Shoaib Akhtar: ‘ముందు టీమిండియా.. ఆ తర్వాత న్యూజిలాండ్‌.. వదిలిపెట్టొద్దు’

T20 World Cup: Shoaib Akhtar Wants Pakistan To Go Hard On New Zealand - Sakshi

Shoaib Akhtar About T20 World Cup: పాకిస్తాన్‌ క్రికెట్‌ గడ్డు పరిస్థితులు ఎదుర్కొంటోంది. పద్దెనిమిదేళ్ల సుదీర్ఘ విరామం తర్వాత ఆ దేశంలో పర్యటించడానికి అంగీకరించిన న్యూజిలాండ్‌ చివరి నిమిషంలో టూర్‌ రద్దు చేసుకోవడంతో పెద్ద షాక్‌ తగిలిన సంగతి తెలిసిందే. ఆటగాళ్ల భద్రత దృష్ట్యా తాము ఈ నిర్ణయం తీసుకున్నట్లు కివీస్‌ బోర్డు వెల్లడించింది. ఇక ఇంగ్లండ్‌ సైతం ఇదే బాటలో నడిచింది. ఇంగ్లండ్‌ మహిళల, పురుషుల జట్లు అక్టోబరులో పాకిస్తాన్‌లో పర్యటించాల్సి ఉందని, అయితే తాము ఇందుకు సుముఖంగా లేమని ఇంగ్లండ్‌ క్రికెట్‌ బోర్డు ప్రకటన విడుదల చేసింది. 

ముందుగా నిర్ణయించినట్లుగా పాక్‌తో వన్డే, టీ20 సిరీస్‌లు ఆడలేమని స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో పాకిస్తాన్‌ మాజీ ఆటగాళ్లు విదేశీ బోర్డుల తీరుపై భగ్గుమంటున్నారు. ముఖ్యంగా రావల్పిండి ఎక్స్‌ప్రెస్‌ షోయబ్‌ అక్తర్‌.. దీనతంటికీ కివీస్‌ కారణమంటూ అగ్గిమీద గుగ్గిలం అవుతున్నాడు. ఇప్పటికే పలుమార్లు న్యూజిలాండ్‌ తీరును విమర్శించిన ఈ మాజీ బౌలర్‌.. ఇంగ్లండ్‌ ప్రకటనతో తాజాగా మరోసారి కివీస్‌పై ఆగ్రహం వ్యక్తం చేశాడు.

ఈ మేరకు.. తన యూట్యూబ్‌ చానెల్‌ వేదికగా అక్తర్‌ మాట్లాడుతూ... ‘‘ఇప్పుడు ఇంగ్లండ్‌ కూడా మనల్ని తిరస్కరించింది. మరేం.. ఫర్వాలేదు గయ్స్‌... టీ20 వరల్డ్‌కప్‌లో కలుసుకుందాం. ముఖ్యంగా బ్లాక్‌క్యాప్స్‌(న్యూజిలాండ్‌)ను బాగా గుర్తుపెట్టుకుంటాం. పంజా విసరాల్సిన సమయం వచ్చింది. వాళ్లను అస్సలు వదిలిపెట్టకూడదు బాబర్‌ ఆజం’’ అని వ్యాఖ్యానించాడు. తమను ఇంతగా అవమానించిన జట్లపై వరల్డ్‌కప్‌ ఈవెంట్‌లో పైచేయి సాధించి ప్రతీకారం తీర్చుకోవాలని పాకిస్తాన్‌ కెప్టెన్‌ బాబర్‌ ఆజమ్‌కు సూచించాడు. 

‘‘టీమిండియాతో మన మ్యాచ్‌లు మొదలవుతాయి. ఆ తర్వాత మనం ఆడబోతున్న అతి ముఖ్యమైన గేమ్‌ న్యూజిలాండ్‌తోనే కదా. అక్టోబరు 26న ఈ మ్యాచ్‌ జరుగుతుంది. అక్కడే మన ప్రతాపం చూపించాలి. అయితే, అంతకంటే ముందు పాకిస్తాన్‌ క్రికెట్‌ బోర్డు ఆటగాళ్ల ఎంపిక విషయంలో కొన్ని మార్పులు చేయాల్సి ఉంది. తుదిజట్టు ఎంత బలంగా ఉంటే మనకు అంత మంచిది. వరల్డ్‌కప్‌పై దృష్టి సారించాలి. ఇలాంటి కష్ట సమయంలో గెలుపు మనకు ఎంతో అవసరం’’ అని పీసీబీ, ఆటగాళ్లకు అక్తర్‌ పలు సూచనలు చేశాడు. 

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top