క్రికెటర్ల ప్రాణం మీదకు తెచ్చిన రోడ్డు ప్రమాదాలు

Story About Five Major Car Accidents Involving Cricketers In 2022 - Sakshi

టీమిండియా క్రికెటర్‌ రిషబ్‌ పంత్‌ రోడ్డు ప్రమాదానికి గురవ్వడం క్రికెట్‌ అభిమానులను కలవరపాటుకు గురి చేసింది. అదృష్టవశాత్తూ త్రుటిలో ప్రాణాపాయం నుంచి తప్పించుకున్న పంత్‌ ప్రస్తుతం ఆసుపత్రిలో కోలుకుంటున్నాడు. అయితే వేగంతో కారు డివైడర్‌ను ఢీకొట్టడంతో పంత్‌కు గాయాలు తీవ్రంగానే అయ్యాయి. ఈ గాయాల ప్రభావం భవిష్యత్తులో అతని ఆటపై ప్రభావం చూపకూడదని దేవుడిని కోరుకుందాం.

అయితే ఈ ఏడాది క్రికెటర్లకు కలిసి రాలేదనే చెప్పాలి. ఒక్క ఏడాదిలోనే నలుగురు క్రికెటర్లు సహా ఒక అంపైర్‌ రోడ్డు ప్రమాదాలకు గురయ్యారు. దురదృష్టవశాత్తూ ఒక క్రికెటర్‌, అంపైర్‌ తమ ప్రాణాలు కూడా పోగొట్టుకున్నారు. వారిద్దరే ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్‌ ఆండ్రూ సైమండ్స్‌, అంపైర్‌  రూడీ కోర్ట్జెన్‌.

రిషబ్‌ పంత్‌:


డిసెంబర్‌ 30(శుక్రవారం తెల్లవారుజామున) ఢిల్లీ నుంచి తన ఎస్‌యూవీ కారును పంత్‌ స్వయంగా నడుపుకుంటూ వచ్చాడు. మంచి వేగంతో వచ్చిన కారు అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొట్టింది. దీంతో కారు 200 మీటర్ల దూరం దూసుకెళ్లింది. ఈలోగా కారులో మంటలు చెలరేగాయి. అయితే ఇది గమనించిన బస్‌ డ్రైవర్‌ పంత్‌ను కారులో నుంచి బయటకు లాగి అతన్ని రక్షించాడు. ప్రస్తుతం డెహ్రాడూన్‌లోని మ్యాక్స్‌ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న పంత్‌ నుదుటి రెండు కాట్లు పడ్డాయి. అదే సమయంలో కుడి మోకాలి లిగ్మెంట్‌ పక్కకు జరగడంతో సర్జరీ అవసరం కానుంది. ఇంకా చాలా గాయాలు అయ్యాయి. పంత్‌ కోలుకోవడానికి కనీసం మూడు నెలలు పట్టేలా ఉంది.

ఆండ్రూ ఫ్లింటాఫ్‌:


ఇంగ్లండ్‌ మాజీ ఆల్‌రౌండర్‌ ఆండ్రూ ఫ్లింటాఫ్‌ ఇదే నెలలో డిసెంబర్‌ 14న కారు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డాడు. బీబీసీలో ప్రసారమయ్యే "టాప్‌ గేర్‌" ఎపిసోడ్‌ చిత్రీకరిస్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. సోమవారం సర్రేలోని డన్స్‌ఫోల్డ్ పార్క్‌ ప్రాంతంలో మంచుతో నిండిన పరిస్థితులలో షూటింగ్‌ చేస్తుండగా ఈ ఘటన జరిగింది.ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన ఫ్లింటాఫ్‌ను వెంటనే ఆస్పత్రికి తరలించారు. అయితే అతడిని పరిశీలించిన వైద్యులు ఎటువంటి ప్రాణాప్రాయం లేదని తెలిపారు. దీంతో అతడి అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు.

