రాజస్తాన్‌కు రెండో విజయం
జురేల్, జైస్వాల్ అర్ధ సెంచరీలు
రవి బిష్ణోయ్‌కు 4 వికెట్లు
6 పరుగులతో గుజరాత్ ఓటమి
చివరి బంతి వరకు నువ్వా నేనా అన్నట్లు సాగిన పోరులో రాజస్తాన్ రాయల్స్‌ను విజయం వరించింది. బంతి బంతికి ఆధిక్యం చేతులు మారుతూ ఉత్కంఠ ఊపేసిన మ్యాచ్‌లో గుజరాత్‌కు పరాజయం తప్పలేదు. గిల్ గైర్హాజరీలో టైటాన్స్‌కు కెప్టెన్‌గా వ్యవహరించిన రషీద్ ఖాన్... బ్యాట్‌తో తుదికంటా పోరాడినా ఫలితం లేకపోయింది. అంతకుముందు జురేల్, జైస్వాల్ మెరుపులతో భారీ స్కోరు చేసిన రాయల్స్... బౌలింగ్‌లోనూ వైవిధ్యంతో ప్రత్యర్థిని దెబ్బకొట్టింది. ఏడుగురు బౌలర్ల ప్రయోగంలో రవి బిష్ణోయ్ రఫ్ఫాడించడంతో... గుజరాత్ లక్ష్యానికి 6 పరుగుల దూరంలో నిలిచిపోయింది!
అహ్మదాబాద్: ఐపీఎల్ 19వ సీజన్‌లో రాజస్తాన్ రాయల్స్ రెండో విజయం ఖాతాలో వేసుకుంది. శనివారం జరిగిన ‘డబుల్ హెడర్’ రెండో పోరులో రాయల్స్ 6 పరుగుల తేడాతో గుజరాత్ జెయింట్స్‌పై గెలుపొందింది. టాస్ గెలిచి మొదట బ్యాటింగ్‌కు దిగిన రాజస్తాన్ 20 ఓవర్లలో 6 వికెట్లకు 210 పరుగులు చేసింది. ధ్రువ్ జురేల్ (42 బంతుల్లో 75; 5 ఫోర్లు, 5 సిక్స్‌లు), యశస్వి జైస్వాల్ (36 బంతుల్లో 55; 6 ఫోర్లు, 3 సిక్స్‌లు) హాఫ్ సెంచరీలతో ఆకట్టుకోగా... యువ ఓపెనర్ వైభవ్ సూర్యవంశీ (18 బంతుల్లో 31; 5 ఫోర్లు, 1 సిక్స్) తనకు అలవాటైన శైలిలో రెచ్చిపోయాడు.
లక్ష్యఛేదనలో గుజరాత్ టైటాన్స్ 20 ఓవర్లలో 8 వికెట్లకు 204 పరుగులకు పరిమితమైంది. సాయి సుదర్శన్ (44 బంతుల్లో 73; 9 ఫోర్లు, 3 సిక్స్‌లు) సత్తా చాటగా... ఆఖర్లో రషీద్ (16 బంతుల్లో 24; 3 ఫోర్లు), రబాడ (16 బంతుల్లో 23 నాటౌట్; 1 ఫోర్, 2 సిక్స్‌లు) పోరాడినా పలితం లేకపోయింది. చివరి ఓవర్‌లో గుజరాత్ విజయానికి 11 పరుగులు అవసరం కాగా... అప్పటి వరకు ధాటిగా ఆడిన రషీద్, రబాడ భారీ షాట్‌లు ఆడటంలో విఫలమయ్యారు. రాయల్స్ బౌలర్లలో రవి బిష్ణోయ్ 4 వికెట్లు పడగొట్టాడు.
జురేల్ జోరు...
మొదట బ్యాటింగ్‌కు దిగిన రాజస్తాన్‌కు శుభారంభం దక్కింది. సిరాజ్ వేసిన ఇన్నింగ్స్ తొలి ఓవర్‌లో వైభవ్ రెండు ఫోర్లు కొట్టగా... అతడి తదుపరి ఓవర్‌లో జైస్వాల్ 6, 4, 4 బాదాడు. అశోక్ ఓవర్‌లో వైభవ్ 4, 6 కొట్టడంతో స్కోరు బోర్డు పరుగులు పెట్టింది. ప్రసిద్‌కు జైస్వాల్ 6, 4తో స్వాగతం పలకడంతో పవర్‌ప్లే ముగిసే సరికి రాయల్స్ వికెట్ కోల్పోకుండా 69 పరుగులు చేసింది. రషీద్ ఖాన్ ఈ జోడీని విడదీశాడు. డీప్ మిడ్‌వికెట్‌లో ఫిలిప్స్ పట్టిన క్యాచ్‌కు వైభవ్ పెవిలియన్ బాటపట్టాడు. జైస్వాల్‌కు జురేల్ తోడవడంతో ఇన్నింగ్స్ సాఫీగా సాగింది.
