T20 WC Final: మోర్గాన్‌ చెత్త వ్యూహం.. అతడు చేసిన తప్పు అదే.. ఫైనల్‌లో ఆ రెండు జట్లే: అక్తర్‌

T20 WC: Shoaib Akhtar Slams Morgan Captaincy Wants Pak Vs Nz In Final - Sakshi

T20 WC: Shoaib Akhtar Slams Morgan Captaincy And Comments On Final: ఇంగ్లండ్‌పై ఘన విజయంతో న్యూజిలాండ్‌ తొలిసారిగా టీ20 ప్రపంచకప్‌ టోర్నీ ఫైనల్‌కు చేరుకుంది. 5 వికెట్ల తేడాతో మోర్గాన్‌ సేనను మట్టికరిపించి సగర్వంగా తుదిమెట్టుపై అడుగుపెట్టింది. డారిల్‌ మిచెల్‌ చివరి వరకు అజేయంగా నిలవగా... జేమ్స్‌ నీషమ్‌ తన అద్భుతమైన ఇన్నింగ్స్‌తో ఇంగ్లండ్‌కు చేదు అనుభవాన్ని మిగిల్చాడు. ఫలితంగా ఏమాత్రం అంచనాలు లేకుండా ప్రపంచకప్‌-2021 బరిలో దిగిన కివీస్‌.. అందరినీ ఆశ్చపరుస్తూ అద్భుత పోరాట పటిమతో తుది పోరులో నిలిచింది.

ఈ నేపథ్యంలో పాకిస్తాన్‌ మాజీ బౌలర్‌ షోయబ్‌ అక్తర్‌ సోషల్‌ మీడియా వేదికగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఫైనల్‌ మ్యాచ్‌లో న్యూజిలాండ్‌- పాకిస్తాన్‌ తలపడితే చూడాలని ఉందన్నాడు. ఈ మేరకు ఇంగ్లండ్‌- కివీస్‌ మ్యాచ్‌, ఫైనల్‌ గురించి తన యూట్యూబ్‌ చానెల్‌ అభిప్రాయం పంచుకున్నాడు. ‘‘ఇంగ్లండ్‌ బ్యాటింగ్‌ ఆర్డర్‌ అస్సలు బాగాలేదు. లివింగ్‌స్టోన్‌, మోర్గాన్‌ కాస్త ముందే క్రీజులోకి రావాల్సింది. 12 లేదంటే 13వ ఓవర్‌లో వాళ్లు వచ్చి ఉంటే.. స్కోరు 170-175కు చేరుకునేది.

కానీ అలా జరుగలేదు. మోర్గాన్‌ వ్యూహం నాకు అస్సలు నచ్చలేదు. ఇక కివీస్‌ లక్ష్య ఛేదనలో భాగంగా 17వ ఓవర్‌ను ఆదిల్‌ రషీద్‌తో వేయిస్తే బాగుండేది’’ అని అక్తర్‌ అభిప్రాయపడ్డాడు. ఈ మ్యాచ్‌లో మోర్గాన్‌ చేసిన తప్పు ఇదేనన్నట్లు పరోక్ష వ్యాఖ్యలు చేశాడు. ఇక మోర్గాన్‌, విలియమ్సన్‌.. ఇరువురి కెప్టెన్సీ ఏమంత బాగాలేదన్న అక్తర్‌... ఇరుజట్ల బ్యాటర్లు గొప్పగా ఏమీ ఆడలేదన్నాడు. ముఖ్యంగా కివీస్‌ కెప్టెన్‌ విలియమ్సన్‌(5 పరుగులు) ఈ మ్యాచ్‌తో గుణపాఠం నేర్చుకుని ఉంటాడు.. ఏదేమైనా ఒక్కసారి కుదురుకుంటే మిడిలార్డర్‌లో అతడు ఉండటం ప్రమాదకరమే’’ అని చెప్పుకొచ్చాడు.

ఇక కివీస్‌తో పాకిస్తాన్‌ ఫైనల్‌లో తలపడాలని కోరుకుంటున్నానన్న అక్తర్‌... సెమీస్‌లో ఆసీస్‌తో పోరు మరీ నల్లేరు మీద నడకేమీ కాదని అభిప్రాయపడ్డాడు. ‘‘ఫైనల్‌లో న్యూజిలాండ్‌- పాకిస్తాన్‌ ఆడితే చూడాలని ఉంది. నిజానికి మాతో ఆడటం మానసికంగా వారిపై ఒత్తిడి పెంచుతుంది. అయితే, ఇంకో ముఖ్య విషయమం ఏమిటంటే.. పాకిస్తాన్‌ మొదటిసారిగా... ఆసీస్‌తో రసవత్తర పోరులో తలపడనుంది. మేం ఫైనలిస్టులం కావాలంటే.. ముందు అగ్నిపరీక్ష ఎదుర్కోక తప్పదు’’ అని అక్తర్‌ పేర్కొన్నాడు. కాగా నవంబరు 11న ఆస్ట్రేలియాతో పాకిస్తాన్‌ సెమీస్‌లో తలపడనుంది.

స్కోర్లు:
ఇంగ్లండ్‌- 166/4 (20)
న్యూజిలాండ్‌- 167/5 (19).

చదవండి: Pak Vs Aus: ఆసీస్‌తో సెమీస్‌కు ముందు పాకిస్తాన్‌కు భారీ షాకులు.. వాళ్లు లేకుండా ఫైనల్‌ చేరడం కష్టమే?!

మీ అభిప్రాయం చెప్పండి

Loading...

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top