
టీమిండియా చిచ్చరపిడుగు వైభవ్ సూర్యవంశీ (Vaibhav Suryavanshi) మరోసారి చెలరేగిపోయాడు. గత కొంతకాలంగా ఫార్మాట్లకతీతంగా పేట్రేగిపోగుతున్న ఈ కుర్ర డైనమైట్.. ఆస్ట్రేలియా అండర్-19 జట్టుతో జరుగుతున్న తొలి యూత్ టెస్ట్‌లో (తొలి ఇన్నింగ్స్) మరోసారి రెచ్చిపోయాడు. కేవలం 78 బంతుల్లో 7 ఫోర్లు, 7 సిక్సర్ల సాయంతో విధ్వంసకర శతకం నమోదు చేశాడు.
ఈ క్రమంలో ఓ ఆల్‌టైమ్ రికార్డు సెట్ చేశాడు. భారత్ తరఫున యూత్ టెస్ట్‌ల్లో అత్యధిక సిక్సర్లు (14) బాదిన ఆటగాడిగా తన కెప్టెన్ ఆయుశ్ మాత్రే (Ayush Mhatre) (9) రికార్డు బ్రేక్ చేసి చరిత్ర సృష్టించాడు. ఈ మ్యాచ్‌లో మొత్తంగా 86 బంతులు ఎదుర్కొని 9 ఫోర్లు, 8 సిక్సర్ల సాయంతో 113 పరుగులు చేసి ఔటయ్యాడు.
ఆసీస్ గడ్డపై ఫాస్టెస్ట్ సెంచరీ.. మెక్‌కల్లమ్ రికార్డు సమం
ఈ మ్యాచ్‌లో వైభవ్ చేసిన 78 బంతుల శతకం ఆస్ట్రేలియా గడ్డపై యూత్ టెస్ట్‌ల్లో అత్యంత వేగవంతమైంది. ఈ సెంచరీతో వైభవ్ మరో ఆల్‌టైమ్ రికార్డును కూడా సమం చేశాడు. న్యూజిలాండ్ దిగ్గజం బ్రెండన్ మెక్‌కల్లమ్ తర్వాత యూత్ టెస్ట్‌ల్లో రెండు శతకాలను 100లోపు బంతుల్లో సాధించిన ఆటగాడిగా నిలిచాడు. వైభవ్ 2024లో చెన్నైలో ఇదే ఆస్ట్రేలియా అండర్-19 జట్టుపై 58 బంతుల్లో శతక్కొట్టాడు.
మ్యాచ్ విషయానికొస్తే.. ఆస్ట్రేలియా పర్యటనలో మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌ను క్లీన్ స్వీప్ చేసిన యువ భారత్ (అండర్ 19 జట్టు).. రెండు మ్యాచ్‌ల యూత్ టెస్ట్ సిరీస్‌లోనూ సత్తా చాటుతుంది. బ్రిస్బేన్ వేదికగా జరుగుతున్న తొలి మ్యాచ్‌లో తొలుత భారత బౌలర్లు చెలరేగిపోయారు. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన ఆసీస్‌ను 243 పరుగులకే ఆలౌటై్ చేశారు.
పేసర్ దీపేశ్ దేవేంద్రన్ (16.2-6-45-5) ఐదు వికెట్ల ప్రదర్శనతో ఆసీస్ పతనాన్ని శాశించాడు. మరో పేసర్ కిషన్ కుమార్ (16-4-48-3) కూడా సత్తా చాటాడు. అన్మోల్జీత్ సింగ్, ఖిలన్ పటేల్ తలో వికెట్ తీశారు. ఆసీస్ ఇన్నింగ్స్‌లో వన్ డౌన్ బ్యాటర్ స్వీవెన్ హోగన్ (246 బంతుల్లో 92) ఒక్కడే రాణించాడు. ఆసీస్ ఇన్నింగ్స్ ముగియగానే తొలి ఆట ముగిసింది.
రెండో రోజు తొలి ఇన్నింగ్స్‌ను ప్రారంభించిన భారత్‌కు వైభవ్ సూర్యవంశీ అదిరిపోయే ఆరంభాన్ని ఇచ్చాడు. కెప్టెన్ ఆయుశ్ మాత్రే (21) కలిసి తొలి బంతి నుంచే ఆసీస్ బౌలర్లపై ఎదురుదాడి ప్రారంభించాడు. ఈ క్రమంలోనే సుడిగాలి శతకం బాదాడు. వైభవ్ ఔటయ్యాక వేదాంత్ త్రివేది ఆసీస్ బౌలర్ల భరతం పట్టడం ప్రారంభించాడు. ఈ క్రమంలో వేదాంత్ కూడా సెంచరీ పూర్తి చేశాడు.
రెండో రోజు రెండో సెషన్ సమయానికి భారత్ 53 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 298 పరుగులు చేసింది. వేదాంత్‌తో (106) పాటు రాహుల్ కుమార్ (9) క్రీజ్‌లో ఉన్నాడు. ప్రస్తుతం భారత్ ఆసీస్ తొలి ఇన్నింగ్స్ స్కోర్‌ను దాటేసి 55 పరుగుల ఆధిక్యంలో కొనసాగుతోంది. భారత ఇన్నింగ్స్‌లో విహాన్ మల్హోత్రా 6, అభిగ్యాన్ కుందు 26 పరుగులు చేశారు.
చదవండి: చెలరేగిన భారత బౌలర్లు.. స్వల్ప స్కోర్‌కే కుప్పకూలిన ఆస్ట్రేలియా