ఈ క్రమంలో జైస్వాల్ 32 బంతుల్లో హాఫ్‌సెంచరీ పూర్తి చేసుకున్నాడు. అప్పటి వరకు నిధానంగా ఆడిన జురేల్ కూడా జోరు పెంచాడు. అర్ధ శతకం అనంతరం జైస్వాల్ అవుట్ కాగా... కెపె్టన్ రియాన్ పరాగ్ (8) విఫలమయ్యాడు. హెట్‌మైర్ (8 బంతుల్లో 18; 1 ఫోర్, 2 సిక్స్‌లు) కొన్ని షాట్‌లు ఆడగా... జురేల్ జట్టు స్కోరును రెండొందలు దాటించాడు.
రషీద్ ఖాన్ సారథ్యంలో...
గుజరాత్ టైటాన్స్ రెగ్యులర్ కెపె్టన్ శుబ్‌మన్ గిల్ ఈ మ్యాచ్‌లో బరిలోకి దిగలేదు. అతడి స్థానంలో అఫ్గానిస్తాన్ స్పిన్నర్ రషీద్ ఖాన్ టైటాన్స్‌కు సారథ్యం వహించాడు. కండరాలు పట్టేయడంతో గిల్ మ్యాచ్‌కు దూరమైనట్లు ఫ్రాంచైజీ వెల్లడించింది. అతడి స్థానంలో కుమార్ కుషాగ్రకు చోటు దక్కింది.
అశోక్ అదుర్స్... 154.2
గుజరాత్ టైటాన్స్ యువ పేసర్ అశోక్ శర్మ తన వేగంతో కట్టిపడేశాడు. నిలకడగా గంటకు 145 కిలోమీటర్లకు పైగా వేగంతో బంతులు విసురుతూ ఆకట్టుకుంటున్న అశోక్... ఈ సీజన్‌లోనే వేగవంతమైన బంతిని తన పేరిట లిఖించుకున్నాడు. ఇన్నింగ్స్ 16వ ఓవర్ చివరి బంతిని అతడు గంటకు 154.2 కిలోమీటర్ల వేగంతో సంధించాడు.
స్కోరు వివరాలు
రాజస్తాన్ రాయల్స్ ఇన్నింగ్స్: జైస్వాల్ (బి) రబాడ 55; వైభవ్ (సి) ఫిలిప్స్ (బి) రషీద్ 31; ధ్రువ్ జురేల్ (సి) బట్లర్ (బి) సిరాజ్ 75; పరాగ్ (సి) కుషాగ్ర (బి) ప్రసిధ్ 8; హెట్‌మైర్ (సి) సిరాజ్ (బి) అశోక్ 18; డొనావన్ (సి) ఫిలిప్స్ (బి) రబాడ 1; జడేజా (నాటౌట్) 7; ఆర్చర్ (నాటౌట్) 1; ఎక్స్‌ట్రాలు 14; మొత్తం (20 ఓవర్లలో 6 వికెట్లకు) 210. వికెట్ల పతనం: 1–70, 2–126, 3–135, 4–165, 5–166, 6–205. బౌలింగ్: సిరాజ్ 4–0–48–1; రబాడ 4–0–42–2; అశోక్ 4–0–37–1; ప్రసిధ్ కృష్ణ 4–0–43–1; రషీద్ ఖాన్ 4–0–39–1.
గుజరాత్ జెయింట్స్ ఇన్నింగ్స్: సాయి సుదర్శన్ (సి) దేశ్‌పాండే (బి) బిష్ణోయ్ 73; కుషాగ్ర (సి) హెట్‌మైర్ (బి) పరాగ్ 18; బట్లర్ (సి) సందీప్ (బి) బర్గర్ 26; ఫిలిప్స్ (సి) ఆర్చర్ (బి) బిష్ణోయ్ 3; సుందర్ (సి) జడేజా (బి) బిష్ణోయ్ 4; తెవాటియా (సి) జురేల్ (బి) బిష్ణోయ్ 12; షారుక్ ఖాన్ (రనౌట్) 11; రషీద్ (సి) ఆర్చర్ (బి) దేశ్‌పాండే 24; రబాడ (నాటౌట్) 23; అశోక్ (నాటౌట్) 0; ఎక్స్‌ట్రాలు 10; మొత్తం (20 ఓవర్లలో 8 వికెట్లకు) 204. వికెట్ల పతనం: 1–78, 2–107, 3–127, 4–131, 5–133, 6–155, 7–161, 8–204. బౌలింగ్: ఆర్చర్ 4–0–38–0; బర్గర్ 3–0–29–1; సందీప్ 3–0–34–0; దేశ్‌పాండే 3–0–24–1; జడేజా 2–0–25–0; పరాగ్ 1–0–11–1; బిష్ణోయ్ 4–0–41–4.


