T20 World Cup 2024: రాణించిన హార్దిక్‌, రోహిత్‌.. ఐర్లాండ్‌ను చిత్తు చేసిన టీమిండియా | T20 World Cup 2024: India Beat Ireland By 8 Wickets | Sakshi
Sakshi News home page

T20 World Cup 2024: రాణించిన హార్దిక్‌, రోహిత్‌.. ఐర్లాండ్‌ను చిత్తు చేసిన టీమిండియా

Jun 5 2024 11:06 PM | Updated on Jun 6 2024 9:54 AM

T20 World Cup 2024: India Beat Ireland By 8 Wickets

టీ20 వరల్డ్‌కప్‌ 2024లో టీమిండియా విజయంతో బోణీ కొట్టింది. న్యూయార్క్‌ వేదికగా ఐర్లాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో భారత్‌ 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. తొలుత భారత బౌలర్లు మూకుమ్మడిగా రాణించి ఐర్లాండ్‌ను 96 పరుగులకే కట్టడి చేయగా.. ఛేదనలో రోహిత్‌ (52 రిటైర్డ్‌ హర్ట్‌), పంత్‌ (36 నాటౌట్‌) సత్తా చాటి టీమిండియాను గెలిపించారు.

వివరాల్లోకి వెళితే.. టాస్‌ గెలిచి తొలుత బౌలింగ్‌ ఎంచుకున్న భారత్‌ 16 ఓవర్లలో ఐర్లాండ్‌ను 96 పరుగులకు ఆలౌట్‌ చేసింది. హార్దిక్‌ పాండ్యా (4-1-27-3), అర్ష్‌దీప్‌ సింగ్‌ (4-0-35-2), సిరాజ్‌ (3-0-13-1), బుమ్రా (3-1-6-2), అక్షర్‌ పటేల్‌ (1-0-3-1) అద్భుతంగా బౌలింగ్‌ చేశారు.

ఐర్లాండ్‌ ఇన్నింగ్స్‌లో లోర్గాన్‌ టక్కర్‌ (10), కర్టిస్‌ క్యాంపర్‌ (12), గెరాత్‌ డెలానీ (26), జాషువ లిటిల్‌ (14) రెండంకెల స్కోర్‌ చేయగా.. ఆండ్రూ బల్బిర్నీ (5), పాల్‌ స్టిర్లింగ్‌ (2), హ్యారీ టెక్టార్‌ (4), జార్జ్‌ డాక్రెల్‌ (3), మార్క్‌ అదైర్‌ (3), బ్యారీ మెక్‌ కార్తీ (0) దారుణంగా విఫలమయ్యారు.

అనంతరం 97 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన భారత్‌.. ఆదిలోనే ఓపెనర్‌ విరాట్‌ కోహ్లి వికెట్‌ కోల్పోయింది. రోహిత్‌తో జతగా తొలిసారి ఓపెనింగ్‌ చేసిన కోహ్లి 5 బంతుల్లో కేవలం ఒక్క పరుగు మాత్రమే చేసి ఔటయ్యాడు. కోహ్లి.. మార్క్‌ అదైర్‌ బౌలింగ్‌లో బెంజమిన్‌ వైట్‌కు క్యాచ్‌ ఇచ్చి పెవిలియన్‌ బాట పట్టాడు.

కోహ్లి ఔటైనా ఏమాత్రం తగ్గని భారత్‌.. రోహిత్‌ (37 బంతుల్లో 52 రిటైర్డ్‌ హర్ట్‌; 4 ఫోర్లు, 3 సిక్సర్లు), పంత్‌ (26 బంతుల్లో 36 నాటౌట్‌; 3 ఫోర్లు, 2 సిక్సర్లు) సత్తా చాటడంతో 12.2 ఓవర్లలోనే కేవలం 2 వికెట్లు మాత్రమే కోల్పోయి లక్ష్యాన్ని చేరుకుంది. పంత్‌ సిక్సర్‌తో మ్యాచ్‌ ఫినిష్‌ చేశాడు. అర్ద సెంచరీ పూర్తి చేసుకున్న తర్వాత మోచేతి​కి బంతి బలంగా తాకడంతో రోహిత్‌ రిటైర్డ్‌ హర్ట్‌గా వెనుదిరిగాడు. 

Advertisement
 
Advertisement
Advertisement