కేఎల్‌ రాహుల్‌పైకి బీర్‌ బాటిల్‌ మూతలు.. కోహ్లి ఆగ్రహం

Virat Kohli Angry On Crowd Throws Beer Bottle Caps On KL Rahul Viral - Sakshi

లార్డ్స్‌: ఇంగ్లండ్‌తో జరుగుతున్న రెండో టెస్టులో కొందరు అభిమానులు చేసిన పని టీమిండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లికి ఆగ్రహం తెప్పించింది. మూడో రోజు ఆటలో భాగంగా ఇన్నింగ్స్‌ 69వ ఓవర్‌లో కేఎల్‌ రాహుల్‌ను టార్గెట్‌ చేస్తూ కొందరు ఆకతాయిలు బీర్‌ బాటిల్‌ మూతలు విసిరారు. ఇది చూసిన రాహుల్‌ అంపైర్లకు ఫిర్యాదు చేశాడు. అయితే ఈ వ్యవహారంపై ఆగ్రహం వ్యక్తం చేసిన కోహ్లి రాహుల్‌ వైపు తిరిగి.. '' ఆ మూతలను తిరిగి అటువైపే విసురు'' అన్నట్లుగా సిగ్నల్‌ ఇచ్చాడు.  దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. అయితే కోహ్లి ఈ అంశాన్ని సీరియస్‌ చేయకుండా విడిచేయడంతో వివాదం సద్దుమణిగింది. కాగా కేఎల్‌ రాహుల్‌  తొలి ఇన్నింగ్స్‌లో సెంచరీతో మెరిసిన సంగతి తెలిసిందే. 

ఇక మ్యాచ్‌ విషయానికి వస్తే.. ఇంగ్లండ్‌ రెండో టెస్టులో భారత్‌కు గట్టి పోటీనిస్తుంది. ముఖ్యంగా కెప్టెన్‌ రూట్‌ మరోసారి సెంచరీతో దుమ్మురేపడంతో ఇంగ్లండ్‌ భారీ స్కోరు దిశగా పయనిస్తోంది. ప్రస్తుతం ఇంగ్లండ్‌ 94 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 291 పరుగులు చేసింది. రూట్‌ 128, మొయిన్‌ అలీ 1 పరుగుతో క్రీజులో ఉన్నారు. అంతకముందు భారత్‌ తొలి ఇన్నింగ్స్‌లో 364 పరుగులకు ఆలౌట్‌ అయింది.

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top