Suryakumar Yadav: నిరాశకు లోనయ్యాను... ఇక ముందు: సూర్యకుమార్‌ యాదవ్‌

Ind Vs WI 3rd T20: Suryakumar Yadav Says He Was Disappointed Why - Sakshi

India Vs West Indies 3rd T20- Suryakuma Yadav: ఆఖరి వరకు అజేయంగా నిలిచి మ్యాచ్‌ ముగించనందుకు నిరాశకు లోనయ్యానని టీమిండియా బ్యాటర్‌ సూర్యకుమార్‌ యాదవ్‌ అన్నాడు. ఒక్కసారి క్రీజులో కుదురుకున్న తర్వాత.. లక్ష్యానికి చేరువైన సమయంలో అవుట్‌ కావడం నిరాశపరిచిందని పేర్కొన్నాడు. ఏదేమైనా తదుపరి మ్యాచ్‌లలో కూడా దూకుడైన బ్యాటింగ్‌తో ముందుకు సాగుతానని స్పష్టం చేశాడు.

కాగా వెస్టిండీస్‌తో టీ20 సిరీస్‌లో సూర్యకుమార్‌ యాదవ్‌ ఓపెనర్‌గా బరిలోకి దిగుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో మొదటి రెండు మ్యాచ్‌లలో నిరాశపరిచినా.. మూడో టీ20లో మాత్రం అదరగొట్టాడు. 44 బంతుల్లో 8 ఫోర్లు, 4 సిక్సర్లతో చెలరేగి 76 పరుగులు సాధించాడు. మరో ఓపెనర్‌, కెప్టెన్‌ రోహిత్‌ శర్మ నిరాశపరిచినా(11 పరుగులు).. తానున్నానంటూ అభయమిచ్చి టీమిండియాను విజయతీరాలకు చేర్చాడు.

నిరాశ చెందాను!
ఇక ఈ మ్యాచ్‌లో డొమినిక్‌ డ్రేక్స్‌ బౌలింగ్‌లో 15 ఓవర్‌ రెండో బంతికి ఫోర్‌ బాదిన సూర్య.. ఆ మరుసటి బంతికే అల్జారీ జోసెఫ్‌కు క్యాచ్‌ ఇచ్చి పెవిలియన్‌ చేరాడు. ఈ నేపథ్యంలో మ్యాచ్‌ అనంతరం ఇషాన్‌ కిషన్‌తో ముచ్చటిస్తూ బీసీసీఐ ఇంటర్వ్యూలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. అంతసేపు క్రీజులో ఉండి కూడా మ్యాచ్‌ ముగించలేకపోయినందుకు నిరాశకు లోనైనట్లు తెలిపాడు. 

ఈ మేరకు.. ‘‘14-15 ఓవర్ల పాటు క్రీజులో ఉండి.. విజయానికి ఇంకో 20-30 పరుగులు అవసరమైన వేళ.. క్రీజులో కుదురుకున్న బ్యాటర్‌ మ్యాచ్‌ను ఫినిష్‌ చేయాలని మనం అనుకుంటూ ఉంటాం కదా! అయితే, ఈరోజు నేను ఆ పని చేయలేకపోయాను. అయితే, తదుపరి మ్యాచ్‌లలో మాత్రం వెనక్కి తగ్గేదిలేదు.. ఇదే తరహా దూకుడైన ఆటతో ముందుకు సాగుతాను’’ అని సూర్యకుమార్‌ చెప్పుకొచ్చాడు.

మళ్లీ సున్నా నుంచి మొదలుపెట్టాల్సిందే!
ఇక ఒక్క మ్యాచ్‌లో ప్రదర్శనతో ఉప్పొంగిపోకూడదన్న సూర్యకుమార్‌ యాదవ్‌.. ‘‘ఓ ప్రముఖ క్రికెటర్‌ నాతో ఓ మాట అన్నాడు. భారీ స్కోరు చేసిన ఆనందం ఆ ఒక్క రోజుకే పరిమితం. మరుసటి రోజు మళ్లీ కొత్తగా మొదలుపెట్టాల్సిందే. సున్నా నుంచి 70.. 100 ఇలా స్కోర్‌ చేసేందుకు సన్నాహకాలు చేసుకోవాల్సి ఉంటుంది. ఇలాంటి మైండ్‌సెట్‌తో ఉంటేనే మెరుగ్గా రాణించగలం అన్నాడు. నేను ఇప్పటికీ అదే పాటిస్తా.. పరిస్థితులకు అనుగుణంగా నన్ను నేను మలచుకుంటా’’ అని పేర్కొన్నాడు. కాగా ఈ మ్యాచ్‌లో ప్రదర్శనతో సూర్య ఐసీసీ టీ20 బ్యాటింగ్‌ ర్యాంకింగ్స్‌లో రెండో స్థానానికి చేరుకున్నాడు. 

వెస్టిండీస్‌ వర్సెస్‌ ఇండియా మూడో టీ20:
►వేదిక: వార్నర్‌ పార్క్‌, సెయింట్‌ కిట్స్‌, వెస్టిండీస్‌
►టాస్‌: ఇండియా- బౌలింగ్‌
►వెస్టిండీస్‌ స్కోరు: 164/5 (20)
►ఇండియా స్కోరు: 165/3 (19)

►విజేత: ఏడు వికెట్ల తేడాతో ఇండియా గెలుపు
►ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో 2-1తో ఇండియా ముందంజ
►ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌: సూర్యకుమార్‌ యాదవ్‌(44 బంతుల్లో 8 ఫోర్లు, 4 సిక్సర్ల సాయంతో 76 పరుగులు)
చదవండి: ICC T20 Rankings: బాబర్‌ ర్యాంకుకు ఎసరుపెట్టిన సూర్య! నెంబర్‌ 1 స్థానానికి చేరువలో!

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top