పోరాడి ఓడిన తెలుగు టైటాన్స్‌ | Telugu Titans fought and lost to Gujarat Giants | Sakshi
Sakshi News home page

పోరాడి ఓడిన తెలుగు టైటాన్స్‌

Nov 24 2024 4:22 AM | Updated on Nov 24 2024 10:15 AM

Telugu Titans fought and lost to Gujarat Giants

నోయిడా: ప్రొ కబడ్డీ లీగ్‌ (పీకేఎల్‌) 11వ సీజన్‌లో జోరు మీదున్న తెలుగు టైటాన్స్‌ జట్టుకు వరుసగా మూడు విజయాల తర్వాత పరాజయం ఎదురైంది. శనివారం జరిగిన పోరులో తెలుగు టైటాన్స్‌ 28–31 పాయింట్ల తేడాతో గుజరాత్‌ జెయింట్స్‌ చేతిలో ఓటమి పాలైంది. టైటాన్స్‌ తరఫున విజయ్‌ 15 పాయింట్లతో సత్తాచాటగా.. ఆశీష్‌ నర్వాల్‌ 7 పాయింట్లు సాధించాడు. గుజరాత్‌ టైటాన్స్‌ తరఫున ప్రతీక్‌ దహియా 11 పాయింట్లతో రాణించాడు. 

ఓవరాల్‌గా ఈ మ్యాచ్‌లో గుజరాత్‌ జెయింట్స్‌ 16 రెయిడ్‌ పాయింట్లు సాధించగా... తెలుగు టైటాన్స్‌ 21 పాయింట్లు సాధించింది. అయితే ట్యాక్లింగ్‌లో జెయింట్స్‌ 12 పాయింట్లతో సత్తాచాటగా... టైటాన్స్‌ 6 పాయింట్లకే పరిమితమై పరాజయం పాలైంది. తాజా సీజన్‌లో 13 మ్యాచ్‌లాడిన తెలుగు టైటాన్స్‌ 8 విజయాలు, 5 పరాజయాలతో 43 పాయింట్లు ఖాతాలో వేసుకొని పట్టికలో రెండో స్థానంలో కొనసాగుతోంది. 

గుజరాత్‌ జెయింట్స్‌కు ఇది మూడో విజయం కాగా... 20 పాయింట్లతో ఆ జట్టు పట్టికలో 11వ స్థానంలో ఉంది. మరో మ్యాచ్‌లో హరియాణా స్టీలర్స్‌ 43–30 పాయింట్ల తేడాతో జైపూర్‌ పింక్‌ పాంథర్స్‌పై గెలుపొందింది. స్టీలర్స్‌ తరఫున వినయ్, శివమ్‌ చెరో 11 పాయింట్లతో కదంతొక్కగా... జైపూర్‌ తరఫున అర్జున్‌ దేశ్వాల్‌ 16 పాయింట్లతో ఒంటరి పోరాటం చేశాడు. 

హరియాణా స్టీలర్స్‌ 13 మ్యాచ్‌ల్లో 10 విజయాలు 3 పరాజయాలతో 51 పాయింట్లతో పట్టిక ‘టాప్‌’లో నిలిచింది. లీగ్‌లో భాగంగా ఆదివారం పుణేరి పల్టన్‌తో బెంగాల్‌ వారియర్స్‌ (రాత్రి 8 గంటలకు), పట్నా పైరెట్స్‌తో యూపీ యోధాస్‌ (రాత్రి 9 గంటలకు) తలపడతాయి.  

Advertisement
 
Advertisement
Advertisement