IND Vs SA 3rd Test: పంత్‌ వీరోచిత సెంచరీ.. దక్షిణాఫ్రికా గడ్డపై పలు రికార్డులు

IND Vs SA 3rd Test Day 3: Rishabh Pant Hits Century As India Set 212 Runs Target - Sakshi

కేప్‌టౌన్‌ వేదికగా దక్షిణాఫ్రికాతో జరుగుతున్న నిర్ణయాత్మక మూడో టెస్ట్‌లో టీమిండియా వికెట్‌కీపర్‌ రిషబ్‌ పంత్‌ అద్భుతం చేశాడు. వీరోచిత సెంచరీతో జట్టును ఆదుకున్నాడు. ఈ క్రమంలో దక్షిణాఫ్రికా గడ్డపై సెంచరీ చేసిన మొట్టమొదటి భారత, ఆసియా వికెట్ కీపర్‌గా రికార్డు సృష్టించాడు. 2010లో ధోని చేసిన 90 పరుగులే ఇక్కడ​ అత్యధికం కాగా, తాజాగా పంత్‌ దాన్ని అధిగమించాడు.

ఈ ఇన్నింగ్స్‌లో 139 బంతుల్లో 6 ఫోర్లు, 4 భారీ సిక్సర్ల సాయంతో 100 పరుగులతో అజేయంగా నిలిచిన పంత్‌.. ఓ పక్క క్రమం తప్పకుండా వికెట్లు పడుతున్నా, అద్భుతమైన పోరాటపటిమ కనబర్చి జట్టుకు గౌరవప్రదమైన స్కోర్‌ అందించాడు. తద్వారా టీమిండియా.. దక్షిణాఫ్రికా ముందు 212 పరుగుల ఫైటింగ్‌ టార్గెట్‌ను ఉంచగలిగింది. 

కెరీర్‌లో మూడో సెంచరీ సాధించిన పంత్‌.. అన్నింటినీ పేసర్లకు అనుకూలించే పిచ్‌లపైనే సాధించడం విశేషం. 2018లో ఇంగ్లండ్‌లో (114), అదే ఏడాది ఆస్ట్రేలియాలో (159), తాజాగా దక్షిణాఫ్రికాపై పంత్‌ శతకాలు బాదాడు. పంత్‌కు ముందు సాహా(వెస్టిండీస్‌లో 104 పరుగులు), అజయ్‌ రాత్రా(వెస్టిండీస్‌లో 115 నాటౌట్‌), విజయ్‌ మంజ్రేకర్‌(వెస్టిండీస్‌లో 118) మాత్రమే ఆసియా ఖండం బయట శతాకలు సాధించిన భారత వికెట్‌ కీపర్లుగా రికార్డుల్లో నిలిచారు. 

ఇదిలా ఉంటే, టీమిండియా సెకెండ్‌ ఇన్నింగ్స్‌ 198 పరుగుల వద్ద ముగిసింది. తొలి ఇన్నింగ్స్‌ ఆధిక్యాన్ని కలుపుకుని భారత్‌ 212 పరుగుల లక్ష్యాన్ని దక్షిణాఫ్రికా ముందుంచింది. రిషబ్‌ పంత్‌ వీరోచిత సెంచరీ(100 నాటౌట్‌)తో జట్టును ఆదుకున్నాడు. భారత ఇన్నింగ్స్‌లో కేఎల్‌ రాహుల్‌(10), కోహ్లి(29), పంత్‌ మినహా ఎవ్వరూ రెండంకెల స్కోర్‌ కూడా చేయలేకపోయారు. సఫారీ బౌలర్లలో జన్సెన్‌ 4, రబాడ, ఎంగిడి తలో 3 వికెట్లు పడగొట్టారు. అంతకుముందు భారత్‌ తొలి ఇన్నింగ్స్‌లో 223 పరుగులు, దక్షిణాఫ్రికా తొలి ఇన్నింగ్స్‌లో 210 పరుగులు చేసిన విషయం తెలిసిందే.    
చదవండి: పది రోజుల క్రితమే రిటైర్మెంట్‌ ప్రకటించాడు.. ఇంతలోనే..!

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top