భారత్‌ ధమాకా | Sakshi
Sakshi News home page

భారత్‌ ధమాకా

Published Mon, Nov 27 2023 3:42 AM

Team India won by 44 runs against Australia - Sakshi

తిరువనంతపురం: స్వదేశంలో జరుగుతున్న టి20 సిరీస్‌లో భారత్‌ చెలరేగిపోతోంది. అంతగా అనుభవం లేని భారత జట్టు ఆస్ట్రేలియాలాంటి మేటి జట్టును అన్ని రంగాల్లో దెబ్బకొట్టి రెండో టి20లో 44 పరుగుల తేడాతో గెలిచింది. ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో టీమిండియా 2–0తో ఆధిక్యంలో నిలిచింది. మూడో టి20 మ్యాచ్‌ గువాహటిలో మంగళవారం జరుగుతుంది. టాస్‌ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన భారత్‌ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 235 పరుగులు చేసింది.

‘ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ యశస్వి జైస్వాల్‌ (25 బంతుల్లో 53; 9 ఫోర్లు, 2 సిక్స్‌లు), రుతురాజ్‌ గైక్వాడ్‌ (43 బంతుల్లో 58; 3 ఫోర్లు, 2 సిక్స్‌లు), ఇషాన్‌ కిషన్‌ (32 బంతుల్లో 52; 3 ఫోర్లు, 4 సిక్స్‌లు) అర్ధ సెంచరీలతో చెలరేగారు. తర్వాత ఆస్ట్రేలియా 20 ఓవర్లలో 9 వికెట్లకు 191 పరుగులు చేసి ఓడిపోయింది. స్టొయినిస్‌ (25 బంతుల్లో 45; 2 ఫోర్లు, 4 సిక్స్‌లు), కెప్టెన్‌ మాథ్యూ వేడ్‌ (23 బంతుల్లో 42 నాటౌట్‌; 1 ఫోర్, 4 సిక్స్‌లు) మెరుగ్గా ఆడారు. ప్రసిధ్‌ కృష్ణ, రవిబిష్ణోయ్‌ చెరో 3 వికెట్లు తీశారు.
  
ఆరంభం నుంచే ధనాధన్‌ 
మూడో ఓవర్‌ నుంచి యశస్వి మెరుపులు మొదలవడంతో భారత్‌ స్కోరు రాకెట్‌ వేగంతో దూసుకెళ్లింది. మ్యాక్స్‌వెల్‌ వేసిన ఆ ఓవర్లో యశస్వి 2 ఫోర్లు, రుతురాజ్‌ ఒక బౌండరీ బాదాడు. అబాట్‌ నాలుగో ఓవర్‌నైతే యశస్వి 4, 4, 4, 6, 6, 0లతో చితగ్గొట్టేశాడు. దీంతో 24 పరుగులు రాగా, 3.5 ఓవర్లో భారత్‌ 50 పరుగుల్ని దాటింది. ఇదే జోరులో యశస్వి 24 బంతుల్లోనే ఫిఫ్టీ పూర్తిచేసుకున్నాక నిష్క్ర మించాడు. తర్వాత ఇషాన్‌ కిషన్‌ కూడా ధాటిగా ఆడటంతో ఓవర్‌కు 10 పైచిలుకు రన్‌రేట్‌తో భారత్‌ సాగిపోయింది.

9.5 ఓవర్లో భారత్‌ స్కోరు వందకు చేరింది. అదుపుతప్పిన బౌలింగ్‌తో మ్యాక్సీ 14వ ఓవర్లో ఏకంగా 9 బంతులేశాడు. ఇషాన్, గైక్వాడ్‌ చెరో సిక్సర్‌ బాది 23 పరుగులు పిండుకున్నారు. మరుసటి ఓవర్‌ తొలి బంతిని ఇషాన్‌ కిషన్‌ భారీ సిక్సర్‌ బాదడంతో 14.1వ ఓవర్లోనే జట్టు స్కోరు 150 పరుగుల్ని అధిగమించింది. 29 బంతుల్లో అర్ధసెంచరీ సాధించిన ఇషాన్‌ను 16వ ఓవర్లో స్టొయినిస్‌ అవుట్‌ చేశాడు. రెండు సిక్స్‌లు కొట్టిన కెప్టెన్‌ సూర్యకుమార్‌ (19) ఎక్కువసేపు నిలువలేదు.అడపాదడపా ధాటిని ప్రదర్శించిన రుతురాజ్‌ 39 బంతుల్లో ఫిఫ్టీ పూర్తిచేసుకున్నాడు.

