Virat Kohli: ఓడిపోతున్నామనే బాధ.. కోహ్లి అసహనం

Virat Kohli Shows Frustration After DRS Overturns Dean Elgar Wicket - Sakshi

Virat Kohli Shows Frustration.. సౌతాఫ్రికాతో మూడో టెస్టులో విరాట్‌ కోహ్లి అసహనం వ్యక్తం చేయడం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. విషయంలోకి వెళితే.. ప్రొటీస్‌ ఇన్నింగ్స్‌ 21వ ఓవర్‌ అశ్విన్‌ వేశాడు. ఆ ఓవర్‌ నాలుగో బంతిని డీన్‌ ఎల్గర్‌ ఆడగా.. బంతి ప్యాడ్లను తాకుతూ ఆఫ్‌స్టంప్‌ దిశగా కీపర్‌ పంత్‌ చేతుల్లో పడింది. వెంటనే అశ్విన్‌ అప్పీల్‌కు వెళ్లగా.. ఫీల్డ్‌ అంపైర్‌ ఎరాస్మస్‌ ఔట్‌ ఇచ్చాడు. దీంతో టీమిండియా ఆటగాళ్లు సంబరాల్లో మునిగిపోయారు.

చదవండి: Jasprit Bumrah Vs Marco Jansen: బుమ్రాతో వైరం.. ఫలితం అనుభవించాడు

అయితే ఎల్గర్‌ తాను ఔట్‌ కాదన్న డౌట్‌తో రివ్యూకు వెళ్లాడు. రీప్లే చూస్తే బంతి పిచ్‌పై పడటం, లైన్‌పై దాని ప్రభావం అన్నీ బ్యాటర్‌కు వ్యతిరేకంగా ఉన్నాయి. బంతి దిశను చూసినా నేరుగా మిడిల్‌ స్టంప్‌ వద్ద బ్యాటర్‌ ప్యాడ్‌కు తగులుతున్నట్లుగా కనిపించింది. ఇక తాను అవుట్‌ అనుకుంటూ ఎల్గర్‌ నిష్క్రమించేందుకు కూడా సిద్ధమయ్యాడు. అయితే అనూహ్యంగా ‘బాల్‌ ట్రాకర్‌’ బంతి వికెట్ల పైనుంచి వెళుతున్నట్లుగా చూపించింది. దాంతో ఎరాస్మస్‌ కూడా ‘ఇదెలా సాధ్యం’ అంటూ వ్యాఖ్యానిస్తూ ఎల్గర్‌ను నాటౌట్‌గా ప్రకటించాడు. దీంతో టీమిండియా ఆటగాళ్లు షాక్‌ తిన్నారు. ముఖ్యంగా కోహ్లి ఎల్గర్‌ ఔట్‌ కాదని తేలడంతో.. కోపంలో గ్రౌండ్‌ టర్ఫ్‌ను కోపంతో తన్నడం కెమెరాలకు చిక్కింది. అశ్విన్‌ వేసిన బంతి ఎక్స్‌ట్రా బౌన్స్‌ కావడంతో బంతి స్టంప్స్‌ను మిస్‌ అయినట్లు ట్రాకింగ్‌లో కనిపించింది.

దాంతో కెప్టెన్‌ సహా టీమ్‌ సభ్యులంతా ఒకరి తర్వాత ఒకరు ‘బాల్‌ ట్రాకింగ్‌’ను తప్పుగా చూపించిన ప్రసారకర్తలపై (సూపర్‌ స్పోర్ట్స్‌) స్టంప్స్‌మైక్‌ ద్వారా తమ మాటలతో విరుచుకు పడ్డారు. ‘సూపర్‌ స్పోర్ట్స్‌... మీరు గెలిచేందుకు ఇంతకంటే మెరుగైన పద్ధతులు చూసుకోండి’ అంటూ అశ్విన్‌ అనగా.. కేఎల్‌ రాహుల్‌ కూడా ‘11 మంది ప్రత్యర్థిగా దేశం మొత్తం ఆడుతోంది’ అనేశాడు. మయాంక్‌ కూడా ‘మీరు ఆటకు చెడ్డ పేరు తెస్తున్నారు’ అంటూ వ్యాఖ్యానించాడు. ఇక కోహ్లి సహజంగానే మైదానంలో తన ఆగ్రహావేశాలు ప్రదర్శించాడు. అతని చర్యను కూడా రీప్లేలో చూపడంతో కోపం తెచ్చుకున్న కోహ్లి స్టంప్స్‌ వద్ద నిలబడి ‘ఎప్పుడూ మాపైనే దృష్టి పెడితే ఎలా. మీ టీమ్‌ను కూడా చూసుకోండి’ అన్నాడు.

ఆ తర్వాత మరో సారి ఎల్గర్‌ అవుట్‌ కోసం బుమ్రా అప్పీల్‌ చేయగా...‘వద్దులే. ఈ సారి భుజాలపైనుంచి బంతి పోతోంది అంటారేమో’ అంటూ కోహ్లి వ్యంగ్యంగా వ్యాఖ్యానించాడు. చివరకు రివ్యూ ద్వారానే భారత్‌కు ఎల్గర్‌ వికెట్‌ దక్కడం విశేషం. ఎల్గర్‌ లెగ్‌సైడ్‌ వైపు ఆడగా పంత్‌ క్యాచ్‌ అందుకొని అప్పీల్‌ చేశాడు. అంపైర్‌ నాటౌట్‌గా ఇచ్చినా రివ్యూలో ఫలితం భారత్‌కు అనుకూలంగా వచ్చింది. అయితే గొడవ తర్వాత ఏకాగ్రత కోల్పోయిన టీమిండియా 8.5 ఓవర్లలోనే 41 పరుగులు సమర్పించుకుంది.

అయితే ఇదే ఎల్గర్‌ సౌతాఫ్రికా జోహన్నెస్‌బర్గ్‌ టెస్టును గెలవడంలో కీలకపాత్ర పోషించాడు. ముఖ్యంగా ఆ మ్యాచ్‌లో రెండో ఇన్నింగ్స్‌లో నాలుగు పరుగులు తేడాతో సెంచరీకి దూరమైనప్పటికి.. 96 నాటౌట్‌ కెప్టెన్‌ ఇన్నింగ్స్‌తో మెరిసిన సంగతి తెలిసిందే. ఇక దక్షిణాఫ్రికా విజయానికి 111 పరుగుల దూరంలో ఉంది. నాలుగో రోజు ఆటలో టీమిండియా బౌలర్లు విజృంభించడంపైనే విజయావకాశాలు ఆధారపడి ఉన్నాయి. అంతకముందు టీమిండియా రెండో ఇన్నింగ్స్‌ 198 పరుగులకు ఆలౌట్‌ అయింది. పంత్‌ సెంచరీతో ఆకట్టుకోగా.. కోహ్లి 29 పరుగులు చేశాడు.

చదవండి: పంత్‌ వీరోచిత సెంచరీ.. దక్షిణాఫ్రికా గడ్డపై పలు రికార్డులు

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top