
ప్రమోషన్ అండ్ రెగ్యులేషన్ ఆఫ్ ఆన్‌లైన్ గేమింగ్ బిల్లు 2025 అమల్లోకి వచ్చిన నేపథ్యంలో భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) తమ జట్లకు జెర్సీ స్పాన్సర్‌గా ఉన్న ప్రధాన గేమింగ్ ప్లాట్‌ఫాం డ్రీమ్11తో(Dream11) ఒప్పందాన్ని ఉన్నపళంగా రద్దు చేసుకుంది.
దీంతో ప్రస్తుతానికి భారత క్రికెట్ జట్ల జెర్సీలకు అధికారిక స్పాన్సర్ లేకుండా పోయారు. త్వరలో ప్రారంభం కానున్న ఆసియా కప్‌లో కూడా టీమిండియా జెర్సీ స్పాన్సర్ లేకుండానే బరిలోకి దిగవచ్చు. ఈలోపు కొత్త జెర్సీ స్పాన్సర్ దొరికితే వారి లోగోతో ఉన్న జెర్సీలతో టీమిండియా ఆటగాళ్లు ఆసియా కప్ బరిలోకి దిగుతారు.
డ్రీమ్11 స్థానంలో టీమిండియా జెర్సీని స్పాన్సర్ చేసేందుకు టొయోటా మోటార్ కార్పొరేషన్ ఆసక్తి చూపుతోంది. టొయోటాతో పాటు ఓ ఫిన్‌టెక్ స్టార్టప్, టాటా గ్రూప్, రిలయన్స్, అదానీ గ్రూప్ వంటి సంస్థలు కూడా బీసీసీఐకి తమ ఆసక్తిని తెలిపాయని సమాచారం. జెర్సీ స్పాన్సర్‌షిప్‌ను అధికారిక టెండర్ ప్రక్రియ ద్వారా నిర్ణయిస్తారు. ఇది ఇంకా ప్రారంభం కాలేదు. బీసీసీఐ త్వరలో కొత్త స్పాన్సర్ కోసం టెండర్లను ఆహ్వానించనుంది.
కాగా, 2023లో రూ. 358 కోట్లతో మూడేళ్ల కాలానికి బీసీసీఐతో డ్రీమ్11 ఒప్పందం కుదుర్చుకుంది. ఎడ్-టెక్ దిగ్గజం బైజూస్ స్థానాన్ని డ్రీమ్11 భర్తీ చేసింది. తాజాగా భారత ప్రభుత్వ నిర్ణయంతో డ్రీమ్11-బీసీసీఐ అగ్రిమెంట్ మధ్యలోనే క్యాన్సిల్ అయ్యింది.