T20 World Cup Ind Vs Pak: వాళ్లిద్దరి మధ్య ఆసక్తికర పోరు.. ఒకవేళ అదే జరిగితే

T20 World Cup Ind Pak Clash: Salman Butt This Duel To Watch Out Contest - Sakshi

Bumrah vs Babar In T20 World Cup 2021: ఐసీసీ టీ20 వరల్డ్‌కప్‌లో భాగంగా టీమిండియా- పాకిస్తాన్‌ మధ్య జరిగే రసవత్తరమైన పోరు కోసం క్రీడాభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. చాలా కాలం తర్వాత జరగనున్న దాయాది దేశాల మధ్య పోరు ఉత్కంఠను పెంచుతుందనడంలో ఏమాత్రం సందేహం లేదు. అయితే, ఆ ఇంట్రస్టింగ్‌ మ్యాచ్‌ చూడాలంటే.. అక్టోబరు 24 వరకు ఆగాల్సిందే. యూఏఈ, ఒమన్‌ వేదికగా జరిగే మెగా టోర్నీలో భాగంగా దుబాయ్‌ జరిగే మ్యాచ్‌లో రెండు జట్లు తలపడనున్నాయి.

ఈ నేపథ్యంలో టీమిండియా మాజీ క్రికెటర్‌ గౌతం గంభీర్‌ ఇప్పటికే తన ఫేవరెట్‌ జట్టు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇక ఇప్పుడు పాకిస్తాన్‌ మాజీ కెప్టెన్‌ సల్మాన్‌ భట్‌ భారత్‌- పాక్‌ మ్యాచ్‌లో టీమిండియా స్టార్‌ పేసర్‌ జస్‌ప్రీత్‌ బుమ్రా- పాక్‌ కెప్టెన్‌ బాబర్‌ ఆజం మధ్య ఆసక్తికర పోరు జరుగనుందంటూ జోస్యం చెప్పాడు. ఈ మేరకు తన యూట్యూబ్‌ చానెల్‌ వేదికగా స్పందిస్తూ... ‘‘ చాలా ఉత్కంఠగా ఉంది. కచ్చితంగా ఓ హోరాహోరీ పోరును చూడబోతున్నాం. బాట్స్‌మెన్‌ బాబర్‌, బౌలర్‌ బుమ్రా.. ఇద్దరూ టాప్‌క్లాస్‌ ప్లేయర్లే. అనుభవం ఉన్న ఆటగాళ్లే.

అయితే, బాబర్‌ కంటే బుమ్రాకు అంతర్జాతీయ మ్యాచ్‌లలో ఆడిన అనుభవం ఎక్కువ. అయితే, ఓ కెప్టెన్‌గా బాబర్‌ ఆలోచనలు వేరుగా ఉంటాయి. వరల్డ్‌కప్‌ పోరులో ఇండియా- పాకిస్తాన్‌ మ్యాచ్‌లో బుమ్రా వర్సెస్‌ బాబర్‌ హాట్‌ ఫేవరెట్‌గా ఉండబోతోంది. వాళ్లిద్దరూ ముఖాముఖి తలపడే అవకాశాలు ఎక్కువగానే ఉన్నాయి. ఎందుకంటే.. బాబర్‌ ఓపెనర్‌గా వస్తే.. బుమ్రా తమ బౌలింగ్‌ అటాక్‌ను ఆరంభించే ఛాన్సులు ఎక్కువే.

ఆటలోని అసలైన మజా అనుభవించగలిగే ఆరోజు ఏం జరగబోతుందో చూద్దాం’’ అని సల్మాన్‌ భట్‌ అభిప్రాయపడ్డాడు. అదే విధంగా తమ పేసర్లు మెరుగ్గా రాణిస్తే గెలిచే అవకాశాలు తమకే ఎక్కువగా ఉంటాయని పేర్కొన్నాడు. షాహిన్‌ ఆఫ్రిది, హసన్‌ అలీ చెలరేగితే ప్రత్యర్థి జట్టుకు తిప్పలు తప్పవని పేర్కొన్నాడు. కాగా ఐసీసీ వన్డే వరల్డ్‌కప్‌-2019లో చివరిసారిగా ఇండియా- పాకిస్తాన్‌ పోటీపడగా.. కోహ్లి సేన 89 పరుగుల తేడా(డక్‌వర్త్‌ లూయీస్‌ నిబంధన ప్రకారం)తో ఘన విజయం సాధించింది.

చదవండి: T20 World Cup 2021: ‘ఆ రెండు జట్లే హాట్‌ ఫేవరేట్‌.. అయితే టీమిండియా కూడా’

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top