Allyson Felix: ఏకంగా 10 ఒలింపిక్‌ పతకాలు.. ఈసారి కూతురితో

Tokyo Olympics: USA Athlete Allyson Felix 10th Olympic Medal New History - Sakshi

ఒలింపిక్స్‌ అథ్లెటిక్స్‌లో అత్యధిక పతకాలు నెగ్గిన క్రీడాకారిణిగా రికార్డు

400 మీటర్ల పరుగులో కాంస్యం

నేడు మరో ఘనతపై గురి

Allyson Felix 10th Olympic Medal: అమెరికా మహిళా స్టార్‌ అథ్లెట్‌ అలీసన్‌ ఫెలిక్స్‌ కొత్త చరిత్ర సృష్టించింది. ఒలింపిక్స్‌ అథ్లెటిక్స్‌ క్రీడాంశంలో అత్యధిక పతకాలు సాధించిన క్రీడాకారిణిగా ఆమె రికార్డు నెలకొల్పింది. టోక్యో ఒలింపిక్స్‌లో భాగంగా శుక్రవారం జరిగిన మహిళల 400 మీటర్ల ఫైనల్‌ రేసులో 35 ఏళ్ల ఫెలిక్స్‌ 49.46 సెకన్లలో గమ్యానికి చేరి మూడో స్థానంలో నిలిచి కాంస్య పతకాన్ని సాధించింది. తద్వారా 10 ఒలింపిక్‌ మెడల్స్‌ (6 స్వర్ణాలు, 3 రజతాలు, 1 కాంస్యం)తో ట్రాక్‌ అండ్‌ ఫీల్డ్‌లో అత్యధిక పతకాలు సాధించిన మహిళగా ఘనతకెక్కింది. ‘టోక్యో’కు ముందు వరకు ఈ రికార్డు జమైకా అథ్లెట్‌ మెర్లిన్‌ ఒట్టి (9 పతకాలు) పేరిట ఉండేది.

అంతేకాకుండా ఒలింపిక్స్‌ చరిత్రలో అత్యధిక పతకాలు నెగ్గిన అమెరికా అథ్లెట్‌గా పేరున్న కార్ల్‌ లూయిస్‌ (10 పతకాలు) రికార్డును కూడా ఫెలిక్స్‌ సమం చేసింది. నేడు జరిగే మహిళల 4్ఠ100 మీ. టీమ్‌ రిలేలో కూడా ఆమె పతకం సాధి స్తే... అమెరికా తరఫున అత్యధిక పతకాలు సాధించిన ట్రాక్‌ అండ్‌ ఫీల్డ్‌ అథ్లెట్‌గా ఫెలిక్స్‌ నిలుస్తుంది. ఓవరాల్‌ రికార్డు మాత్రం ఫిన్లాండ్‌ అథ్లెట్‌ పావో నుర్మీ (12 పతకాలు) పేరిట ఉంది. 400 మీ. పరుగులో ఫెలిక్స్‌ కంటే ముందుగా 48.36 సెకన్లలో గమ్యాన్ని చేరిన షానే మిల్లర్‌ విబో (బహామస్‌) స్వర్ణాన్ని... మెరిలిడీ పౌలినో (49.20 సెకన్లు–డొమినికన్‌ రిపబ్లిక్‌) రజతాన్ని దక్కించుకున్నారు.

అమ్మతనం కోసం...
ఈతరంలో ‘క్వీన్‌ ఆఫ్‌ ట్రాక్‌’గా అలీసన్‌ ఫెలిక్స్‌కు గుర్తింపు ఉంది. టోక్యోకు ముందే 6 స్వర్ణాలు సహా ఆమె ఖాతాలో 9 ఒలింపిక్‌ పతకాలు ఉన్నాయి. అద్భుత ఫలితాలు సాధి స్తుండటంతో ఆమెతో పలు పెద్ద కంపెనీలు బ్రాండింగ్‌ ఒప్పందాలు కుదుర్చుకున్నాయి. ఇందులో వరల్డ్‌ నంబర్‌వన్‌ స్పోర్ట్స్‌ కంపెనీ ‘నైకీ’ ఒకటి. నైకీతో ఫెలిక్స్‌ అనుబంధం పదేళ్లకు పైగా సాగింది. మరో అథ్లెట్‌ కెన్నెత్‌ ఫెర్గూసన్‌తో పెళ్లి తర్వాత 2018లో ఆమె తల్లి కావడానికి సిద్ధమైంది. అయితే ఈ వార్త తెలిసిన ‘నైకీ’ కాంట్రా క్ట్‌ పొడిగింపు సమయంలో గతంలో ఇచ్చిన దాంట్లో ఏకంగా 70 శాతం తక్కువగా ఇస్తామని చెప్పడంతో ఫెలిక్స్‌ షాక్‌కు గురైంది.

పైగా ప్రసవానికి ముందు, తర్వాతి రోజుల్లో ఆమె ప్రదర్శన బాగా లేకపోతే డబ్బులు తగ్గిస్తామని కూడా స్పష్టం చేసింది. ‘ఇంత పెద్ద అథ్లెట్‌నైన నాతోనే నైకీ ఇలా చేస్తే మిగతావారి పరిస్థితి ఏమిటి’ అంటూ ప్రశ్నించిన ఫెలిక్స్‌ ఆ కంపెనీతో సంబంధాలు తెంచుకుంది. ‘గ్యాప్‌’ కు చెందిన ‘అథ్లెటా’తో ఒప్పందం చేసుకుంది. వారు ‘అథ్లెట్‌...అమ్మ’ అంటూ ఆమెను తమ ప్రచారంలో వాడుకున్నారు. ఫెలిక్స్‌ దెబ్బకు అంతటి ‘నైకీ’ కూడా దిగి వచ్చింది.

జనంలో బాగా చెడ్డపేరు రావడంతో అథ్లెట్ల కోసం కొత్త మెటర్నిటీ పాలసీని ప్రకటించింది. ఇప్పుడు నైకీ అథ్లెట్లకు గ్యారంటీ మొత్తం లభించడంతో పాటు ప్రసవానికి ముందు, తర్వాత 18 నెలల బోనస్‌ కూడా లభిస్తుంది. మహిళా అథ్లెట్ల హక్కు కోసం 170 బిలియన్‌ డాలర్ల విలువ గల కంపెనీతో పోరాడేందుకు సన్నద్ధమైన ఫెలిక్స్‌... ఇప్పుడు తన కూతురు క్యామ్రిన్‌ తోడుగా పదో ఒలింపిక్‌ పతకంతో మురిసిపోతోంది!

ఫెలిక్స్‌ పతకాల జాబితా 

సంవత్సరం ఒలింపిక్స్‌ వేదిక క్రీడాంశం పతకం
2004 ఏథెన్స్‌ 200 మీటర్లు రజతం 
2008  బీజింగ్‌ 200 మీటర్లు రజతం
2008  బీజింగ్‌ 4X400 మీ.రిలే  స్వర్ణం
2012 లండన్‌ 4X100 మీ.రిలే స్వర్ణం
2012  లండన్‌  200 మీటర్లు  స్వర్ణం
2012 లండన్‌  4X400 మీ.రిలే స్వర్ణం
2016 రియో 400 మీటర్లు రజతం 
2016 రియో 4X100 మీ.రిలే  స్వర్ణం
2016 రియో 4X400 మీ.రిలే  స్వర్ణం
2020 టోక్యో  400 మీటర్లు కాంస్యం

చదవండి: Tokyo Olympics: భారత బృందం ఆసియా రికార్డు.. కానీ

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top