స్‌ లో సిల్వర్, సింగిల్‌ వాల్‌వీచులో సిల్వర్, డబుల్‌ వాల్‌వీచులో బంగారు పతకాలు సాధించాడు. 
►ఇటీవల కన్యాకుమారి వేదికగా జరిగిన జాతీయస్థాయి సిలంబం ఓపెన్‌ చాంపియన్‌షిప్‌లో మూడు వెండి, ఒక కాంస్య పతకం సాధించి సత్తా చాటాడు.
చదవండి: Suryakumar Yadav: నిరాశకు లోనయ్యాను... ఇక ముందు: సూర్యకుమార్‌ యాదవ్‌  

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top