75 వేల ఎకరాలు నిషేధిత జాబితా నుంచి తొలగించేందుకు కేబినెట్ ఆమోదం
మరో 51,603 ఎకరాల ప్రభుత్వ భూమి ఏపీఐఐసీ పేరిట రికార్డుల్లో మార్పు
పోలవరంలో రెండు ప్యాకేజీల కాంట్రాక్టర్లకు అదనపు లబ్ధికి పచ్చజెండా
సీఆర్‌డీఏ నిర్ణయాలకు కేబినెట్ ఆమోదం
సాక్షి, అమరావతి: ఏపీఐఐసీ (ఆంధప్రదేశ్ పారిశ్రామిక మౌలిక సదుపాయాల కల్పన సంస్థ)కి కేటాయించిన దాదాపు 75,000 ఎకరాల అసైన్డ్ భూములనురిజిస్ట్రేషన్ చట్టంలోని సెక్షన్ 22 ఏ నిషేధిత ఆస్తుల జాబితా నుంచి తక్షణమే తొలగించేందుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఇటీవల సీఆర్‌డీఏలో తీసుకున్న నిర్ణయాలకు మంత్రివర్గం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈమేరకు శుక్రవారం సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. అనంతరం మంత్రి పార్ధసారధి మంత్రివర్గ సమావేశంలో తీసుకున్న పలు నిర్ణయాలను మీడియాకు వెల్లడించారు.
⇒ ఏపీఐఐసీకి కేటాయించిన దాదాపు 75,000 ఎకరాల అసైన్డ్ భూములు సెక్షన్ 22 ఏ నిషేధిత ఆస్తుల జాబితా నుంచి తక్షణమే తొలగించేందుకు ఆమోదం. నిషేధిత జాబితాలో ఉన్నందున పరిశ్రమలు స్థాపిస్తున్న వారు ఈ ఆస్తులను బ్యాంకుల్లో తాకట్టు పెట్టి రుణాలు పొందలేకపోతున్నారు. అందువల్ల ఈ భూములను నిషేధిత జాబితా నుంచి తొలగించి మ్యుటేషన్‌కు అవకాశం కలి్పంచాలని కేబినెట్ నిర్ణయం. వీటికి అదనంగా మరో 51,603 ఎకరాల ప్రభుత్వ భూమితో పాటు ఇతర భూములను నేరుగా ఏపీఐఐసీ పేరిట రెవెన్యూ రికార్డుల్లో మార్చేందుకు అనుమతి.
⇒ పోలవరం హెడ్ వర్క్స్ ప్యాకేజీ 63 ఏలో రూ.23.47 కోట్ల అదనపు ఖర్చు, మరో ప్యాకేజీలో రూ.24.51 కోట్లు అదనపు ఖర్చుకు ఆమోదం. పోలవరం ఎడమ కాలువ పనుల్లో పాత ఏజెన్సీలను రద్దు చేసి మిగిలిన పనులకు 2024–25 రేట్లతో రూ.76.87 కోట్లతో ఇచి్చన టెండర్‌కు ఆమోదం.
⇒ ఏపీఎస్‌పీ బెటాలియన్లలో 300 హెడ్ కానిస్టేబుల్ పోస్టులను అసిస్టెంట్ రిజర్వ్ సబ్ ఇన్స్‌పెక్టర్లు స్థాయికి పెంచేందుకు ఆమోదం.
⇒ ‘సఖి నివాస్ పథకం’ కింద ఒంటరి మహిళలు, వితంతువులు, వివాహమై దూరంగా ఉంటున్న వారి కోసం 30 హాస్టల్స్ ఏర్పాటుకు ఆమోదం. ఒక్కో హాస్టల్ నిర్వహణకు వార్డెన్, సెక్యూరిటీ లాంటి 8 మంది సిబ్బందిని ఔట్ సోర్సింగ్‌పై తీసుకునేందుకు ఆమోదం.
⇒ వాణిజ్య పన్నుల కేసుల పరిష్కారం కోసం తిరుపతి, విజయవాడ, విశాఖపట్నంలోని మూడు అప్పీలేట్ కార్యాలయాల పరిధిని నోటిఫై చేయడానికి ఆమోదం.
⇒ జల్‌జీవన్ మిషన్ కింద రూ.9,355 కోట్ల విలువైన ఏడు ప్రాజెక్టులకు పరిపాలన ఆమోదం. రూ.1,814.71 కోట్లతో చేపట్టనున్న 3,000 పనులకు పరిపాలన ఆమోదం.
⇒ వైఎస్సార్ కడప జిల్లా జమ్మలమడుగు మండలం వేమగుంటపల్లి, సున్నపురాళ్లపల్లి, పెద్దదండ్లూరు, కోతకుంటపల్లి, తుగుట్లపల్లి గ్రామాల్లో 424.45 ఎకరాల ప్రభుత్వ భూమిని జేఎస్‌డబ్ల్యూ సంస్థ ఇంటిగ్రేటెడ్ స్టీల్ ప్లాంట్ స్థాపన కోసం కేటాయించేందుకు ఆమోదం.
⇒ జాతీయ రహదారి విస్తరణలో భాగంగా జక్కంపూడి కాలనీ వద్ద 400 కేవీ హైటెన్షన్ లైన్ ఎత్తు మార్పులకు సంబంధించి కరెంట్ సరఫరా ఆగిపోకుండా ల్యాంకో కంపెనీకి నోటీసులు జారీ చేసేందుకు ఆమోదం.
⇒ ఏప్రిల్ 1వతేదీ నుంచి 90 రోజుల పాటు జలధార పేరుతో కాలువల్లో అడ్డంకుల తొలగింపు.
⇒ ఈ నెల 16వ తేదీన శ్రీపొట్టి శ్రీరాములు జయంతి వేడుకల సందర్భంగా అమరావతిలో అమరజీవి 58 అడుగుల కాంస్య విగ్రహం ఆవిష్కరణ.


