Rishabh Pant: ఫ్యామిలీ కోసం పంత్‌ కొన్న విలువైన వస్తువులు చోరీ? పోలీసుల క్లారిటీ

Uttarakhand Police Clarity On Rishabh Pant stuff Stolen After car crush - Sakshi

టీమిండియా స్టార్ క్రికెటర్ రిషభ్ పంత్ శుక్రవారం ఘోర రోడ్డు ప్రమాదానికి గురైన సంగతి తెలిసిందే. ఈ ఘటన తర్వాత రిషభ్‌ పంత్‌ నగలు, గిఫ్టులు చోరీ జరిగినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. న్యూ ఇయర్‌ కోసం కుటుంబ సభ్యులకు పంత్‌ విలువైన కానుకలు కొన్నాడని, ప్రమాదం జరిగిన సమయంలో కారులోని వస్తువులు దుండగులు ఎత్తుకెళ్లిన్నట్లు ప్రచారం జరుగుతోంది.. అతన్ని కాపాడుతున్నట్లు నటిస్తూ డబ్బు, నగలు చోరీ చేశారని, కానుకలతోపాటు క్రికెటర్‌ మెడలోని గొలుసు, బ్రేస్‌లెట్‌ కూడా చోరీకి గురైనట్లు సమాచారం. తాజాగా దీనిపై ఉత్తరాఖండ్‌ పోలీసులు క్లారిటీ ఇచ్చారు.
 

పోలసులు ఏమన్నారంటే..
రోడ్డు ప్రమాదంలో రిషభ్‌ పంత్‌ గాయాలతోపడి ఉంటే అతని దగ్గరున్న విలువైన వస్తువులు దుండగులు ఎత్తుకెళ్లారంటూ వస్తున్న వార్తలను ఖండించారు. అతని వస్తువులు, డబ్బులు ఎవరూ దొంగిలించలేదని స్పష్టం చేశారు. ఇవన్నీ తప్పుడు ప్రచారమంటూ కొట్టిపారేశారు. పంత్‌ను కాపాడిన వారు స్వయంగా అతని వస్తువులను సేకరించి భద్రపరిచారని వాటిని క్రికెటర్‌ తల్లికి అందజేసినట్లు ఉత్తరాఖండ్‌ డీజేపీ అశోక్‌ కుమార్‌ పేర్కొన్నారు. ఈ మేరకు హరిద్వార్‌ ఎస్‌ఎస్‌పీ అజయ్‌ సింగ్‌ మాట్లాడిన వీడియోను డీజీపీ షేర్‌ చేశారు.
చదవండి: Rishabh Pant: తల్లిని సర్‌ప్రైజ్‌ చేద్దామనుకుని ఇలా!.. త్వరగా కోలుకో.. కోహ్లి ట్వీట్‌

సీసీటీవీ ఫుటేజీ చెక్‌చేశాం
అందులో.. ‘రిషబ్ పంత్‌ను కాపాడిన వారే.. అతను ధరించిన విలువైన వస్తువులు. ముఖ్యంగా అతని మెడలోని ప్లాటినం చైన్, గోల్డ్‌ బ్రాస్‌లెట్.  రూ. 4 వేల నగదు గుర్తించారు. కారులో కొత్త బట్టలు కలిగి ఉన్న బ్యాగ్‌ను కూడా స్వాధీనం చేసుకున్నారు. అంబులెన్స్‌ రాగానే పంత్‌ను ఎక్కించి అతని వస్తువులు, డబ్బు, బ్యాగ్‌ను కూడా అందులో పంపించారు. తర్వాత వాటిని కుటుంబ సభ్యులకు(అతని తల్లి) అందజేశారు. ఆయన కుటుంబ సభ్యులతో మాట్లాడిన తర్వాత ఈ విషయాన్ని ధృవీకరించాం.

దీనిని విశ్లేషించేందుకు సమీపంలోని సీసీటీవీ కెమెరాల్లోని సీసీటీవీ ఫుటేజీని కూడా పరిశీలించాం. కొంతమంది యువకులు రిషభ్‌ పంత్ వస్తువులను దొంగిలించారని పలు మీడియా సంస్థలు తప్పుడు సమాచారం ఇచ్చాయి. వాస్తవానికి అలాంటి సంఘటన ఏదీ మాకు కనిపించలేదు. కాబట్టి ఈ కథనం పూర్తిగా అబద్ధం. నేను అతని కుటుంబ సభ్యులతో టచ్‌లో ఉన్నాను కాబట్టి ఈ వార్తలన్నీ నిరాధారమైనవని స్పష్టమవుతోంది’ అని పేర్కొన్నారు.

కాగా ఉత్తరాఖండ్‌ నుంచి ఢిల్లీకి తన మెర్సిడెస్‌ బెంజ్‌ కారులో పంత్‌ ప్రయాణిస్తుండగా శుక్రవారం తెల్లవారుజామున రూర్కీ సమీపంలో ప్రమాదం సంభవించింది. దీంతో క్షణాల్లోనే కారులో మంటలు చెలరేగాయి. అప్రమత్తమైన పంత్‌ కిటికీ అద్దాలు పగలగొట్టుకొని కారు నుంచి బయటకు దూకడంతో పెను ప్రమాదం నుంచి  తప్పించుకున్నాడు. అయితే డ్రైవ్ చేస్తున్న సమయంలో ఒక క్షణం నిద్రలోకి జారుకోవడంతో కారు అదుపు తప్పి డివైడర్‌ను ఢికొట్టినట్లు తెలుస్తోంది. అనంతరం కారులో మంటలు చెలరేగడంతో.. కారు పూర్తిగా అగ్నికి ఆహుతైంది.

ప్రమాదాన్ని గమనించిన అటుగా వెళ్తున్న బస్సు డ్రైవర్‌ పంత్‌ను కాపాడి అంబులెన్స్‌లో ఆసుపత్రికి తరలించారు. ఈ ప్రమాదంలో పంత్ తల, మోకాలికి గాయాలయ్యాయి. వీపు భాగం కాలిపోయింది. కాలికి ఫ్రాక్చర్ అయింది. ప్రమాద సమయంలో కారులో పంత్‌ ఒక్కడే ఉన్నట్లు ఉత్తరాఖండ్‌ డీజీపీ అశోక్‌ కుమార్‌ తెలిపారు. అక్కడి నుంచి మెరుగైన వైద్యం కోసం డెహ్రాడూన్ లోని ఆసుపత్రికి షిఫ్ట్ చేశారు. పంత్‌ ఆరోగ్యంపై బీసీసీఐ ప్రకటన విడుదల చేసింది. అతని ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని, ట్రీట్‌మెంట్‌ కొనసాగుతోందని తెలిపింది. టీమిండియా యువ బ్యాటర్‌ త్వరగా కోలుకోవాలని ప్రముఖులు, క్రికెట్‌ అభిమనులతోపాటు యావత్‌ దేశం ప్రార్ధిస్తుంది.
ఇది కూడా చదవండి: క్రికెటర్ల ప్రాణం మీదకు తెచ్చిన రోడ్డు ప్రమాదాలు

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top