డెత్‌ ఓవర్లలో రింకూ సింగ్‌ (9 బంతుల్లో 31 నాటౌట్‌; 4 ఫోర్లు, 2 సిక్స్‌లు) ధనాధన్‌ ఆటతో రెచ్చిపోయాడు. అబాట్‌ 19వ ఓవర్లో 4, 1వైడ్, 0, 6, 4, 4, 6లతో ఏకంగా 25 పరుగులు సాధించాడు. ఆఖరి ఓవర్‌ తొలి బంతికి సిక్స్‌ కొట్టిన రుతురాజ్‌ మరుసటి బంతికే అవుట్‌ కాగా, క్రీజులోకి వచ్చిన తిలక్‌ వర్మ (2 బంతుల్లో 7 నాటౌట్‌; 1 సిక్స్‌) భారీ షాట్‌ బాదడంతో 20 పరుగులు జతయ్యాయి.  

కూల్చేసిన బిష్ణోయ్, ప్రసిధ్‌ 
కొండంత లక్ష్యం కరిగించేందుకు బరిలోకి దిగిన ఆసీస్‌ కాసేపు ధాటిగా ఆడింది. స్పిన్నర్‌ రవి బిష్ణోయ్‌ను దించగానే ప్రత్యర్థి పతనం ఆరంభమైంది. స్మిత్‌ (19), షార్ట్‌ (19), ఇన్‌గ్లిస్‌ (2), మ్యాక్స్‌వెల్‌ (12)లాంటి కీలక వికెట్లను 58 పరుగులకే కోల్పోయింది. స్టొయినిస్, టిమ్‌ డేవిడ్‌ (22 బంతుల్లో 37; 4 ఫోర్లు, 2 సిక్స్‌లు)ల పోరాటంతో స్కోరు 100 దాటింది. ఆఖరిదాకా కెప్టెన్‌ వేడ్‌ అజేయంగా నిలిచినా ప్రయోజనం లేకపోయింది.

స్కోరు వివరాలు
భారత్‌ ఇన్నింగ్స్‌: యశస్వి (సి) జంపా (బి) ఎలిస్‌ 53; రుతురాజ్‌ (సి) డేవిడ్‌ (బి) ఎలిస్‌ 58; ఇషాన్‌ (సి) ఎలిస్‌ (బి) స్టొయినిస్‌ 52; సూర్యకుమార్‌ (సి) స్టొయినిస్‌ (బి) ఎలిస్‌ 19; రింకూ సింగ్‌ (నాటౌట్‌) 31; తిలక్‌ వర్మ (నాటౌట్‌) 7; ఎక్స్‌ట్రాలు 15; మొత్తం (20 ఓవర్లలో 4 వికెట్లకు) 235. వికెట్ల పతనం: 1–77, 2–164, 3–189, 4–221. బౌలింగ్‌: స్టోయినిస్‌ 3–0–27–1, నాథన్‌ ఎలిస్‌ 4–0–45–3, మ్యాక్స్‌వెల్‌ 2–0–38–0, అబాట్‌ 3–0–56–0, జంపా 4–0–33–0, తన్వీర్‌ సంఘా 4–0–34–0. 

ఆ్రస్టేలియా ఇన్నింగ్స్‌: స్మిత్‌ (సి) యశస్వి (బి) ప్రసిధ్‌ 19; షార్ట్‌ (బి) బిష్ణోయ్‌ 19; ఇన్‌గ్లిస్‌ (సి) తిలక్‌ వర్మ (బి) బిష్ణోయ్‌ 2; మ్యాక్స్‌వెల్‌ (సి) యశస్వి (బి) అక్షర్‌ 12; స్టొయినిస్‌ (సి) అక్షర్‌ (బి) ముకేశ్‌ 45; టిమ్‌ డేవిడ్‌ (సి) రుతురాజ్‌ (బి) బిష్ణోయ్‌ 37; వేడ్‌ (నాటౌట్‌) 42; అబాట్‌ (బి) ప్రసిధ్‌ 1; ఎలిస్‌ (బి) ప్రసిధ్‌ 1; జంపా (బి) అర్ష్దీప్‌ 1; సంఘా (నాటౌట్‌) 2; ఎక్స్‌ట్రాలు 10; మొత్తం (20 ఓవర్లలో 9 వికెట్లకు) 191. 
వికెట్ల పతనం: 1–35, 2–39, 3–53, 4–58, 5–139, 6–148, 7–149, 8–152, 9–155. బౌలింగ్‌: అర్ష్దీప్‌ 4–0–46–1, ప్రసిధ్‌ కృష్ణ 4–0–41–3, రవి బిష్ణోయ్‌ 4–0–32–3, అక్షర్‌ పటేల్‌ 4–0–25–1, ముకేశ్‌ 4–0–43–1.  

Advertisement
 
Advertisement
 
Advertisement