T20 World Cup: అఫ్గాన్లు ప్రపంచకప్‌ గెలిచినా ఆశ్చర్యపోనక్కర్లేదు..

T20 World Cup 2021: Gautam Gambhir Warns Not To Underestimate Afghanistan - Sakshi

న్యూఢిల్లీ: యూఏఈ వేదికగా జరిగే టీ20 ప్రపంచకప్‌‌లో అఫ్గానిస్తాన్‌ని తక్కువ అంచనా వేయడానికి వీలు లేదని, ఆ జట్టు టీమిండియా లాంటి పటిష్ట జట్టుకు షాకిచ్చి ప్రపంచ ఛాంపియన్‌గా అవతరించినా  ఆశ్చర్యపోనక్కర్లేదని భారత మాజీ ఓపెనర్ గౌతం గంభీర్ అభిప్రాయపడ్డాడు. అఫ్గాన్ జట్టులో రషీద్ ఖాన్, మహ్మద్‌ నబీ లాంటి మ్యాచ్ విన్నర్లున్నారని, వారు మ్యాచ్‌ గమనాన్నే మార్చేస్తారని తెలిపాడు. ఇక త్వరలో జరగబోయే టీ20 ప్రపంచకప్‌లో దాయది పాక్‌పై భారత్‌దే పై చేయి అవుతుందని గంభీర్‌ జోస్యం చెప్పాడు. 

త్వరలో జరగబోయే టీ20 ప్రపంచకప్‌లో ఏయే జట్లకు గెలుపు అవకాశాలున్నాయనే అంశంపై గంభీర్‌ మాట్లాడుతూ.. పొట్టి ఫార్మాట్‌లో ఏ జట్టు గెలుస్తుందో కచ్చితంగా ఊహించలేమని, అసలు ఈ ఫార్మాట్‌లో ఏ జట్టునూ తక్కువ అంచనా వేయకూడదని, పరిస్థితులు తారుమారైతే అఫ్గాన్‌ జగజ్జేతగా అవతరించినా ఆశ్చర్యపోనక్కర్లేదని పేర్కొన్నాడు. భారత్‌, పాక్‌ల మధ్య పోరులో పాక్‌​పై కూడా అంచనాలు అధికంగా ఉన్నాయని, అయితే ప్రస్తుత పరిస్థితుల్లో పాక్​తో పోల్చితే టీమిండియానే బలంగా కనిపిస్తుందని చెప్పుకొచ్చాడు. 

ఇక, బలమైన జట్లు ఉన్న గ్రూప్-1‌లో కూడా హోరాహోరీ పోరు తప్పేలా లేదని, వెస్టిండీస్‌, సౌతాఫ్రికా, ఇంగ్లండ్‌, ఆసీస్‌లకు గెలుపు అవకాశాలు సమానంగా ఉన్నాయని వెల్లడించాడు. గ్రూప్‌-2లో భారత్‌, పాక్‌ సహా అప్గానిస్తాన్‌, న్యూజిలాండ్‌ జట్లు ఉన్నాయి. పాకిస్థాన్‌తో పోరుతో మెగా టోర్నీని ఆరంభించనున్న భారత్‌(అక్టోబర్ 24న).. తన తర్వాతి మ్యాచ్‌లో అక్టోబరు 31న అబుదాబి వేదికగా న్యూజిలాండ్‌ను ఢీకొంటుంది. అనంతరం నవంబరు 3న అఫ్గానిస్థాన్‌తో తలపడుతుంది. భారత్‌ తన మిగతా రెండు సూపర్‌-12 మ్యాచ్‌లను క్వాలిఫయింగ్‌ గ్రూప్‌-బి విజేత (నవంబరు 5)తో, గ్రూప్‌-ఎ రన్నరప్‌ (నవంబరు 8)తో ఆడుతుంది. 
చదవండి: ఇంటివాడైన సన్‌రైజర్స్‌ బౌలర్‌ సందీప్‌ శర్మ

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top