ఆండ్రూ సైమండ్స్‌:


క్రికెట్‌ ఆస్ట్రేలియాకు ఈ ఏడాది పెద్ద విషాదం అని చెప్పొచ్చు. ఈ ఏడాది ఇద్దరు ఆస్ట్రేలియా క్రికెటర్లు కన్నుమూశారు. ఒకరు దిగ్గజ స్పిన్నర్‌ షేన్‌ వార్న్‌ అయితే.. మరొకరు ఆల్‌రౌండర్‌ ఆండ్రూ సైమండ్స్‌. కారు ప్రమాదం ఆండ్రూ సైమండ్స్‌ ప్రాణాలను బలిగొంది. మే 14న టౌన్స్‌విల్లేలో జరిగిన కారు ప్రమాదంలో సైమండ్స్‌ ప్రాణాలు కోల్పోయాడు. ఆ సమయంలో కారును స్వయంగా తానే నడుపుతున్నాడు. అయితే కారు అదుపు తప్పి రివర్‌ బ్రిడ్జీ సమీపంలో పల్టీ కొట్టింది. ఈ ప్రమాదంలో సైమండ్స్‌ అక్కడికక్కడే మృతి చెందడం అందరిని కలిచివేసింది.

బరోడా వుమెన్స్‌ జట్టు:


అక్టోబర్‌ 21 బరోడా వుమెన్స్‌ జట్టుతో వెళ్తున్న బస్సు విశాఖపట్నం ఎయిర్‌పోర్ట్‌ వెళ్లే దారిలో ప్రమాదానికి గురైంది. తాటి చెట్లపాలెం జాతీయ రహదారిపై ముందు వెళ్తున్న ట్రక్కును బస్సు వేగంగా గుద్దుకుంది. ఈ ప్రమాదంలో నలుగురు బరోడా మహిళా క్రికెటర్లకు తీవ్ర గాయాలు కాగా..మిగతావారు స్వల్ప గాయాలతో బయటపడ్డారు.

రూడీ కోర్ట్జెన్‌:


ఇదే ఏడాది ఆగస్టు 9న సౌతాఫ్రికాకు చెందిన మాజీ అంపైర్‌ రూడి కోర్ట్జెన్(73) కన్నుమూశాడు.సౌతాఫ్రికాలోని రివర్‌డేల్‌లో ఉన్న గోల్ఫ్‌ కోర్స్‌ నుంచి తిరిగి వస్తున్న సమయంలో ఆయన కారు యాక్సిడెంట్‌కు గురయ్యింది. ఈ ప్రమాదంలో కోర్ట్జెన్‌తో పాటు మరో ముగ్గురు అక్కడికక్కడే మరణించారు. పాకిస్తాన్ అంపైర్ అలీమ్ దార్, స్టీవ్ బక్నర్ తర్వాత అత్యధిక టెస్టులకు అంపైర్ గా చేసిన ఘనత సాధించాడు.బ్యాటర్ క్యాచ్ ఔట్, స్టంప్, ఎల్బీడబ్ల్యూ, రనౌట్ అయినప్పుడు ఎల్బీడబ్ల్యూ ఔట్ ఇచ్చే విధానం కూడా హైలైట్ గా ఉండేది. మెల్లిగా  చేతిని  పైకెత్తుతూ ఆయన  ఔట్ ఇచ్చే విధానానికి కల్ట్‌ ఫ్యాన్స్‌ ఉండడం విశేషం. అంతర్జాతీయ క్రికెట్ లో దీనిని  ‘ది స్లో ఫింగర్ ఆఫ్ డెత్’గా అభివర్ణించేవారు.

చదవండి: పీలే టాప్‌-10 స్టన్నింగ్‌ గోల్స్‌పై లుక్కేయాల్సిందే

మూడేళ్ల క్రితమే పంత్‌ను హెచ్చరించిన ధావన్‌

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top